హెచ్‌-1బీ వీసాలపై వాన్స్‌ ఆగ్రహం.. మైక్రోసాఫ్ట్‌పై గురి! | JD Vance Slams H-1B Visa Abuse as Trump Honours Microsoft CEO Satya Nadella | Sakshi
Sakshi News home page

హెచ్‌-1బీ వీసాలపై వాన్స్‌ ఆగ్రహం.. మైక్రోసాఫ్ట్‌పై గురి!

Oct 9 2026 7:39 AM | Updated on Oct 9 2026 7:42 AM

JD Vance Slams H-1B Visa Abuse as Trump Honours Microsoft CEO Satya Nadella

హెచ్‌-1బీ వీసా విధానాన్ని తప్పుడు దోవలో వినియోగించుకుంటూ అమెరికన్ల ఉద్యోగాలకు ఎసరు పెడుతున్నారంటూ ఐటీ దిగ్గజ కంపెనీలపై అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌  తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అమెరికన్‌ ఉద్యోగులను తొలగించి.. వారి స్థానంలో తక్కువ వేతనాలకు విదేశీయులతో పనిచేయించుకుంటున్నారని ఆరోపించారు. పైగా విదేశీ ఉద్యోగులను ‘వెట్టి చాకిరీ చేసే బానిసలు’గా ఉపయోగించుకోవడాన్ని సహించబోమని స్పష్టం చేశారు.

ఈ క్రమంలో దిగ్గజ కంపెనీ మైక్రోసాఫ్ట్‌నే లక్ష్యంగా చేసుకుని ఆయన విరుచుకుపడ్డారు. గత ఏడాది 6,000 మంది అమెరికన్‌ ఉద్యోగులను తొలగించగా.. అదే సమయంలో 6,300 హెచ్‌-1బీ వీసాలు పొందిందని వాన్స్‌ పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై చర్యలు తీసుకుంటూ, విదేశీ ఉద్యోగులకు గ్రీన్‌కార్డుల కోసం దరఖాస్తు చేసే ప్రక్రియలో మైక్రోసాఫ్ట్‌పై ఆంక్షలు విధిస్తున్నట్లు ప్రకటించారు.

ఒక్కో ఉద్యోగికి బదులుగా..
మైక్రోసాఫ్ట్‌ అమెరికన్‌ ఉద్యోగులను తొలగిస్తూ.. విదేశీ ఉద్యోగుల నియామకాలను కొనసాగించడంపై వాన్స్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. గత ఏడాది సంస్థ 6,000 మంది అమెరికన్లను ఉద్యోగాల నుంచి తొలగించిందని, అదే సమయంలో 6,300 హెచ్‌-1బీ వీసాలు పొందిందని, దాదాపు 3,000 గ్రీన్‌కార్డుల ప్రక్రియలకు సంబంధించిన ప్రయోజనాలు పొందిందని చెప్పారు.

“మైక్రోసాఫ్ట్‌ గొప్ప అమెరికన్‌ సంస్థే. కానీ అమెరికన్లకు ఉద్యోగాలు ఇవ్వాలి. అమెరికన్‌ ఉద్యోగులను తొలగించి వారి స్థానంలో విదేశీ ఉద్యోగులతో వెట్టి చాకిరీ చేయించుకోలేరు” అని వాన్స్‌ వ్యాఖ్యానించారు. లెక్కలు చూస్తే.. తొలగించిన ప్రతి అమెరికన్‌ ఉద్యోగికి బదులుగా 1.5 మంది విదేశీ ఉద్యోగులను తీసుకున్నట్లుగా ఉందని ఆరోపించారు. ఇలాంటి విధానాన్ని అమెరికా ఇంతకాలం అనుమతించడం సిగ్గుచేటని విమర్శించారు.

అతితక్కువ వేతనాలతో.. 
హెచ్‌-1బీ వీసాలపై అమెరికాకు వస్తున్న ఉద్యోగులు, ముఖ్యంగా ఔట్‌సోర్సింగ్‌ సంస్థల ద్వారా నియమితులవుతున్నవారు, తక్కువ వేతనాలకు పనిచేస్తున్నారని వాన్స్‌ ఆరోపించారు. ఉద్యోగం కోల్పోతే దేశం విడిచి వెళ్లాల్సిన పరిస్థితి ఉండటంతో కొందరు విదేశీ ఉద్యోగులు యజమానులపై ఆధారపడాల్సి వస్తోందని పేర్కొన్నారు. ఈ కారణంగానే వారిని ‘ఫారిన్‌ ఇండెంచర్డ్‌ సర్వెంట్స్‌’గా అభివర్ణించారు. హెచ్‌-1బీ విధానం నైపుణ్యం కలిగిన ఉద్యోగులను అమెరికాకు తీసుకురావడానికి ఉద్దేశించిందని, అమెరికన్లను తక్కువ వేతనాలతో విదేశీయులతో భర్తీ చేయడానికి కాదని వాన్స్‌ వాదించారు.

మైక్రోసాఫ్ట్‌ వివరణ ఇదీ..
అయితే వాన్స్‌ ఆరోపణలపై మైక్రోసాఫ్ట్‌ స్పందించింది. గత ఆర్థిక సంవత్సరంలో హెచ్‌-1బీ వీసాలకు సంబంధించి తాము చేసిన దరఖాస్తుల్లో సుమారు 80 శాతం ఇప్పటికే సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగుల వీసాల పొడిగింపు లేదంటే హోదా మార్పుల కోసమేనని తెలిపింది. అవన్నీ కొత్తగా విదేశీ ఉద్యోగులను నియమించుకోవడానికి చేసిన దరఖాస్తులు కావని స్పష్టం చేసింది. అమెరికాలో తమ ఉద్యోగుల్లో అత్యధికులు అమెరికన్లేనని, హెచ్‌-1బీ ఉద్యోగులకు కూడా సమానమైన పనికి ఇతర ఉద్యోగులతో పోల్చదగిన వేతనాలు చెల్లిస్తున్నామని సంస్థ పేర్కొంది. వీసా నిబంధనలను ఉల్లంఘిస్తున్నారన్న ఆరోపణలను ప్రభుత్వం ఎలా నిర్ధారిస్తుందన్నది, ఈ చర్యలపై తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయన్నది ఇప్పుడు కీలకంగా మారింది.

గ్రీన్‌కార్డు దరఖాస్తులపై నిలిపివేత
మైక్రోసాఫ్ట్‌తో పాటు అడోబ్‌, కాగ్నిజెంట్‌, ఇన్ఫోసిస్‌, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌), విప్రో, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, క్యాప్‌జెమినీ సంస్థలను కూడా పర్మినెంట్‌ లేబర్‌ సర్టిఫికేషన్‌ ప్రక్రియ నుంచి నిలిపివేస్తున్నట్లు అమెరికా కార్మిక శాఖ ప్రకటించింది. ఈ సంస్థలకు సంబంధించిన కొత్త దరఖాస్తులను స్వీకరించబోమని, పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను కూడా ప్రాసెస్‌ చేయబోమని అధికారులు తెలిపారు. ఈ చర్య  అమెరికాలో పనిచేస్తున్న విదేశీ నిపుణులకు యజమాని ద్వారా గ్రీన్‌కార్డు పొందే ప్రక్రియపై ప్రభావం చూపుతుంది. అమెరికన్‌ ఉద్యోగులకు నష్టం కలగకుండా విదేశీ ఉద్యోగులను నియమిస్తున్నారా అనే అంశాన్ని ఈ ప్రక్రియలో పరిశీలిస్తారు.

విదేశీ ఉద్యోగుల నియామకాలపై నిబంధనలను కఠినతరం చేయాలన్న ట్రంప్‌ ప్రభుత్వ వైఖరికి అనుగుణంగానే ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. మరోవైపు, భారతీయ ఐటీ రంగానికి చెందిన సంస్థలపై ఈ నిర్ణయం ప్రభావం చూపే అవకాశం ఉండటంతో, అమెరికాలో పనిచేస్తున్న భారతీయ నిపుణులు తదుపరి పరిణామాలపై దృష్టి సారిస్తున్నారు.

ఇటు నాదెళ్లకు ట్రంప్‌ సన్మానం!
హెచ్‌-1బీ వీసాలపై జేడీ వాన్స్‌ మైక్రోసాఫ్ట్‌ను విమర్శించిన రోజే.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆ సంస్థ సీఈవో సత్య నాదెళ్లను సత్కరించారు. సాంకేతిక రంగంలో విశేష కృషికి గుర్తింపుగా నాదెళ్లకు నేషనల్‌ మెడల్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ ఇన్నోవేషన్‌ పురస్కారాన్ని అందించారు. మైక్రోసాఫ్ట్‌ అభివృద్ధిలో, క్లౌడ్‌ కంప్యూటింగ్‌ రంగంలో ఆయన పోషించిన పాత్రను ప్రశంసించారు.

ఒకవైపు అమెరికన్ల ఉద్యోగాలను విదేశీయులతో భర్తీ చేస్తున్నారంటూ మైక్రోసాఫ్ట్‌పై వాన్స్‌ విమర్శలు.. మరోవైపు అదే సంస్థ సీఈవోకు ట్రంప్‌ నుంచి పురస్కారం! ఇలా ఒకే రోజు చోటుచేసుకున్న ఈ రెండు పరిణామాలు చర్చనీయాంశంగా మారాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement