
సుప్రీంకోర్టుకు యూపీఎస్సీ వెల్లడి
న్యూఢిల్లీ: ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించిన తర్వాత తాత్కాలిక జవాబు కీని ప్రచురించాలని నిర్ణయించినట్లు యూనియన్ పబ్లిక్ సరీ్వస్ కమిషన్.. సుప్రీంకోర్టుకు తెలియజేసింది. గత నెలలో అత్యున్నత న్యాయస్థానంలో దాఖలు చేసిన అఫిడవిట్‌లో.. తుది ఫలితాల ప్రకటన తర్వాతే తుది జవాబు కీని ప్రచురిస్తామని కమిషన్ తెలిపింది. ఈ అఫిడవిట్‌ను సివిల్ సరీ్వసెస్ పరీక్షకు సంబంధించి.. పెండింగ్‌లో ఉన్న పిటిషన్‌లో దాఖలు చేశారు. ఈ కేసు విచారణలో ఉన్న సమయంలో, కోర్టు నియమించిన అమికస్ క్యూరీ సూచనతో సహా వివిధ అంశాలపై తాము చర్చించామని యూపీఎస్సీ పేర్కొంది.
‘సమగ్ర చర్చల అనంతరం.. బాగా ఆలోచించాక ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించిన తర్వాత తాత్కాలిక జవాబు కీని ప్రచురించాలని కమిషన్ నిర్ణయించింది.. అని అడ్వకేట్ వర్ధమాన్ కౌశిక్ ద్వారా దాఖలు చేసిన అఫిడవిట్‌లో పేర్కొంది. పరీక్షకు హాజరైన అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు లేదా ప్రాతినిధ్యాలు కోరతామని అందులో వివరించింది. అభ్యర్థులు తెలిపే ప్రతి అభ్యంతరం లేదా ప్రాతినిధ్యానికి మూడు ప్రామాణిక ఆధారాలను జత చేయాలని, అలా జత చేయని అభ్యంతరాలను ప్రారంభ దశలోనే తిరస్కరించాలని అఫిడవిట్‌లో తెలిపారు. ‘అయితే, సమర్పించిన ఆధారాలు ప్రామాణికమైనవా? కాదా? అనేది కమిషనే నిర్ణయిస్తుంది’.. అని కూడా అందులో స్పష్టం చేశారు.