న్యూఢిల్లీ: మరో వారం రోజుల్లో ప్రారంభంకానున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టబోయే కీలక బిల్లుల జాబితా సిద్ధమైంది. పౌర అణు ఇంధన రంగంలో ప్రైవేట్ రంగానికి స్వాగతం పలికేందుకు ఉద్దేశించిన బిల్లుతోపాటు 10 బిల్లులను ఈసారి పార్లమెంట్ ఉభయసభల్లో ప్రవేశపెట్టాలని మోదీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు శనివారం విడుదలైన ‘లోక్‌సభ, రాజ్యసభ బులెటెన్’లో కేంద్రం పలు అంశాలను వెల్లడించింది.
అణు ఇంధన బిల్లు, 2025తోపాటు కార్పోరేట్ చట్టాల(సవరణ) బిల్లు–2025, సెక్యూరిటీస్ మార్కెట్స్ కోడ్ బిల్లు–2025, జాతీయ రహదారుల(సవరణ) బిల్లులను ఉభయసభల ముందుకు తీసుకురానున్నారు. జాతీయ రహదారుల విస్తరణ, పొడగింపు కోసం భూసేకరణ ప్రక్రియ అత్యత అత్యంత పారదర్శకంగా, వేగంగా జరిగేందుకు వీలుగా నేషనల్ హైవేస్(సవరణ) బిల్లు తీసుకొస్తున్నారు.
సెక్యూరిటీస్ అండ్ ఎక్సే్ఛంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా చట్టం–1992, డిపాజిటరీస్ చట్టం–1996, సెక్యూరిటీస్ కాంట్రాక్ట్స్(నియంత్రణ)చట్టం–1956లను విలీనంచేసేందుకు ఉద్దేశించిన సెక్యూరిటీస్ మార్కెట్స్ కోడ్ బిల్లు–2025ను తీసుకొస్తున్నారు. ఆర్టిట్రేషన్, కాన్సిలియేషన్ చట్టంలోని 34వ సెక్షన్‌కు సవరణలు తేవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
చేయని తప్పులకు కంపెనీల డైరెక్టర్లు బాధ్యులవుతున్న నేపథ్యంలో అవాంఛనీయ దర్యాప్తు, విచారణల నుంచి డైరెక్టర్లకు రక్షణ కలి్పంచే ఉద్దేశంతో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆర్టిట్రేషన్, కాన్సిలియేషన్ చట్ట సంబంధ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టి, సూచనల కోసం కమిటీకి సిఫార్సుచేయాలని కేంద్రం భావిస్తోంది. చండీగఢ్ కేంద్రపాలిత ప్రాంతాన్ని రాజ్యాంగంలోని 240వ అధికరణం పరిధిలోకి తెచ్చేందుకు ఉద్దేశించిన బిల్లును సైతం ప్రవేశపెట్టనున్నారు.
ఇది చట్టంగా మారితే ఇకపై రాష్ట్రపతి నేరుగా చండీగఢ్‌పై విధానపర నిర్ణయాలు తీసుకోనున్నారు. ఇక్కడ స్వతంత్ర ప్రధాన కార్యదర్శి బదులు ఇకపై స్వతంత్ర అడ్మినిస్ట్రేటర్ ఉంటారు. తమ ఉమ్మడి రాజధాని చండీగఢ్‌పై సర్వహక్కులు తమకే దక్కుతాయని భగవంత్ మాన్(ఆప్) సారథ్యంలోని పంజాబ్ రాష్ట్రప్రభుత్వం వాదించడంతో కేంద్రం హుటాహుటిన ఈ చట్టం తెస్తున్నట్లు తెలుస్తోంది. ఈసారి సెషన్ డిసెంబర్ ఒకటో తేదీన మొదలై 15 సిట్టింగ్‌ల తర్వాత డిసెంబర్ 19న ముగియనుంది.
ఏకీకృత ఉన్నత విద్యా కమిషన్ లక్ష్యంగా..
దేశంలో ఏకీకృత ఉన్నత విద్యా కమిషన్ ఏర్పాటు లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కొత్త బిల్లును తీసుకురానుంది. దీనికి ‘ది హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(హెచ్‌ఈసీఐ)’బిల్లు అని పేరు పెట్టారు. విశ్వవిద్యాలయాలు, ఇతర ఉన్నత విద్యాసంస్థలు ఇకపై స్వయంప్రతిపత్తితో అత్యంత పారదర్శకతతో అత్యున్నత విద్యాప్రమాణాలను పాటించేలా చేయడమే ఈ బిల్లు లక్ష్యమని న్యాయశాఖ వర్గాలు తెలిపాయి.
హెచ్‌ఈసీఐను ఏర్పాటుచేయాలని నూతన విద్యావిధానం(ఎన్‌ఈపీ)లో ప్రతిపాదించడం తెల్సిందే. ప్రస్తుతం దేశవ్యాప్తంగా బోధనేతర ఉన్నత విద్యా అంశాలను చూసే విశ్వవిద్యాలయాల నిధులసంఘం(యూజీసీ), సాంకేతిక విద్యాంశాలను చూసే అఖిలభారత సాంకేతిక విద్యా మండలి(ఏఐసీటీఈ), ఉపాధ్యాయుల విద్యాంశాలను చూసే జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలిలను విలీనంచేస్తూ హెచ్‌ఈసీఐ తేవాలని బిల్లులో ప్రతిపాదించనున్నారు.


