
నా వాళ్లను వదిలేయండి
సీఎం స్టాలిన్‌ను ఉద్దేశించి టీవీకే అధ్యక్షుడు విజయ్
సాక్షి, చెన్నై: కక్ష సాధింపు చర్యలకు పాల్పడాలంటే తనను ఏమైనా చేసుకోవాలని, తన కేడర్‌ను విడిచి పెట్టాలని తమిళనాడు ప్రభుత్వానికి తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధ్యక్షుడు విజయ్ విజ్ఞప్తి చేశారు. కరూర్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనపై మూడు రోజుల తర్వాత విజయ్ ఒక వీడియో విడుదల చేశారు. తన జీవితంలో ఇంత వేదన ఎన్నడూ అనుభవించలేదని తెలిపారు. ప్రజలు చూపుతున్న ఆదరాభిమానాలకు రుణపడి ఉంటానని పేర్కొన్నారు. ప్రజల భద్రత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని చెప్పారు. జరగకూడనిది జరిగిందని, ఘటన జరిగిన రోజున తాను అక్కడే ఉంటే, పరిస్థితిని మరింత సమస్యాత్మకంగా మార్చేస్తారేమోనని చెన్నైకి వచ్చేసినట్టు వివరించారు.
సీఎం సార్ ..
విజయ్ వీడియోలో కొన్ని కీలక అంశాలను ప్రస్తావించారు. ‘ఐదు జిల్లాలకు ప్రచారానికి వెళ్లాను. కరూర్‌లో మాత్రమే ఎందుకు జరిగింది.. ఎలా జరిగింది.. ఏం జరిగింది.. ప్రజలకు అన్ని వాస్తవాలు తెలుసు. ప్రజలు అన్నింటిని చూస్తున్నారు..’ అని పేర్కొన్నారు. ‘కరూర్ ప్రజలు బయటకు వచ్చి వాస్తవాలు చెబుతున్నప్పుడు దేవుడే తన ముందుకు వచ్చి చెబుతున్నట్టుగా అనిపించింది. కేటాయించిన స్థలానికి వెళ్లి నిలబడి ప్రసంగించారు. ఏ తప్పు చేయలేదు. అయితే, నా పార్టీ వర్గాలను కేసుల పేరిట వేధిస్తున్నారు. అరెస్టులు చేస్తున్నారు.
సీఎం సార్.. కక్షసాధింపు చర్య ఏదైనా ఉంటే .. నన్ను ఏమైనా చేసుకోండి. నా వాళ్లను వదలేయండి. ఇంట్లో లేదా ఆఫీసులో ఉంటాను.. నా వాళ్లను వదిలేయండి..’ అని అన్నారు. అలాగే కేడర్‌కు భరోసా ఇస్తూ, రాజకీయ ప్రయాణం మరింత బలంగా, ధైర్యంగా కొనసాగిస్తాం.. అని ముగించారు. టీవీకే వర్గాలపై కేసులు, అరెస్టుల ప్రక్రియ సాగుతుండటంతో ఆయన ఈ వీడియోను విడుదల చేసినట్టుందనే విమర్శలు వెల్లువెత్తాయి. ఇందులో ఆయన కక్షసాధింపు అంటూ సీఎం స్టాలిన్‌ను టార్గెట్ చేయడం మరింత చర్చకు దారితీసింది.
ఇద్దరు నేతలకు రిమాండ్
తొక్కిసలాట ఘటనకు సంబంధించి టీవీకే కరూర్ పశ్చిమ జిల్లా కార్యదర్శి మది అళగన్, కరూర్ నగర్ ఇన్‌చార్జ్ మాశి పొన్‌రాజ్‌లను పోలీసులు అరెస్టు చేశారు. వారిని మంగళవారం కరూర్ కోర్టులో న్యాయాధికారి భరత్‌కుమార్ ఎదుట హాజరుపరిచారు. అక్టోబర్ 14వ తేదీ వరకు రిమాండ్ విధిస్తున్నట్లు ప్రకటించారు.
బీజేపీ బృందం అనుమానాలు
తొక్కిసలాటకు సంబంధించి వాస్తవాలను తెలుసుకునేందుకు బీజేపీ ఎంపీ హేమమాలిని నేతృత్వంలో ఎనిమిదిమంది ఎంపీలున్న బీజేపీ నిజనిర్ధారణ కమిటీ మంగళవారం కరూర్‌లో పర్యటించింది. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ.. ప్రచారసభ కోసం సరైన స్థలం కేటాయించలేదని చెప్పారు. ఇరుకైన రోడ్డులో అనుమతి ఇవ్వడం, విద్యుత్ సరఫరా ఆగడం, చెప్పులు విసరడం వంటి అంశాలను పరిశీలిస్తే ఈ ఘటన యాదృచ్ఛికంగా జరిగినట్టు కనిపించడం లేదని అనుమానాలు వ్యక్తం చేశారు.
ఇదిలా ఉండగా తమిళనాడు ప్రభుత్వం తరఫున అధికార ప్రతినిధులుగా ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి అముదా నేతృత్వంలో ఏడీజీపీ డేవిడ్సన్ దేవాశీర్వాదం, ఇతర అధికారుల బృందం మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. తొక్కిసలాటకు కారణాలు, రద్దీపెరగడం వంటి అనేక అంశాలను వీడియో ఆధారాలతోసహా విడుదల చేసిన అధికారులు మీడియా అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు.