అడవులు తగ్గిపోతున్నాయి, రోడ్లు విస్తరిస్తున్నాయి… ఈ రెండు ప్రపంచాలు కలిసిన చోట తరచూ కనిపించేది ఘర్షణే. కానీ అప్పుడప్పుడూ అలాంటి చోటే మనసును తాకే చిన్న మానవత్వపు క్షణాలు కూడా పుట్టుకొస్తాయి. అలాంటి ఓ దృశ్యమే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అడవి అంచున ఉన్న ఓ రహదారిపై సాధారణంగా వాహనాలు రద్దీగా వెళ్తున్నాయి. ఆ రోజు కూడా అలాగే ట్రాఫిక్ సహజంగానే సాగుతోంది. కానీ ఒక్కసారిగా అడవి వైపు నుంచి ఓ భారీ దంతం కలిగిన ఏనుగు దాగుడు మూతలాడుతోంది. అది రోడ్డు దాటాల్సిన సమయం. అందుకే అలా!. ఆ క్షణంలో వాహనాల వేగం ఆగిపోయింది… కానీ అది ట్రాఫిక్ జామ్ కాదు, ఒక బాధ్యత ఆగిన క్షణం.
అక్కడ విధుల్లో ఉన్న ఫారెస్ట్ గార్డ్ వెంటనే స్పందించాడు. ఎలాంటి ఆలస్యం లేకుండా రోడ్డుమధ్యకు వచ్చి చేతులతో సంకేతాలు ఇస్తూ వాహనాలను నిలిపివేశాడు. సాధారణంగా ఇలాంటి ఆపడం వీఐపీ కాన్వాయ్‌ల కోసం చూస్తాం. కానీ ఇక్కడ కారణం వేరే. ఆ రోడ్డు మీద ప్రయాణించే ప్రతి మనిషికి అతను ఒకే సందేశం ఇచ్చాడు.
వాహనాలు నిలిచిపోయాయి. ఇంజిన్ల శబ్దం కొద్దిసేపు తగ్గిపోయింది. ఆ నిశ్శబ్దంలో ఏనుగు ఎలాంటి భయమూ లేకుండా మామూలుగానే రోడ్డుపైకి వచ్చింది. ఎటువంటి ఆందోళన లేకుండా అది ఒక్క అడుగు తర్వాత ఒక్క అడుగు వేస్తూ మరో వైపు అడవిలోకి సాగిపోయింది. మనుషుల ప్రపంచం ఆ క్షణం కోసం పూర్తిగా ఆగిపోయింది.. కానీ ప్రకృతి మాత్రం తన మార్గంలో ప్రశాంతంగా సాగిపోయింది.
A forest guard halts traffic, not for a VIP convoy, but for a wild elephant to cross the road.
Sometimes the road belongs to those who were here long before us.
This is how humans and wildlife can coexist. pic.twitter.com/Dc1aNZWnfU— Manas Muduli (@manas_muduli) June 25, 2026
ఈ మొత్తం దృశ్యాన్ని ఒక వాహనంలో నుంచి ఎవరో వీడియో తీశారు. ఆ వీడియోను మానస్ ముదులి అనే యూజర్ సోషల్ మీడియాలో పంచుకోవడంతో అది క్షణాల్లో వైరల్ అయింది. ఆయన చేసిన వ్యాఖ్య కూడా అందరి హృదయాలను తాకింది. “ఇది వీఐపీ కోసం ఆపిన ట్రాఫిక్ కాదు… మన కంటే ముందే ఇక్కడ ఉన్న జీవి కోసం ఇచ్చిన గౌరవం” అన్న భావం ఆ వీడియోలో స్పష్టంగా కనిపించింది.
ఈ వైరల్ వీడియో ఎప్పుడు? ఎక్కడ? చిత్రీకరించారనే దానిపై క్లారిటీ లేదు. వీడియోను షేర్ చేసిన మానస్ ముదులి సాధారణంగా ఒడిశా, తూర్పు భారతదేశంలోని వన్యప్రాణుల అంశాలపై పోస్టులు చేస్తుంటారు. అయితే ఈ వీడియోలో.. యూనిఫాం, రహదారి, అడవి వాతావరణం చూస్తే ఇది ఏనుగుల కారిడార్ ప్రాంతాల్లో తీసిన వీడియోగా తెలుస్తోంది. నెటిజన్లను మాత్రం ఆకట్టుకుంటోంది.
ఈ వీడియో చూసిన నెటిజన్లు భావోద్వేగానికి లోనయ్యారు. కొందరు ఇది నిజమైన మానవత్వం అన్నారు. మరికొందరు మనిషి–ప్రకృతి సహజీవనానికి ఇది చిన్న కానీ బలమైన ఉదాహరణ అని అభిప్రాయపడ్డారు. ఫారెస్ట్ గార్డ్ తీసుకున్న నిర్ణయాన్ని చాలామంది ధైర్యంగా, సరైన చర్యగా అభినందించారు. అభివృద్ధి పేరుతో అడవులు కుంచించుకుపోతున్న ఈ రోజుల్లో.. వన్యప్రాణులు తమ సహజ మార్గాల్లో ప్రయాణించడానికి కూడా కష్టపడాల్సిన పరిస్థితి ఉంది. అలాంటి సందర్భాల్లో ఇలాంటి చిన్న జాగ్రత్తలే కదా పెద్ద ప్రమాదాలను నివారించేది!.


