వేలూరు(తమిళనాడు): తమిళనాడులోని తిరువణ్ణామలైలో గిరిప్రదక్షిణ చేసే మహిళలను లక్ష్యంగా చేసుకుని, వీడియోలు తీసి, బ్లాక్‌మెయిల్ చేస్తూ అరాచకాలకు పాల్పడుతున్న దారుణ ఉదంతం ఇటీవల వెలుగులోకి వచ్చింది. ఈ అమానుష ఘటనకు సంబంధించి అరెస్ట్ అయిన నిందితుల్లో ఎనిమిది మందిపై కలెక్టర్ ఆదేశాల మేరకు గూండా చట్టం కింద కేసు నమోదు చేసి జైలుకు తరలించారు.
వివాహ వార్షికోత్సవం రోజే దారుణం
పోలీసుల వివరాల మేరకు.. ధర్మపురి జిల్లాకు చెందిన 22 ఏళ్ల యువతి తన వివాహ వార్షికోత్సవం సందర్భంగా తిరువణ్ణామలై గిరివలయం మార్గంలో వెళ్తుండగా ఒక ముఠా ఆమెను అడ్డుకుంది. ఆ యువతిని బలవంతంగా నగ్నంగా మార్చి, వీడియోలు తీసి, వాటిని సోషల్ మీడియాలో పెడతామని బెదిరించారు. ఆపై ఆమె వద్ద ఉన్న నగలు, నగదును దోచుకున్నారు. బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు.. ఈ ఘాతుకానికి పాల్పడిన ప్రధాన నిందితులు సహా మొత్తం 10 మందిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వారి నుంచి 9 మొబైల్ ఫోన్లు, 3 బైక్‌లను స్వా«దీనం చేసుకున్నారు. స్వా«దీనం చేసుకున్న సెల్ ఫోన్లలో అనేక మంది మహిళలకు సంబంధించిన అశ్లీల వీడియో రికార్డింగ్‌లు ఉన్నట్లు గుర్తించిన పోలీసులు.. పూర్తి వివరాల కోసం వాటిని ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి పంపారు. కొద్ది రోజుల్లో దీనికి సంబంధించిన సమగ్ర నివేదిక రానుంది.
గూండా చట్టం కింద అరెస్ట్
ఈ కేసులో నిందితులుగా ఉన్న వాసుదేవన్, ఆకాశ్ అప్పు, హరిహరన్, శర్మ శివగణేశన్, అరుణ్‌కుమార్, దురై సహా మొత్తం 8 మందిని సమాజానికి అత్యంత ప్రమాదకరమైన వ్యక్తులుగా గుర్తిస్తూ వారిపై గూండా చట్టాన్ని ప్రయోగించాలని జిల్లా ఎస్పీ ఉదయకుమార్ కలెక్టర్‌కు సిఫార్సు చేశారు. సిఫార్సును పరిశీలించిన జిల్లా కలెక్టర్ వందనాకార్గ్ సదరు 8 మందిపై గూండా చట్టం కింద చర్యలు తీసుకోవాలని ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఆదేశాల ఆధారంగా నాన్ బెయిల్‌బుల్ సెక్షన్‌గాఉన్న గుండా యాక్ట్ నమోదు చేసి నిందితులను వేలూరు సెంట్రల్ జైలుకు తరలించారు.


