
చెన్నై: తమిళనాడులో దారుణ ఘటన చోటుచేసుకుంది. చెన్నైలో తిరుమల మిల్క్ డెయిరీ మేనేజర్ నవీన్ బొల్లినేని ఆత్మహత్య చేసుకున్నారు. అయితే, తిరుమల మిల్క్ డెయిరీలో రూ.45కోట్ల మేర మనీ ల్యాండరింగ్ జరిగినట్లు ఫిర్యాదు వచ్చాయి. దీంతో, పోలీసులు.. దీనిపై విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో విచారణకు హాజరు కాకుండానే నవీన్ ఆత్మహత్య చేసుకున్నారు.
వివరాల ప్రకారం.. తిరుమల మిల్క్ డెయిరీ మేనేజర్ నవీన్ బొల్లినేని ఆత్మహత్య చేసుకున్న ఘటన తమిళనాడులో తీవ్ర కలకలం సృష్టించింది. బుధవారం రాత్రి చెన్నై బ్రిటానియా నగర్, ఫస్ట్ స్ట్రీట్‌లోని తన ఇంట్లో నవీన్ బొల్లినేని ఆత్మహత్య చేసుకున్నారు. అయితే, డెయిరీలో మనీ ల్యాండరింగ్ జరిగిందని.. దీనిపై విచారణకు రావాలని నోటీసులు ఇచ్చిన తర్వాత ఆయన ఆత్మహత్య చేసుకోవడం గమనార్హం.
దీనిపై విచారణకు హాజరు కాకుండానే ఇలా చేయడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అరెస్ట్ భయంతో ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఆత్మహత్యకు గల కారణాలు తల్లికి, స్నేహితులకు, బంధువులకు నవీన్ మెయిల్స్ పెట్టినట్టు తెలుస్తోంది. ఆయన ఆత్మహత్య అనంతరం, నవీన్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం స్టాన్లీ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నవీన్ బొల్లినేని స్వస్థలం కృష్ణా జిల్లాగా తెలుస్తోంది.