తేల్చిచెప్పిన ప్రధాని నరేంద్ర మోదీ
బిహార్‌లో ఎన్డీయే విజయం పట్ల హర్షం
బీజేపీ ప్రధాన కార్యాలయంలో విజయోత్సవంలో పాల్గొన్న మోదీ
అది ముస్లింలీగీ మావోవాదీ కాంగ్రెస్ అంటూ విపక్షంపై ఆగ్రహం
న్యూఢిల్లీ: బిహార్ ఎన్నికల్లో ఎన్డీయే విజయం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తంచేశారు. కార్యకర్తల కష్టంతోనే గెలుపు దక్కిందని అన్నారు. బిహార్‌లో సుపరిపాలన కొనసాగిస్తామని, ఇకపై ప శ్చిమ బెంగాల్‌లో ‘జంగిల్‌రాజ్’ను అంతం చేస్తామని ప్రతినబూనారు. పరోక్షంగా ఎన్నికల శంఖారావం పూరించారు. మమతా బెనర్జీ ప్రభుత్వంపై సమర భేరీ మోగించారు. బిహార్ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న సమయంలో ప్రధాని మోదీ శుక్రవారం సాయంత్రం ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో విజయోత్సవంలో పాల్గొన్నారు. నేతలకు, కార్యకర్తలకు అభినందనలు తెలియజేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ... గంగా నది బిహార్ గుండా బెంగాల్‌లోకి ప్రవహిస్తోందని చెప్పారు. బిహార్ విజయం ఇక బెంగాల్‌లో విజయానికి దారిని ఏర్పర్చిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. అది ముస్లింలీగీ మావోవాదీ కాంగ్రెస్(ఎంఎంసీ)గా మారిందని ధ్వజమెత్తారు. ఆ పార్టీ త్వరలో ముక్కలుచెక్కలు కావడం తథ్యమని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ పెద్దలు వారు మునిగిపోవడంతోపాటు నమ్ముకున్నవారిని కూడా ముంచేస్తారని ఎద్దేవా చేశారు. ప్రధాని మోదీ మెడలో మిథిలా పెయింటింగ్‌లతో కూడిన గమ్చా(కండువా) ధరించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తద్వారా బిహార్ ప్రజలతో తనకున్న అనుబంధాన్ని చాటిచెప్పారు.
కొత్తగా ఎం.వై. ఫార్ములా
బిహార్ విజయం కొత్తగా ఎం.వై.(మహిళలు, యువత) అనే ఫార్ములాను ఇచ్చిందని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. జంగిల్‌రాజ్ మనుషుల మతపరమైన ఎం.వై.(ముస్లిం–యాదవ్) ఫార్ములాను ఈ విజయం మట్టిలో కలిపేసిందని అన్నారు. ‘ప్రజాస్వామ్యానికి తల్లి’ అనే గొప్ప గౌరవాన్ని భారత్‌కు ఇచి్చన గడ్డ బిహార్ అని కొనియాడారు. ప్రజాస్వామ్యంపై దాడి చేస్తే మట్టికరిపిస్తామన్న సందేశాన్ని ఇదే గడ్డ ఇచి్చందన్నారు. బిహార్‌లో ఎన్డీయే విజయం ప్రజాస్వామ్యానికి దక్కిన మహోన్నత విజయమని అభివరి్ణంచారు. అసత్యాలు ఓడిపోతాయని, ప్రజల విశ్వాసమే గెలుస్తుందని బిహార్ నిరూపించినట్లు చెప్పారు. కాంగ్రెస్ పారీ్టకి మన దేశం పట్ల సానుకూల దృక్పథం గానీ, దార్శనికత గానీ లేవని మండిపడ్డారు. అదొక పరాన్నజీవి, మోయలేని భారం, నష్టదాయకం అంటూ కాంగ్రెస్ మిత్రపక్షాలను హెచ్చరించారు.
ఈసీ పట్ల ప్రజల విశ్వాసం బలోపేతం
ఎన్డీయే ప్రభంజనంతో బిహార్‌లో నూతన శకం ఆరంభమైందని ప్రధానమంత్రి ఉద్ఘాటించారు. రాబోయే ఐదేళ్లలో మరింత వేగంగా అభివృద్ధి కొనసాగుతుందని తేల్చిచెప్పారు. కొత్త పెట్టుబడులు, పరిశ్రమలు వస్తాయని, యువతకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు. బిహార్ శక్తిసామర్థ్యాలు ప్రపంచానికి తెలుస్తాయని వ్యాఖ్యానించారు. బిహార్ ఎన్నికల ఫలితాలతో ఎన్నికల సంఘం పట్ల ప్రజల విశ్వాసం మరింత బలోపేతమైందని పేర్కొన్నారు. ఎన్నికల సంఘం కృషితో ఈ ఎన్నికల్లో అత్యధిక శాతం ఓటింగ్ నమోదైనట్లు గుర్తుచేశారు. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నాయకత్వ ప్రతిభను నరేంద్ర మోదీ శ్లాఘించారు. ఎన్డీయే పక్షాలకు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఎస్‌ఐఆర్‌ను యువత స్వాగతించారు
నేడు దేశంలో అత్యధికంగా యువ జనాభా ఉన్న రాష్ట్రాల్లో బిహార్ కూడా ఉందని మోదీ వెల్లడించారు. ఇక్కడి యువతలో అన్ని కులాలు, మతాలకు చెందినవారు ఉన్నారని చెప్పారు. వారి ఆశలు, ఆకాంక్షలు, కలలు జంగిల్‌రాజ్ మనుషుల కమ్యూనల్ ఎం.వై.ఫార్ములాను సర్వనాశనం చేశాయని వెల్లడించారు. ఓటర్ల జాబితా ప్రక్షాళనను యువత స్వాగతించారని తెలిపారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్‌ఐఆర్)కు వారు మద్దతిచి్చనట్లు ఈ ఫలితాల ద్వారా స్పష్టమవుతోందని పేర్కొన్నారు. జంగిల్‌రాజ్ అధికారంలో ఉన్నప్పుడు ఎన్నికల్లో విచ్చలవిడిగా హింసాకాండ జరిగేదని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని ప్రధానమంత్రి సంతోషం వ్యక్తంచేశారు. ఎన్నికల సంఘం కృషి వల్ల అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని కొనియాడారు. బిహార్ విజయం పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరిలో బీజేపీ కార్యకర్తలకు కొత్త శక్తిని ఇచి్చందని స్పష్టంచేశారు.


