
ధర్మస్థళ: కర్ణాటకలోని ధర్మస్థళలో సామూహిక ఖననాల మిస్టరీ అంతకంతకూ బిగుసుకుంటోంది. వందలాది మృతదేహాలను ఖననం చేశానంటూ, ఒక మాజీ పారిశుద్ధ్య కార్మికుడు చేసిన సంచలన వ్యాఖ్యల దరిమిలా ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం(ఎస్‌ఐటీ) ఈ ఘటనపై ముమ్మర విచారణ చేపట్టింది. తాజాగా ఈ ఉదంతంలో ఆర్‌టీఐ జోక్యంతో మరో మలుపు తిరిగింది.
ఆర్టీఐ కార్యకర్త జయంత్ ఈ ప్రాంతంలో ఒక యువతిని అక్రమంగా ఖననం చేశారంటూ ఫిర్యాదు చేయడంతో పాటు, ఒక కుక్కను పాతిపెట్టినట్లు ఆమె మృతదేహాన్ని ఖననం చేశారని ఆరోపించారు. దీనికి సంబంధించిన వివరాలను ఆయన ఐర్టీఐని కోరిన దరిమిలా, కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. బెల్తాంగాడి పోలీసులు 2000-2015 మధ్య చోటుచేసుకున్న అసహజ మరణ రికార్డులను తొలగించారని ఆర్టీఐ తెలుపడంతో, ధర్మస్థళ సామూహిక ఖననాలపై నెలకొన్న అనుమానాలు మరింత బలపడుతున్నాయి.
బెల్తాంగాడి పోలీసులు నాటి అసహజ మరణ రికార్డులను తొలగించడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీఐ కార్యకర్త జయంత్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం (సిట్)కు చేసిన ఒక ఫిర్యాదులో ఒక యువతి మృతదేహాన్ని అక్రమంగా ఖననం చేసినట్లు పేర్కొన్నారు. చట్టపరమైన ప్రోటోకాల్‌లు ఉల్లంఘించారని ఆరోపించారు. ఆ సమయంలో పలువురు అధికారులు దీనికి సాక్ష్యంగా నిలిచారని కూడా ఆయన ఆరోపించారు. తన ఫిర్యాదును పరిశీలించిన సిట్ త్వరలోనే తన ఆరోపణలపై దర్యాప్తు ప్రారంభిస్తుందని భావిస్తున్నానని అన్నారు.
ఆర్టీఐని ఆశ్రయించిన జయంత్ బెల్తాంగాడి పోలీస్ స్టేషన్ పరిధిలో అదృశ్యమైన, వ్యక్తుల డేటా, ఫొటోలను తాను కోరినట్లు తెలిపారు. అయితే దీనికి ఆర్టీఐ నుంచి వచ్చిన సమాధానంలో.. బెల్తాంగాడి పోలీసులు నాటి పోస్ట్‌మార్టం నివేదికలు, వాల్ పోస్టర్లు, నోటీసులు గుర్తింపులేని మృతదేహాలకు సంబంధించిన ఫోటోలను సాధారణ పరిపాలనా ఉత్తర్వుల మేరకు నాశనం చేశారని వెల్లడయ్యింది. ఈ సందర్బంగా జయంత్ మీడియాతో మాట్లాడుతూ ‘ఆగస్టు 2 న నేను సిట్‌కు ఫిర్యాదు చేశాను.. ఈ ఫిర్యాదు నేను వ్యక్తిగతంగా సేకరించిన సాక్ష్యంతో ఆధారపడి వుంది. యువతి ఖననం సమయంలో హాజరైన ప్రతి ఒక్కరి పేరు నేను తెలియజేశాను. నాడు చట్టపరమైన విధానాలన్నింటినీ ఉల్లంఘించారు. వారు ఒక కుక్కను పాతిపెట్టినట్లుగా ఆ యువతి మృతదేహాన్ని ఖననం చేశారు. అందుకే నేను దీనిపై ఫిర్యాదును దాఖలు చేశాను’ అని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: ధర్మస్థళ మిస్టరీ: ఆ ఏటీఎం, పాన్ కార్టులు ఎవరివంటే..