
బెంగళూరు: ప్రముఖ పుణ్యక్షేత్రం ధర్మస్థళ సామూహిక ఖననాల కేసులో ఊహించని మలుపు తిరిగింది. ప్రధాన ఫిర్యాదుదారుడు చిన్నయ్య పచ్చి అబద్ధాల కోరుగా బయటపడినట్లు తెలుస్తోంది. డబ్బు కోసం ధర్మస్థళపై సామూహిక ఖననాల కథలు అల్లినట్లు అతని మాజీ భార్య రత్నమ్మ ఆరోపించారు. ఇప్పటికే చిన్నయ్య చేసిన ఆరోపణలు నిరాధారమైనవిగా తేలడంతో, సిట్ అధికారులు అతనిని అరెస్ట్ చేశారు. అతని మాజీ భార్య కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం ఈ కేసులో మరింత ఆసక్తికరంగా మలుపు తిరిగింది.
ధర్మస్థళ సామూహిక ఖననాల కేసులో సిట్ అధికారులు చిన్నయ్యను అరెస్ట్ చేయడంపై అతని మాజీ రత్నమ్మ స్పందించారు. ‘చిన్నయ్య తప్పుడు మనిషి. ఆయనకు అబద్ధాలు చెప్పడం కొత్తేమీ కాదు. చిన్నయ్య నుంచి విడాకులు కోరుతూ నేను కోర్టును ఆశ్రయించా.అయితే, కోర్టు విచారణ సమయంలో నాకు భరణం ఇవ్వాల్సి వస్తుందేమోనని కోర్టులో నా గురించి తప్పుడు సమాచారం ఇచ్చారు. దీంతో నాకు అన్యాయం జరిగింది. కొన్నాళ్లు నా తల్లే నన్ను సాకింది. ఆ తర్వాత బిడ్డల అండతో జీవిస్తున్నట్లు పేర్కొంది.
గ్రామస్థులు సైతం చిన్నయ్యపై పలు కీలక విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. చిన్నయ్య నిత్య పెళ్లికొడుకు. ధర్మస్థళలో ఉంటున్నప్పుడే అతనికి మూడు పెళ్లిళ్లు అయ్యాయని, ముగ్గురు భార్యలు అతనికి విడాకులు ఇచ్చినట్లు పలు స్థానిక మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి.
నిజం నిలకడ మీద తెలుస్తుంది
మరోవైపు ధర్మస్థళ గురించి చెప్పేవన్నీ తేలడంతో సిట్ అధికారులు చిన్నయ్యను అరెస్ట్ చేశారు. దీనిపై ధర్మస్థళ గ్రామం, మంజునాథేశ్వరుడు, తమ కుటుంబానికి మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలని ఆలయ ధర్మాధికారి వీరేంద్ర హెగ్గడే పేర్కొన్నారు. సిట్ అధికారులు చిన్నయ్యను బెల్తంగడి కోర్టులో హాజరుపరిచిన తర్వాత..వీరేంద్ర హెగ్గడే మీడియాతో మాట్లాడారు.నిజం నిలకడ మీద తెలుస్తుంది అనడానికి ఇదే ఉదాహరణ అని అన్నారు. శైవ క్షేత్రంపై వచ్చిన ఆరోపణలు భక్తులను బాధించాయని, కానీ వాస్తవాలు గెలుస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు.
చిన్నయ్య.. గతంలో తాను ధర్మస్థళలో పారిశుధ్య కార్మికుడిగా పనిచేశానని, అనేక మృతదేహాలను ఖననం చేశానని ఆరోపించిన నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. కానీ తవ్వకాల్లో ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో, అతని ఆరోపణలు అబద్ధమని తేలడంతో సిట్ అధికారులు అతన్ని అరెస్ట్ చేశారు.