
న్యూఢిల్లీ: వక్ఫ్ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు(ఏఐఎంపీఎల్‌బీ) అక్టోబర్ మూడున భారత్ బంద్‌కు పిలుపునిచ్చింది. అయితే తాజాగా ఈ బంద్‌ను విరమిస్తున్నట్లు బోర్డు జనరల్ సెక్రటరీ మౌలానా ఫజ్లుర్ రహీమ్ ముజాద్దిది, ప్రతినిధి డాక్టర్ సయ్యద్ ఖాసిం రసూల్ ఇలియాస్ ఒక ప్రకటనలో తెలిపారు. హిందూ పండుగల కారణంగా బంద్ వాయిదా వేస్తున్నామని, త్వరలోనే కొత్త తేదీని ప్రకటించనున్నట్లు వివరించారు.
బంద్ విషయమై ఏఐఎంపీఎల్‌బీ బుధవారం అత్యవసర సమావేశాన్ని నిర్వహించింది. దీనిలో తాము తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెను వాయిదా వేయాలని బోర్డు సభ్యులు నిర్ణయించారు. అక్టోబర్ మూడున పలు ప్రాంతాలలో హిందూ సోదరుల మతపరమైన పండుగలు జరగనున్నందున, తాము బంద్‌ను వాయిదా వేయాలని ఏకగ్రీవంగా నిర్ణయించామని ప్రతినిధి ఇలియాస్ తెలిపారు. ప్రస్తుతానికి బంద్ విరమించినప్పటికీ వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు కొనసాగుతాయని ఏఐఎంపీఎల్‌బీ తెలిపింది.
గతంలో ఏఐఎంపీఎల్‌బీ అక్టోబర్ మూడున ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు బంద్‌కు పిలుపునిచ్చింది. ఆ సమయంలో దుకాణాలు, కార్యాలయాలు, వాణిజ్య సంస్థలు మూసివేయాలని కోరింది. అవసరమైన వైద్య సేవలు, ఆసుపత్రులు, ఫార్మసీలకు బంద్ నుండి మినహాయింపునిస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఈ బంద్‌ను వాయిదా వేస్తున్నట్లు ఏఐఎంపీఎల్‌బీ తాజాగా ప్రకటించింది. బంద్‌కు సంబంధించిన కొత్త తేదీని త్వరలోనే ప్రకటిస్తామని తెలిపింది.