
న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం పాక్ ఉగ్రవాదల ఏరివేతకు భారత్ నడుంబిగించింది. తాజాగా కుల్గామ్ జిల్లాలో ఉగ్రవాద నిరోధక ఆపరేషన్ జరుగుతోంది. ఈ నేపధ్యంలో భద్రతా దళాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక ఉగ్రవాది మృతి చెందాడని రక్షణశాఖ అధికారులు తెలిపారు. ఉగ్రవాదులకు సంబంధించి అందిన నిఘా వర్గాల సమాచారం ఆధారంగా దక్షిణ కశ్మీర్‌లోని కుల్గామ్ జిల్లాలోని అఖల్ అటవీ ప్రాంతంలో భద్రతా దళాలు కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. ఈ నేపధ్యంలోనే ఒక ఉగ్రవాది హతమయ్యాడని పోలీసు అధికారి ఒకరు తెలిపారు.
రాత్రిపూట అడపాదడపా కాల్పులు కొనసాగాయని, అప్రమత్తమైన దళాలు దాడులను కొనసాగిస్తూ, ఉగ్రవాదులకు ఉచ్చు బిగించాయి. ఇప్పటివరకు భద్రతా దళాలు ఒక ఉగ్రవాదిని మట్టుబెట్టాయని భారత సైన్యంలోని చినార్ కార్ప్స్ ‘ఆపరేషన్ అఖల్’కు సంబంధించిన తాజా విజయాన్ని వెల్లడించింది. కుల్గామ్ జిల్లాలోని అటవీ ప్రాంతంలో ఉగ్రవాదుల ఉనికికి సంబంధించిన నిఘా సమాచారం అందిన వెంటనే భద్రతా దళాలు తమ ఆపరేషన్ ప్రారంభించాయి. అడవుల్లో దాక్కున్న ఉగ్రవాదులపై కాల్పులు జరిపాయి.
జమ్మూలోని పూంచ్ జిల్లాలోని నియంత్రణ రేఖ (ఎల్‌ఓసి) సమీపంలో దీనికి ముందు జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు చొరబాటు యత్నంలో హతమయ్యారు. ఈ ఘటన అనంతరం దేగ్వార్ సెక్టార్‌లోని కల్సియన్-గుల్పూర్ ప్రాంతంలో తాజా ఆపరేషన్ ప్రారంభమైంది. ‘ఆపరేషన్ మహాదేవ్’లో భారత సైనిక దళాలు జూలై 28న శ్రీనగర్ శివార్లలోని హర్వాన్ సమీపంలోని లిద్వాస్ అడవిలో ముగ్గురు పాకిస్తాన్ ఉగ్రవాదులను మట్టుబెట్టాయి.