పాపం పసివాళ్లు!  | terrorist attack is separating mothers and children | Sakshi
Sakshi News home page

పాపం పసివాళ్లు! 

Apr 28 2025 6:32 AM | Updated on Apr 28 2025 6:32 AM

terrorist attack is separating mothers and children

తల్లులను వీడి కన్నీటి నడుమ పాక్‌ బాట 

కుటుంబాలను విడదీస్తున్న ఉగ్ర దాడి

ఒక్క ఉగ్రవాద దాడి రెండు దేశాల మధ్య సంబంధాలను దెబ్బతీయడమే గాక తల్లీబిడ్డలను విడదీస్తోంది. భార్యాభర్తలను వేరు చేస్తోంది. విభజన కాలం నాటి ఉది్వగ్న పరిస్థితులను తలపిస్తోంది. పహల్గాంలో ఉగ్రదాడి తరువాత పాక్‌ వీసాలను రద్దు చేయడం తెలిసిందే. దాంతో ఇక్కడి పాకిస్తానీలంతా వెనుదిరుగుతున్నారు. భారత వీసాలున్న పలువురు మహిళలు మాత్రం తమ కుటుంబంతో పాటు పాక్‌ వెళ్లలేకపోతున్నారు. పాక్‌ వీసాలున్న వారి పిల్లలేమో వెళ్లక తప్పని పరిస్థితి! తల్లులను విడిచి వెళ్లలేక వారు పడుతున్న బాధ వర్ణనాతీతం! ‘‘‘తల్లి లేకుండా పిల్లలెలా ఉంటారు ప్రధాని మోదీ జోక్యం చేసుకుని తల్లులను పిల్లల దగ్గరకు చేర్చాలి’’ అని ఆ కుటుంబాలు వేడుకుంటున్నాయి.

పిల్లలు విలవిల్లాడుతున్నారు
గత నెలలో కరాచీ నుంచి భారత్‌కు వచ్చిన మరో కుటుంబానిదీ ఇదే పరిస్థితి. తల్లికి భారత పౌరసత్వం ఉండగా పిల్లలు పాకిస్తాన్‌ జాతీయులు. ‘‘అమ్మను వదిలి వెళ్లడం బాధగా ఉంది. అమ్మ మాతోపాటు పాక్‌ రావడానికి అనుమతించాలని మోదీని వేడుకుంటున్నా’’ అంటూ అల్యాన్‌ అనే బాలుడు అభ్యర్థించాడు. ‘‘మేం గత నెల కరాచీ నుంచి భారత్‌ వచ్చాం. నా భార్య నబీలాను ఇక్కడే వదిలి తిరిగి వెళ్లాలివస్తోంది. పిల్లలు విలవిల్లాడుతున్నారు. ఈ టెర్రరిస్టులు మా కుటుంబాన్ని వేరు చేశారు. అందుకు మూల్యం చెల్లించుకుంటారు’’ అని అల్యాన్‌ తండ్రి మహ్మద్‌ ఇర్ఫాన్‌ వాపోయారు. భార్య షర్మిన్, కూతుళ్లతో కలిసి వచ్చిన మహ్మద్‌ ఇమ్రాన్‌దీ ఇదే పరిస్థితి. ‘‘షర్మిన్‌కు భారత పాస్‌పోర్టుంది. దాంతో మాతో పాక్‌ వచ్చేందుకు అనుమతించడం లేదు. మోదీ మాకు సాయం చేయాలి’’ అని ఇమ్రాన్‌ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అమ్మమ్మను చూడ్డానికి వచ్చి.. అమ్మను వదిలేసి.. 
ఆదివారం పంజాబ్‌లోని అటారీ సరిహద్దులో విషాద పరిస్థితులు నెలకొన్నాయి. తల్లిని వీడి వెళ్తున్న 11 ఏళ్ల జైనబ్, 8 ఏళ్ల జెనీష్‌ కన్నీటి పర్యంతమయ్యారు. ‘‘నానీని కలవడానికి వచ్చాం. కానీ ఇప్పుడు అమ్మ మాతో రాలేకపోతోంది. నేను, చెల్లి మాత్రమే వెళ్లిపోతున్నాం. అమ్మను వదిలి వెళ్లాలన్న ఆలోచనకే నా గుండె బద్దలవుతోంది’’ అంటూ జైనాబ్‌ విలపిస్తోంది. వారి తండ్రి పాకిస్తానీ. తల్లిది ఢిల్లీ. పిల్లలిద్దరికీ పాకిస్తాన్‌ పాస్‌పోర్టుండగా తల్లికి భారత్‌ పాస్‌పోర్టుంది. ఢిల్లీలో అమ్మమ్మను చూడ్డానికి గత నెలలో వచ్చారు. తమలాంటి అమాయకులను ఇబ్బంది పెట్టిన ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలని జైనాబ్‌ కోరుతోంది. 
  
  – సాక్షి, నేషనల్‌ డెస్క్‌  


 

Advertisement
 
Advertisement
Advertisement