నాడు కసబ్‌ను గుర్తించిన బాలిక ఇప్పుడేం చేస్తోంది? | Sakshi
Sakshi News home page

26/11 Mumbai Attack: నాడు కసబ్‌ను గుర్తించిన బాలిక ఇప్పుడేం చేస్తోంది?

Published Sun, Nov 26 2023 8:23 AM

Terrorist Attack Devika Rotawan was the Younger Witness - Sakshi

అది 2008.. నవంబర్ 26.. ముంబైలోని శివాజీ టెర్మినస్ స్టేషన్.. పాకిస్తాన్ నుంచి సముద్ర మార్గంలో వచ్చిన ఉగ్రవాదులు జనం మధ్య విధ్వంసం సృష్టించారు. రైల్వేస్టేషన్‌లో ఉగ్రవాదులు దాదాపు 50 మందిని హతమార్చారు. ఈ ఘటనలో 100 మంది గాయపడ్డారు.

ఈ దారుణ మారణకాండ ముగిశాక.. ఉగ్రవాది అజ్మల్ కసబ్‌పై కోర్టులో విచారణ జరుగుతున్న సమయంలో ఓ తొమ్మిదేళ్ల బాలిక దేశంలో చర్చనీయాంశంగా నిలిచింది. ఆ బాలిక పేరు దేవిక రోత్వాన్‌. దాడి జరుగుతున్న సమయంలో ఆమె శివాజీ టెర్మినస్‌లో ఉంది. నాటి దాడిలో ఆమె కాలికి గాయమైంది. కోర్టులో కసబ్‌ను గుర్తించిన అతి పిన్న వయస్కురాలు దేవిక. ఆ సమయంలో ఆ చిన్నారికి సంబంధించిన ఫొటోలు వైరల్‌  అయ్యాయి.  ఒక ఫొటోలో ఆ చిన్నారి ఊత కర్రల సాయంతో కోర్టుకు చేరుకున్న ఫొటో ఉంది. అయితే దేవిక జీవితం ప్రస్తుతం సమస్యల వలయంలో చిక్కుకుంది.

మీడియా దగ్గరున్న సమాచారం ప్రకారం ఆమెకు ఇప్పుడు 24 ఏళ్లు. జనం ఆమెను గుర్తుంచుకుని, కలుసుకునేందుకు వస్తుంటారు. దేవిక కుటుంబానికి గత ఎనిమిదేళ్లలో ప్రభుత్వం నుంచి రూ.13 లక్షల పరిహారం అందింది. ప్రస్తుతం దేవిక ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. ఆమె ఉద్యోగం కోసం వెతుకుతోంది. ఆమె తండ్రికి కూడా ఎక్కడా ఉద్యోగం లభించడం లేదు. ప్రభుత్వం ఇస్తామన్న ఇల్లు కోసం ఆమె  ఎదురుచూస్తోంది.

గతంలో దేవిక కుటుంబం ముంబైలోని చాల్‌లో ఉండేది. అయితే ఆమెకు పునరావాసం కల్పించడంలో భాగంగా వారి కుటుంబానికి ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్ ఇచ్చారు. అయితే దీనికి కూడా ఆమె రూ.19 వేలు అద్దె చెల్లించాల్సి వస్తోంది. దేవిక తాను పోలీసు అధికారిని కావాలని ఆశపడుతోంది. అయితే ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఆమె గత కొంత కాలంగా ఉద్యోగం కోసం వెతుకుతోంది. తాను ఐపీఎస్ అధికారిగా మారాక ఉగ్రవాదాన్ని అంతం చేస్తానని దేవిక మీడియాకు తెలిపారు.
ఇది కూడా చదవండి: ఈ ఐదుగురు.. 26/11 అమర వీరులు!

Advertisement
Advertisement