
ఛత్తీస్‌గఢ్‌లోని అభూజ్‌మడ్ అడవుల్లో మరోమారు తుపాకీ గర్జించింది. పోలీసులతో జరిగిన ఎదురుకాల్పుల్లో.. 40 లక్షల రూపాయల చొప్పున రివార్డు ఉన్న ఇద్దరు తెలుగు మావోయిస్టులు మృతిచెందారు. కేంద్ర కమిటీ సభ్యుడు కట్టా రామచంద్రారెడ్డి అలియాస్ రాజు దాదా, మరో మావోయిస్టు కాదరి సత్యనారాయణ అలియాస్ కోస దాదా మృతిచెందినట్లు నారాయణపూర్ పోలీసులు తెలిపారు.
వీరిద్దరి స్వస్థలం కరీంనగర్ జిల్లా అని వివరించారు. రామచంద్రారెడ్డి వయసు 63 సంవత్సరాలు, సత్యనారాయణ రెడ్డి వయసు 67 సంవత్సరాలు అని వెల్లడించారు. ఘటనాస్థలి నుంచి పోలీసులు ఒక ఏకే-47 తుపాకీ, ఒక ఇన్సాస్ రైఫిల్, ఒక గ్రనేడ్ లాంఛర్, మావోయిస్టు సాహిత్యం, ప్రచార సామగ్రి, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.
అభూజ్‌మడ్ అటవీ ప్రాంతంలో ఇవాళ (సోమవారం) ఉదయం నుంచి భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య భీకర కాల్పులు జరుగుతున్నాయి. మావోయిస్టులు ఉన్నారనే సమాచారం అందడంతో భద్రతా బలగాలు సంఘటనా స్థలానికి చేరుకొని సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. ఈ క్రమంలో భద్రతా బలగాలను గమనించిన మావోయిస్టులు వారిపై కాల్పులు జరిపారు. దీంతో భద్రతా బలగాలు ఎదురుకాల్పులు జరిపాయి. ఇప్పటి వరకు ఇద్దరు మావోల మృతదేహాలతో పాటు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.