‘‘ఏఐ రాకతో ఉద్యోగాలకు ఎసరు..’’
‘‘ప్రతి రంగంలోనూ ఏఐ, రోబోలదే రాజ్యం’’
ఇంకో ఏడాదిలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు ఉండనే ఉండరు’’
కృత్రిమ మేధ.. అదేనండి ఏఐ విషయంలో కొంతకాలంగా మనం తరచూ చూస్తున్న వార్తలు ఇవి. వీటిని నమ్మిన ఒక వర్గం ఏఐ కోర్సుల్లో ఎగబడి చేరేశారు. ఇంకోవర్గం సాఫ్ట్‌వేర్, కంప్యూటర్ సైన్స్‌లను వదిలేసుకున్నారు. కానీ...ఇప్పుడు పరిస్థితి మారిపోతోంది. మైక్రోసాఫ్ట్, గూగుల్, ఊబర్ లాంటి పెద్ద పెద్ద కంపెనీలే ఏఐ కంటే మనుషులే మేలంటున్నాయి. ఎందుకిలా? మనుషులు చేసే ఉద్యోగాల్లో కోతలుంటాయా? ఉండవా? సుమారు ఆరు నెలల క్రితం నాటి మాట. అంతర్జాతీయ ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ లక్ష వరకూ ఇంజనీర్ల ఏఐ సబ్‌స్క్రిప్షన్లు నిలిపేసింది. క్లాడ్ ఏఐను వాడొద్దని వారికి స్పష్టం చేసింది.
కొంచెం అటు ఇటుగా ఇదే సమయంలో ఊబర్‌కు కూడా ఏఐ షాక్ ఒకటి తగిలింది. ఏడాది పొడవునా ఏఐ పెడదామనుకున్న డబ్బులు కాస్తా నాలుగు నెలల్లోనే ఖాళీ అయిపోయాయి. సెర్చింజిన్ దిగ్గజం గూగుల్ కూడా ఏఐ వాడకం విషయంలో వెనక్కు తగ్గింది. ఈ మూడు కంపెనీల ఉద్దేశం మాత్రం ఒక్కటే.... ఏఐ వాడితే ఖర్చులు తడిసిమోపెడవుతున్నాయి... వీటికంటే ఇంజనీర్లతో పనిచేయించుకోవడమే మేలు అన్న అంచనాకు రావడమే! ఏఐతో ఖర్చులు ఎందుకు పెరుగుతున్నాయి? అన్న ప్రశ్నకు సమాధానం కావాలంటే మనం టోకెన్ ప్రైజింగ్ గురించి తెలుసుకోవాలి.
ఏజెంటిక్ ఏఐ వాడకానికి అయ్యే ఖర్చులను టోకెన్‌లలో లెక్కిస్తూంటారు. ఉదాహరణకు మీరు ‘ Hello, How are you? ‘ అని ఏజెంటిక్ ఏఐతో మాట కలిపారు అనుకుందాం. దీన్ని ఏఐ ఏక మొత్తంగా ఒక వాక్యంగా అర్థం చేసుకోదు. టోకెన్లుగా విభజిస్తుంది. ‘ " Hel", " lo", " How", " are", " you" ‘ లు ఒకొక్కటి ఒక్కో టోకెన్ అవుతుందన్నమాట. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు ఏదైనా ప్రాంప్ట్ ఇచ్చి కోడ్ రాయమంటే... అందులోని ఒక్కో టోకెన్‌కు నిర్దిష్ట మొత్తంలో డబ్బులు వసూలు చేస్తారు. ఎన్ని ఎక్కువ టోకెన్లు వాడితే అంత ఎక్కువ ఖర్చు అన్నమాట. కోడింగ్ చకచకా జరిగిపోతోంది కాబట్టి ఇంజనీర్లు టోకెన్లు తెగ వాడేస్తూండటంతో వారికిచ్చే జీతాల కంటే టోకెన్ల ఖర్చు ఎక్కువైపోయే పరిస్థితి వచ్చింది. దీంతో కంపెనీలన్నీ ఏఐ వాడకంపై పునరాలోచనలో పడ్డాయి.
70 శాతం ఏఐదే.. కానీ...
కోడింగ్ వేగంగా చేయవచ్చునన్న అంచనాతో మైక్రోసాఫ్ట్ చాలాకాలం క్రితమే సుమారు లక్ష మంది ఇంజనీర్లకు క్లాడ్ ఏఐ సబ్రస్కిప్షన్లు అందించింది. కానీ ఇంజనీర్లు రోజుకు కొన్ని లక్షల టోకెన్లు వాడేస్తూండటంతో భారం పెరిగిపోయింది. దీంతో ఆరు నెలల క్రితం సబ్‌స్క్రిప్షన్లను క్యాన్సిల్ చేసింది. ‘‘ఉద్యోగుల జీతాలు, ఇతర ఖర్చులు కలుపుకుని చూసినా ఏఐ ఖర్చులు ఎక్కువగా ఉంటున్నాయి.
ఇది తగ్గితే కానీ ఏఐ విస్తృత వినియోగంలోకి రాదు’’అని ఎన్‌విడియా అప్లైడ్ డీప్ లెర్నింగ్ విభాగం వైస్ ప్రెసిడెంట్ బ్రయన్ కాటన్‌జరో వ్యాఖ్యానించడం పరిస్థితికి అద్దం పడుతుంది. ‘‘సాఫ్ట్‌వేర్ కోడ్‌లో 70 శాతం వరకూ ఏఐ ఆధారంగానే జరుగుతోంది. అయితే దీని వల్ల వినియోగదారుడికి ఏదైనా ప్రయోజనం కలుగుతోందా? లేదా? అన్నది స్పష్టం కాలేదు’’అని ఊబర్ సీఓఓ ప్రశాంత్ మహేంద్ర రాజ చెబుతున్నారు. ఇంకోలా చెప్పాలంటే ఏఐపై పెడుతున్న ఖర్చుకు తగ్గ లాభాలు రావడం
లేదన్నమాట.
ఉద్యోగాల కోత మాటేమిటి?
ఏఐ వస్తే చాలా రంగాల్లో ఉద్యోగాలు పోతాయన్న ఆందోళన ప్రస్తుతానికి తగ్గుతోందని చెప్పాలి. ఏఐ వాడకంపై కంపెనీలు పునరాలోచనలో పడటం ఇందుకు కారణం. ప్రస్తుత పరిస్థితుల్లో ఇంజనీర్లు, అనలిస్టులు, కస్టమర్ సపోర్ట్ సిబ్బంది ఉద్యోగాలు సేఫ్. వీరి స్థానంలో ఏఐ వాడకం చాలా ఖరీదైన వ్యవహారమని కంపెనీలు గుర్తించాలి. ఈ నేపథ్యంలో ఏఐతో కలిసి పనిచేయగల నైపుణ్యం అవసరమవుతుంది.
వీటిని కలిగిఉన్న వారికి సమీప భవిష్యత్తులో మంచి డిమాండ్ ఉంటుందని అంచనా. ఒకవేళ ఇంకో ఐదు, పదేళ్లలో కంప్యూటింగ్ ఖర్చులు తగ్గితే కోడింగ్, డాక్యుమెంటేషన్ వంటివి ఏఐలు చేస్తాయి కానీ.. వాటిపై మానవ పర్యవేక్షణ తప్పనిసరి అవుతుందని నిపుణులు చెబుతున్నారు. మొత్తమ్మీద చూస్తే... ఏఐతో మన ఉద్యోగాలకు వచ్చిన ముప్పేమీ లేదు. ఉత్పాదకతను పెంచడంలో మాత్రం ఏఐ సహకారం అవసరమవుతుంది. దీర్ఘకాలంలో ఏమవుతుందన్నది మాత్రం కాలమే చెప్పాలి!!
–సాక్షి, నేషనల్ డెస్క్


