
ముంబై: పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన టీచర్లు కర్కశంగా ప్రవర్తిస్తే పరిణామాలు ఎలా ఉంటాయనేది ముంబైలో జరిగిన ఒక ఘటన తెలియజేస్తుంది. మలాడ్ ప్రాంతంలోని ఒక ప్రైవేట్ ట్యూషన్ టీచర్, ఎనిమిదేళ్ల బాలుని చేతిరాత సరిగా లేదంటూ, అతనిని కఠినంగా శిక్షించింది.ఈ నేపధ్యంలో ఆ ఉపాధ్యాయురాలు అరెస్టయ్యింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గోరేగావ్‌లోని ఒక పాఠశాలలో మూడవ తరగతి చదువుతున్న బాలుడు మలాడ్‌లోని ఒక టీచర్ ఇంటికి ట్యూషన్‌కు వెళుతుంటాడు. సంఘటన జరిగిన రోజు, ఆ బాలుని సోదరి అతనిని ట్యూషన్‌లో దింపి, వెళ్లిపోయింది. ట్యూషన్ ముగిశాక ఆ టీచర్ బాలుని ఇంటికి ఫోన్ చేసి, పిల్లాడిని తీసుకుని వెళ్లాలని చెప్పింది. దీంతో ఆ బాలుని సోదరి ఆ టీచర్ ఇంటికి వచ్చింది. ఆ బాలుడు కన్నీళ్లతో కనిపించేసరికి, ఏం జరిగిందని సోదరి ఆ టీచర్‌ను అడిగింది. పిల్లాడు జరిగిన విషయం చెప్పగా, టీచర్ వాటిని తోసిపుచ్చింది.
అయితే ఇంటికి తిరిగి వచ్చిన ఆ బాలుడు తన చేతిరాత సరిగా లేకపోవడంతో టీచర్ మండుతున్న కొవ్వొత్తితో తన చేతిపై వాత పెట్టిందని ఏడుస్తూ చెప్పాడు. వెంటనే పిల్లాడి తండ్రి అతనిని చికిత్స కోసం కాండివాలిలోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆసుపత్రికి తీసుకువెళ్లాడు. తరువాత కురార్ పోలీస్ స్టేషన్‌లో జరిగిన ఘటనపై ఫిర్యాదు చేశాడు. బాలునిపై శారీరక, మానసిక క్రూరత్వానికి పాల్పడిన టీచర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రాథమిక విచారణ అనంతరం అరెస్టు చేశారు. దర్యాప్తు కొనసాగుతోంది.