
ఈ మధ్యకాలంలో ఇండియన్ రైల్వేస్ ఎన్నో అద్భుత ఘట్టాలను సాధించింది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఆర్చ్ బ్రిడ్జ్, పొడవైన రైల్వే టన్నెల్, చారిత్రక పాంబన్ బ్రిడ్జ్.. ఇలాంటి నిర్మాణాల తర్వాత ఇప్పుడు మరో ‘వావ్’ ఫీట్‌ను సాధించింది. అదే.. దేశంలోనే అత్యంత పొడవైన గ్రేడ్ సెపరేటర్ బ్రిడ్జ్ పూర్తి చేయడం.
కట్నీ జంక్షన్‌లో ఇంజినీరింగ్ అద్భుతం.. మధ్యప్రదేశ్‌లోని కట్నీ జంక్షన్ వద్ద ఈ గ్రేడ్ సెపరేటర్ బ్రిడ్జి ఉంది. ఈ బ్రిడ్జ్ మొత్తం 33.40 కిలోమీటర్లు పొడవు. ఇందులో ఒకటి "అప్" ట్రైన్ల కోసం (ఇప్పటికే పూర్తయింది). మరొకటి "డౌన్" ట్రైన్ల కోసం.. ఇది 17.52 కిలోమీటర్ల పొడవుతో ఇంకా నిర్మాణంలో ఉంది.
అప్ బ్రిడ్జ్‌ను రైల్వే భద్రతా కమిషనర్ (CRS) ఆమోదించారు. దీంతో అతిత్వరలోనే ఇది ప్రారంభం అయ్యే అవకాశం కనిపిస్తోంది. మొత్తం.. 15.85 కిలోమీటర్ల పొడవుతో, ఫిల్లర్లపైనే నిర్మించిన ఈ ఎలివేటెడ్ ట్రాక్ నగరాన్ని పూర్తిగా మళ్లించి ట్రాఫిక్‌ను గణనీయంగా తగ్గిస్తుంది.
గ్రేడ్ సెపరేటర్ బ్రిడ్జ్ అంటే.. రవాణా మార్గాలు (రోడ్లు, రైల్వేలు) ఒకే స్థాయిలో కాకుండా, వేర్వేరు ఎత్తుల్లో నిర్మించడమన్నమాట. తద్వారా వాటి మధ్య రాకపోకలలో అంతరాయం లేకుండా చేయొచ్చు. అంటే.. సిగ్నల్స్ లేకుండా ప్రయాణించగలవు. తద్వారా ప్రమాదాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. అధిక ట్రాఫిక్ ఉన్న ప్రాంతాల్లో ఇది అత్యంత ఉపయోగకరంగా ఉంటుంది.
2020లో ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్ ఈ ఏడాదిలో పూర్తి కావాలనే టార్గెట్ ఉంది. గతి శక్తి పథకంలో భాగంగా.. ఈ ప్రాజెక్ట్ ప్రధానమంత్రి గతి శక్తి పథకంలో భాగంగా చేపట్టబడింది. "అప్ లైన్" సెపరేటర్ నిర్మాణ ఖర్చు ₹580 కోట్లు కాగా, రెండు సెపరేటర్ల మొత్తం ఖర్చు రూ.1,247.68 కోట్లుగా అంచనా.
ట్రాఫిక్ తగ్గింపు, సమయపాలన మెరుగుదల.. దేశంలోనే అతిపెద్ద రైల్వే జెంక్షన్ యార్డ్‌గా న్యూ కట్నీకి పేరుంది. గూడ్స్ & ప్యాసింజర్ ట్రైన్ల అధిక రాకపోకల వల్ల నిత్యం ఇక్కడ తీవ్ర రద్దీ నెలకొంటోంది. తద్వారా రైళ్ల రాకపోకలపై ఇది తీవ్ర ప్రభావం చూపెడుతోంది. అయితే.. తాజా గ్రేడ్ సెపరేటర్ బ్రిడ్జ్ వాడకంలోకి వస్తే ఈ సమస్య తొలిగిపోనుంది. అదెలాగంటే..
సింగ్రౌలి, బిలాస్‌పూర్ నుంచి వచ్చే ట్రైన్లు ఇక న్యూ కట్నీ జంక్షన్(కట్నీ ముద్వారా) వద్ద ఆగాల్సిన అవసరం లేదు. కోటా, బీనా వైపు వెళ్లే ట్రైన్లకు ఇది ఎంతో ప్రయోజనం కలిగిస్తుంది. అంటే.. వెస్ట్ సెంట్రల్, సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వేజోన్‌ల నుంచి వచ్చే రైళ్ల రాకపోకలు సునాయసంగా కొనసాగే అవకాశం ఉంటుంది.
ప్రయాణ సౌలభ్యం, సరుకు రవాణా మెరుగుదల.. కట్నీని మళ్లించే ట్రైన్లు ఇక నాన్ స్టాప్‌గా ప్రయాణించగలవు. ధన్‌బాద్, గయా, ముజఫర్‌పూర్ వంటి నగరాలకు వెళ్లే ప్రత్యేక ట్రైన్లు కూడా హాల్టింగ్ లేకుండా ముందుకు వెళ్తాయి. అదనంగా.. పవర్ ప్లాంట్లకు బొగ్గు సరఫరా కూడా సకాలంలో జరిగేందుకు వీలు కల్పించనుంది.
నిర్మాణంలో వినియోగించిన వనరులు
15,000 టన్నుల స్టీల్
1.50 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్
1.90 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి
నాలుగు Rail Over Rail (ROR) బ్రిడ్జ్‌లు, వాటిలో పొడవైనది 91.40 మీటర్లు
ఈ అద్భుతమైన నిర్మాణం భారత రైల్వేలు సాధించిన మరో ఘనతగా నిలిచింది. దేశ రవాణా వ్యవస్థను మరింత సమర్థవంతంగా మార్చే దిశగా ఇది కీలక అడుగుగా నిపుణులు భావిస్తున్నారు.