నల్లమలలో పులులకు కరువైన రక్షణ
వేటగాళ్ల ఉచ్చులో చిక్కుకొని మృత్యువాత
ఆహారం, నీళ్ల కోసం జనారణ్యంలోకి వస్తూ ప్రమాదాలకు గురవుతున్న వైనం
పులుల రాకపోకలకు అండర్, అప్పర్ పాస్‌లు అవసరమంటున్న వన్యప్రాణి ప్రేమికులు
నల్లమలలో 87 పెద్ద పులులు, సుమారు 200 చిరుతలు
నల్లమల అటవీ ప్రాంతంలో పులలకు రక్షణ కరువైంది. ఒక వైపు వేటగాళ్ల ఉచ్చులు.. మరో వైపు ఆహారం, నీటి కోసం జనారణ్యం వైపు వస్తూ పులులు ప్రమాదాలకు గురువుతున్నాయి. కొన్ని సందర్భాల్లో అవి మృత్యువాత పడుతున్నాయి. అటవీశాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నామన్నా నిత్యం ఎక్కడో ఒక చోట ప్రమాదాలు జరుగుతున్నాయి.
నల్లమలలో పులి గాండ్రిపులు వినిపించాలంటే వాటి సంరక్షణను అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టాలని పర్యావరణ ప్రేమికులు డిమాండ్ చేస్తున్నారు. అవి ఎక్కువగా సంచరించే రహదారుల సమీపంలో అండర్, అప్పర్‌పాస్‌లు ఏర్పాటు చేయాలని వారు అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.
పెద్దదోర్నాల: నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వుడు నల్లమల ప్రాజెక్టులో మొత్తం 87 పెద్ద పులులున్నాయని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. చిరుత పులులు మరో 200 నుంచి 205 వరకు ఉన్నట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. నల్లమల పరిధిలోని మార్కాపురం, నెక్కంటి, గంజివారిపల్లి, కొర్రపోలు, దోర్నాల, విజయపురిసౌత్, యర్రగొండపాలెం అటవీ రేంజీ పరిధిలో ఇవి ఎక్కువగా సంచరిస్తుంటాయి.
అయితే వేటగాళ్ల ఉచ్చులు, రోడ్డు ప్రమాదాలతో పాటు అనారోగ్య సమస్యలతో నల్లమలలోని కొన్ని వన్యప్రాణుల మునుగడ ప్రమాదంలో పడుతోంది. ఇప్పటికే కొన్ని రకాల చిరుతలు అంతరించి పోగా, నమీబియా లాంటి దేశాల నుంచి వాటిని దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. నల్లమలలో అత్యంత ప్రాధాన్యత కలిగిన జీవుల్లో రెండో స్థానం చిరుత పులులది. వీటి జీవిత కాలం 12 నుంచి 15 ఏళ్లు మాత్రమే.
పెద్దపులులు, చిరుతపులులు ఆహారం, నీళ్ల కోసం రోడ్లపైకి వచ్చి ప్రమాదాల బారినపడి మృత్యువాత పడుతున్నాయి. అటవీశాఖాధికారులు వన్యప్రాణుల సంరక్షణకు అన్నీరకాల చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.పెద్దపులులు, చిరుతలకు అడవిలోనే నీటి సమస్య లేకుండా సోలార్ సాసర్‌పిట్‌లు ఏర్పాటు చేసి నీటి సమస్య తీర్చారు. ఆహారం కోసం అవి సమీప గిరిజన ప్రాంతాల వైపు వస్తూనే ఉన్నాయి.
బేస్ క్యాంపుల ఏర్పాటు..
నల్లమల అటవీ ప్రాంతంలో వన్యప్రాణుల కదలికలు తెలుసుకునేందుకు బేస్ క్యాంప్‌లు ఏర్పాటు చేశారు. ప్రధానంగా పులుల సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించారు. వాటి కదలికల కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. గంజివారిపల్లె సమీపంలోని పెద్దన్న బేస్ క్యాంప్, ఇష్టకామేశ్వరి ఆలయం, దొరబైలు, నారుతడికల, పాలుట్ల, కొలుకుల, తుమ్మలబైలు, వెదురుపడియ, కొర్రపోలు, చినమంతనాల, రోళ్లపెంట తదితర ప్రాంతాల్లో బేస్ క్యాంప్‌లు ఉన్నాయి.
ఇందులో ఐదుగురు అటవీ అధికారులు ఉంటారు. అడవిలోకి ఎవరూ వెళ్లకుండా ఉండేందుకు కొర్రపోలు, శిరిగిరిపాడు, దోర్నాల గణపతి గుడి వద్ద ఫారెస్ట్ చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. మొత్తం మీద 120 మంది ప్రొటెక్షన్ వాచర్లు పులుల సంరక్షణలో ఉన్నారు.
అభయారణ్యాలలో అండర్, ఓవర్ పాసులు ఏర్పాటు చేయాలి..
శ్రీశైలం వెళ్లే భక్తులు, నల్లమల అటవీ అందాలను వీక్షించేందుకు వచ్చే పర్యాటక ప్రేమికులు సౌకర్యవంతమైన ప్రయాణాలతో పాటు, నల్లమల అభయారణ్యంలో వణ్యప్రాణులు సురక్షితంగా సంచరించేందుకు అటవీశాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని పర్యావరణ ప్రేమికులు కోరుతున్నారు. వేగంగా ప్రయాణించే వాహనాలతో అవి ప్రమాదాలకు గురి కాకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలంటున్నారు.
రోడ్డుకు ఓ వైపు నుంచి మరో వైపుకు వెళ్లే విధంగా అండర్ పాస్‌లు, ఓవర్ పాస్‌లు ఏర్పాటు చేయాలని వారు కోరుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో రహదారికి పై భాగంలో ఏర్పాటు చేసే వంతెన( ఓవర్ పాస్)లు, మరికొన్ని ప్రాంతాల్లో రోడ్డుకు కింది భాగాన ఏర్పాటు చేసే బ్రిడ్జి (అండర్‌పాస్)ల ద్వారా వన్యప్రాణులు స్వేచ్ఛగా సంచరించే వీలుంటుందని వారు సూచిస్తున్నారు. వీటి ఏర్పాటుపై అటవీశాఖ ఉన్నతాధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉందని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.
చనిపోతున్న పులులు, చిరుతలు
» జనారణ్యంలోకి వస్తున్న పులులు, చిరుతలు మృత్యువాత పడుతున్నాయి.
» 2024లో అర్ధవీడు మండలం వెలగలపాయ సమీపంలో విద్యుత్ కంచె తగిలి చిరుత మృతి చెందింది.
» 2023 నవంబర్ 10న శ్రీశైలం ఘాట్‌లో గుర్తు
తెలియని వాహనం ఢీకొని చిరుత మృతి చెందింది.
» 2023 సంవత్సరం నవంబర్ 6వ తేదీన మండల పరిధిలోని రోళ్లపెంట వద్ద కోతిని వేటాడబోయిన చిరుతపులి కోతితో సహా నీళ్లలో పడి మృత్యవాత పడింది.
» 2022 జనవరి 22వ తేదీన ఆర్ చెలమ బావి వద్ద కోతులను వేటాడుతూ రోడ్డును దాటుతున్న ఓ చిరుతను గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో సంఘటనా స్థలంలోనే చిరుత మృతి చెందింది.
» 2022 జనవరి 13వ తేదీన శ్రీశైలం రహదారిలోని జంగిల్ సఫారీ వద్ద రోడ్డును దాటుతున్న చిరుతపిల్లను గుర్తు తెలియని వాహనం ఢీ కొనడంతో చిరుత మృత్యువాత పడింది.
» 2021 నవంబర్ 12న గిద్దలూరు–నంద్యాల మధ్య చలమ రైల్వేస్టేషన్ సమీపంలో రైల్వేట్రాక్ దాటుతూ ప్రమాదవశాత్తు రైలుకిందపడి పెద్దపులి మృతి చెందింది.
» 2020 ఏప్రిల్‌లో యర్రగొండపాలెం సమీపంలోని గాలికొండ అటవీ ప్రాంతంలో వృద్ధాప్యంతో తీవ్రమైన ఎండ వేడిమి తట్టుకోలేక పెద్దపులి మృతి చెందింది. వీటితో పాటు మండల పరిధిలోని చెంచుకుంట వద్ద రైతులు పెట్టిన విషాహారం తిని చిరుతపిల్ల మృత్యువాత పడింది. దేవలూడు ప్రాంతంలో చిరుతను చంపి గుర్తులు లేకుండా కొందరు దుండగులు తగలబెట్టారు. దీంతో పాటు గతంలో తుమ్మల బైలు, శ్రీశైలం ముఖద్వారం వద్ద చిరుత పులులు రోడ్డును దాటే క్రమంలో గుర్తుతెలియని వాహనాలు ఢీకొని మృత్యువాత పడిన సంఘటనలు అనేకం చోటు చేసుకున్నాయి.


