ప‌శ్చిమ బెంగాల్ స‌ర్కార్‌ సంచలన నిర్ణ‌యం | Suvendu Adhikari Big Ticket Changes For Durga Puja | Sakshi
Sakshi News home page

ప‌శ్చిమ బెంగాల్ స‌ర్కార్‌ సంచలన నిర్ణ‌యం

Sep 8 2026 8:16 AM | Updated on Sep 8 2026 8:52 AM

Suvendu Adhikari Big Ticket Changes For Durga Puja

దుర్గా పూజ వేడుకల నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకుంది. బెంగాల్‌లోని అతిపెద్ద పండుగపై బీజేపీ తన మార్కును చూపించేందుకు సిద్ధమైంది. ఈ ఉత్సవాల్లో పలు మార్పులు తెచ్చేలా కొత్త నిబంధనలు, మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. పండగలో అత్యంత పవిత్రమైన రోజైన మహా అష్టమి రోజున రాష్ట్రవ్యాప్తంగా మద్య నిషేధాన్ని విధిస్తున్నట్లు సీఎం సువేందు అధికారి ప్రకటించారు. ఆ రోజున భక్తులు దుర్గాదేవికి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహిస్తారని.. ఆ పవిత్రతను కాపాడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వివరించారు.

మహా అష్టమి రోజున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మద్యం దుకాణాలతో పాటు బార్లను మూసివేయాలని.. ఆ రోజున మద్యం విక్రయాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి లేదంటూ సువేందు స్పష్టం చేశారు. దుర్గా పూజ ఉత్సవాల్లో భాగంగా మహా అష్టమి రోజున మద్యంపై నిషేధం విధించడం రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి. కాగా, దుర్గా పూజ కమిటీలకు రూ.1 లక్ష చొప్పున గ్రాంటు మంజూరు చేయడంతో పాటు ఉత్సవాల కోసం ఉచిత విద్యుత్‌ సరఫరా చేయనున్నట్లు ప్రకటించారు. ఫైర్ సేఫ్టీ లైసెన్స్‌ల ఫీజును పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఇదిలా ఉండగా.. ఆర్థికంగా భారీ మొత్తంలో నిధులు కలిగిన కమిటీలు మాత్రం స్వచ్ఛందంగా ఈ గ్రాంటును వదులుకోవాల్సిందేనని సువేందు అన్నారు.

పూజల పేరుతో జాతీయ రహదారులను మూసివేయడానికి వీల్లేదన్న సీఎం.. విగ్రహాల నిమజ్జన ఊరేగింపులో డీజే మ్యూజిక్‌ను పూర్తిగా నిషేధిస్తున్నట్లు తెలిపారు. మతపరమైన మనోభావాలను కించపరిచే విధంగా పండళ్లు, థీమ్‌లు ఉండకూడదని.. గత ప్రభుత్వం రెడ్ రోడ్‌లో ఘనంగా నిర్వహించిన పోస్ట్-పూజ కార్నివాల్‌ను కూడా ఈ ఏడాది నుంచి నిలిపివేస్తున్నట్లు సువేందు ప్రభుత్వం ప్రకటించింది.

పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనలో దుర్గాదేవి ఫొటోకు 10 చేతులకు బదులుగా 11 చేతులుండటంపై వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. ప్రభుత్వ రాష్ట్ర సంస్కృతిని చులకన చేస్తోందంటూ తృణమూల్ కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. ఈ వివాదంపై స్పందించిన సీఎం సువేందు అధికారి క్షమాపణలు చెప్పారు. ఈ ప్రకటన సంస్థను హెచ్చరించామని.. భవిష్యత్తులో ఇలాంటి తప్పులు జరగకుండా జాగ్రత్తగా వ్యవహరిస్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement