
న్యూఢిల్లీ: మైనర్ బాలికపై లైంగిక వేధింపుల కేసులో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు(Supreme Court) తీవ్రంగా తప్పుబట్టింది. తీర్పులోని కొన్ని విషయాలు తమనెంతో బాధించాయన్న ద్విసభ్య ధర్మాసనం.. ఈ వ్యవహారానికి సంబంధించి కేంద్రం, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాల నుంచి వివరణ కోరుతూ బుధవారం నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలో తీర్పు ఇచ్చిన జడ్జి రామ్ మనోహర్ నారాయణపైనా తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.
దుస్తులను పట్టుకుని లాగటం, వక్షోజాలను తాకడం లాంటి చేష్టలు అత్యాచార నేరం కిందకు రావని అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి రామ్ మనోహర్ నారాయణ(Ram Manohar Narayan Mishra) అభిప్రాయపడ్డారు. అయితే మైనర్ బాలిక లైంగిక వేధింపుల కేసులో ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ తీర్పును సుమోటోగా సర్వోన్నత న్యాయస్థానం విచారణకు చేపట్టింది. జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మసీహ్ ధర్మాసనం ఈ కేసును విచారణ చేపట్టింది.
ఈ నెల 17న ఓ కేసు విచారణ సందర్భంగా హైకోర్టు జడ్జి జస్టిస్ రామ్ మనోహర్ నారాయణ చేసిన వ్యాఖ్యలు న్యాయస్థానాల పట్ల గౌరవాన్ని తగ్గించేలా ఉన్నాయంటూ మేధావుల దగ్గరి నుంచి సామాన్యుల దాకా ఆందోళన వ్యక్తం చేశారు.
‘‘అలహాబాద్ హైకోర్టు(Allahabad High Court) తీర్పు కాపీ చదువుతుంటే బాధేస్తోంది. ఇదొక సున్నితమైన అంశం అనే పట్టింపులేకుండా తీర్పు ఇచ్చారు. ఇదేదో క్షణికావేశంలో చేసింది కూడా కాదు. తీర్పును నాలుగు నెలలపాటు రిజర్వ్ చేసి మరీ వెల్లడించారు. అంతే.. సరైన స్పృహతోనే ఈ తీర్పు వెల్లడించినట్లు స్పష్టమవుతోంది. సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో తీర్పుపై స్టే విధించేందుకు మేం బాగా ఆలోచిస్తుంటాం. కానీ, తీర్పు కాపీలోని 21, 24, 26 పేరాలు చదివాక.. అమానుషంగా అనిపించింది. అందుకే స్టే విధిస్తున్నాం’’ అని సుప్రీం కోర్టు వెల్లడించింది.
ధర్మాసనం వ్యాఖ్యలతో సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సైతం ఏకీభవించారు. ఈ తరుణంలో జస్టిస్ గవాయ్ కలుగజేసుకుని ఇది తీవ్రమైన అంశం. సున్నితమైన అంశంగా భావించకుండా సదరు జడ్జి తీర్పు ఇచ్చారు. న్యాయమూర్తి వ్యాఖ్యలు అమానవీయంగా ఉన్నాయి. ఆయన గురించి ఇలా మాట్లాడుతున్నందుకు క్షమించాలి’’ అని తుషార్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

వీ ద విమెన్ ఆఫ్ ఇండియా అనే సంస్థ ఆందోళనలు.. బాధితురాలి తల్లి విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న సర్వోన్నత న్యాయస్థానం సుమోటోగా కేసు దర్యాప్తు చేపట్టింది. అయితే ఆసక్తికరమైన అంశం ఏంటంటే.. అలహాబాద్ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో ఇంతకు ముందే ఓ పిటిషన్ దాఖలైంది. అయితే జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ ప్రసన్న బీ వరాలే దానిని విచారణకు స్వీకరించలేదు.
కేసు నేపథ్యం ఇదే..
2021 నవంబరులో.. ఉత్తరప్రదేశ్‌లోని కసగంజ్ ప్రాంతానికి చెందిన ఓ మహిళ, తన 11 ఏళ్ల కుమార్తెతో కలిసి బంధువుల ఇంటి నుంచి తిరిగివస్తోంది. అదే గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు లిఫ్ట్ పేరిట ఆ బాలికను తమతో బైక్‌లపై తీసుకొచ్చారు. మార్గమధ్యంలో ఆమెను అసభ్యంగా తాకుతూ వేధింపులకు గురిచేశారు. ఆపై అత్యాచారానికి యత్నించారు. బాలిక అరుపులు విని అటుగా వెళ్తున్నవారు రావడంతో నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. విషయం తెలుసుకున్న బాధితురాలి కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయించడంతో నిందితులపై కేసు నమోదు చేశారు.
అనంతరం ఈ కేసు అలహాబాద్ హైకోర్టుకు చేరింది. ఇటీవల దీనిపై విచారణ జరిపిన జస్టిస్ రామ్ మనోహర్ నారాయణ్ మిశ్రా సంచలన వ్యాఖ్యలు చేశారు. మహిళ ఛాతీని తాకినంత మాత్రాన.. పైజామా తాడు తెంపినంత మాత్రాన అత్యాచార యత్నం కిందకు రాదంటూ పేర్కొన్నారు. తద్వారా నిందితులు చేసిన నేరాలు పోక్సో చట్టంలోని సెక్షన్ 18, సెక్షన్ 376 కిందకు రావని చెబుతూనే.. అదే చట్టంలోని సెక్షన్ 9/10 (తీవ్రమైన లైంగిక వేధింపులు), సెక్షన్ 354-బి (మహిళల గౌరవాన్ని దెబ్బతీసే ఉద్దేశంతో దాడి) కింద కేసులు నమోదు చేసి విచారించాలని ఆదేశించారాయన.