
అవినీతి కేసులో శిక్షలు పడ్డ ప్రభుత్వాధికారుల నిర్దోషిత్వం పైకోర్టుల్లో రుజువు అయ్యేదాకా తిరిగి విధుల్లోకి తీసుకోవడం సరికాదని దేశసర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. ఇది ప్రజల నమ్మకాన్ని దెబ్బతీయడం అవుతుందన్న సుప్రీం కోర్టు.. ఇలాంటి చర్యలు నిజాయితీపరులైన అధికారులను అవమానించడమే అవుతుందంటూ తీవ్ర వ్యాఖ్యలే చేసింది.
కేసు ఏంటంటే.. గుజరాత్‌లోని ఒక రైల్వే ఇన్‌స్పెక్టర్ లంచం తీసుకున్నాడన్న కేసులో ట్రయల్ కోర్టు రెండు సంవత్సరాల శిక్ష విధించింది. అయితే దీనిపై ఆయన అప్పీల్‌కు వెళ్లగా.. గుజరాత్ హైకోర్టు ఆ శిక్షను సస్పెండ్ చేస్తూ ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. అయితే తన శిక్షను పూర్తిగా రద్దు చేయాలని స్టే కోరుతూ సదరు ఇన్‌స్పెక్టర్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
పిటిషనర్ వాదనలు.. నేను లంచం తీసుకున్నట్లు ఎక్కడా ఆధారాలు చూపించలేకపోయారు. అయినా కింది కోర్టు మా వాదనలను పట్టించుకోకుండా శిక్ష వేసింది. ఉన్నత న్యాయస్థానం నాకు ఊరట ఇచ్చినప్పటికి శిక్షను రద్దు చేయలేదు. కాబట్టి నా శిక్షపై స్టే విధించి.. నన్ను తిరిగి విధుల్లోకి తీసుకునేలా ఆదేశాలు ఇవ్వండి.
సుప్రీం కోర్టు(Supreme Court) ఏం చెప్పిందంటే.. గురువారం జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ప్రసన్న బీ వరాలేలతో కూడిన బెంచ్ ఆ రైల్వే ఇన్‌స్పెక్టర్ పిటిషన్‌పై విచారణ జరిపింది. ఈ క్రమంలో ధర్మాసనం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘‘ప్రజల నమ్మకమే పాలనా వ్యవస్థకు మూలాధారం. అవినీతికి లోనైన ప్రభుత్వ అధికారిని అన్ని న్యాయ ప్రక్రియలు పూర్తయ్యే వరకు ఉద్యోగంలోకి తిరిగి అనుమతించడం ఆ నమ్మకాన్నే దెబ్బతీస్తుంది. కోర్టులో దోషులుగా తేలిన అధికారులను.. తిరిగి విధుల్లోకి తీసుకోవడం వ్యవస్థ మూలాలను బలహీనపరుస్తుంది. పైగా ఇలాంటి చర్యలు.. నిజాయితీ పరులైన అధికారులను అవమానించడమే అవుతుంది అని బెంచ్ వ్యాఖ్యానించింది.
ఈ క్రమంలో.. కేసీ సరీన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు తీర్పును ప్రస్తావించింది. ‘‘ఒక ప్రభుత్వ అధికారి అవినీతి కేసులో దోషిగా తేలితే.. పైకోర్టుల్లో అతను నిర్దోషిగా తేలేంతవరకు విధుల్లోకి తీసుకోకూడదు. ఒకవేళ అతని/ఆమె అప్పీల్ పెండింగ్‌లో ఉన్నాసరే.. ఉద్యోగంలోకి తిరిగి అనుమతించకూడదు’’ అని ఈ కేసులో తీర్పు ఇచ్చింది.