
న్యూఢిల్లీ: భారత వాయుసేనలో మహిళలు యుద్ధ విమానాలు నడిపిస్తున్నారని, వారికి సైన్యంలోని లీగల్ పోస్టులు ఎందుకు ఇవ్వడం లేదని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. సైన్యంలో న్యాయమూర్తి, అడ్వొకేట్ జనరల్, ఇతర లీగల్ బ్రాంచ్ పోస్టుల్లో మహిళలు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నారని వెల్లడించింది. ఆయా పోస్టులకు స్త్రీ–పురుష నిష్పత్తి వర్తించదని, అయినప్పటికీ మహిళలను ఎందుకు నియమించడం లేదని జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ మన్మోహన్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది.
సైన్యంలో లీగల్ పోస్టుల కోసం జరిగిన పరీక్షల్లో తాము నాలుగు, ఐదో ర్యాంకులు సాధించామని, అయినా తమను ఎంపిక చేయలేదంటూ ఇద్దరు మహిళా అధికారులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. న్యాయం చేయాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. తమకంటే తక్కువ ర్యాంక్ వచ్చిన పురుష అధికారులను లీగల్ బ్రాంచ్‌లో నియమించారని వారు ఆక్షేపించారు. ఈ పిటిషన్‌పై ధర్మాసనం తాజాగా విచారణ చేపట్టింది. సైన్యంలోని న్యాయ విభాగంలో పురుషుల కంటే ఎక్కువగా మహిళలను విధుల్లో చేర్చుకుంటే ఇబ్బందులేమిటో చెప్పాలని నిలదీసింది. పురుషులైనా, మహిళలైనా అర్హత ఉంటే అవకాశం ఇవ్వాల్సిందేనని స్పష్టంచేసింది.