
మానసిక ఆరోగ్య సంక్షేమం కీలకం
సర్వోన్నత న్యాయస్థానం ఆందోళన
న్యూఢిల్లీ: యువత, ముఖ్యంగా విద్యార్థుల బలవన్మరణాలు పెరిగిపోతుండటం ఆందోళనకరమని సుప్రీంకోర్టు పేర్కొంది. ‘‘ఇది వ్యవస్థాగత లోపానికి నిదర్శనం. ఈ జాఢ్యాన్ని నిర్లక్ష్యం చేయలేం’’అని జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. విశాఖపట్నానికి చెందిన ఓ 17 ఏళ్ల నీట్ విద్యార్థి ఆత్మహత్య కేసు విచారణను సీబీఐకి బదలాయించాలన్న పిటిషన్‌ను శుక్రవారం విచారించింది.
ఈ అంశంపై 15 మార్గదర్శకాలు జారీ చేసింది. ‘‘విద్యా సంస్థల్లో విద్యార్థి–కౌన్సెలర్ నిష్పత్తిని గరిష్ట సంఖ్యకు పెంచాలి. ముఖ్యంగా పరీక్షలు, కౌన్సెలింగ్ తదితరాల వేళ వీటి అవసరం చాలా ఎక్కువగా ఉంటుంది. సూసైడ్ హెల్ప్‌లైన్ నంబర్లు, టెలీ–మానస్ తదితర జాతీయ సేవల చిరునామా, ఫోన్ నంబర్లను విద్యా సంస్థలు, హాస్టళ్లు, తరగతి గదులతో పాటు వెబ్‌సైట్లలో కూడా ప్రముఖంగా కనిపించేలా ఉంచాలి.
బోధన, బోధనేతర సిబ్బంది అందరూ ఏటా కనీసం రెండుసార్లు తప్పనిసరి మానసిక శిక్షణ తీసుకోవాలి. సైకలాజికల్ ఫస్ట్ ఎయిడ్ చేయగలిగి ఉండాలి. విద్యార్థుల్లో ఆత్మహత్యకు సంబంధించిన ధోరణులను తొలి దశలోనే గుర్తించి, సరిగా స్పందించగలిగిన యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవాలి. మానసిక ఆరోగ్య అక్షరాస్యత, భావోద్వేగాలను నియంత్రించుకోవడం, జీవ కళా విద్య వంటివాటికి తరగతి గదుల్లో చోటివ్వాలి. విద్యాపరమైన ఒత్తిళ్లను ఎప్పటికప్పుడు గమనిస్తూ విద్యా సంస్థలే నివారణ చర్యలు చేపట్టాలి’’అని పేర్కొంది. ‘‘2022లో భారత్‌లో 1.7 లక్షల పైచిలుకు ఆత్మహత్యలు నమోదయ్యాయి.
వాటిలో 7 శాతానికి పైగా, అంటే 13,044 విద్యార్థుల ఆత్మహత్యలే. వీటిలోనూ 2,248 ఆత్మహత్యలు నేరుగా పరీక్షల ఫలితాలతో సంబంధమున్నవే కావడం మరింత బాధాకరం’’అంటూ నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో గణాంకాలను ఉటంకిస్తూ ధర్మాసనం పేర్కొంది. ‘‘స్కూళ్లు, కోచింగ్ సెంటర్లు, కాలేజీలు, శిక్షణ కేంద్రాల వంటివాటిలో ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. ఇది ఒక రకంగా మానసిక ఆరోగ్య సంక్షోభం. ఇదే విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. మానసిక ఆరోగ్యం రాజ్యాంగం కల్పించే జీవించే హక్కులో భాగం’’అని గుర్తు చేసింది. దీనిపై 90 రోజుల్లోగా అఫిడవిట్ దాఖలు చేయాల్సిందిగా కేంద్రాన్ని ఆదేశించింది.