
సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
ఇతర ధ్రువీకరణలు తప్పనిసరి
జస్టిస్ సూర్యకాంత్ వ్యాఖ్యలు
ఈసీ వాదనకు పూర్తి సమర్థన
న్యూఢిల్లీ: పౌరసత్వ రుజువులకు సంబంధించి సర్వోన్నత న్యాయస్థానం మంగళవారం కీలక వ్యాఖ్యలు చేసింది. దేశవ్యాప్తంగా పదిహేనేళ్లకు పైగా అన్ని రకాల అవసరాలకూ ఏకైక గుర్తింపు కార్డుగా చెలామణిలో ఉన్న ఆధార్, ఓటు హక్కుకు గుర్తింపు అయిన ఓటర్ కార్డు రెండూ పౌరసత్వానికి రుజువులు కాబోవని కుండబద్దలు కొట్టింది. ఈ విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం వైఖరి, వాదన సరైనవేనని స్పష్టం చేసింది. ‘‘పౌరసత్వానికి ఆధార్ పూర్తిస్థాయి రుజువు కాబోదు. దాన్ని ఇతరత్రా మార్గాల ద్వారా నిర్ధారణ చేసుకోవడం తప్పనిసరి’’ అని న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ సారథ్యంలోని ధర్మాసనం అభిప్రాయపడింది.
బిహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ ఓటర్ల జాబితా స్పెషల్ సమ్మరీ రివిజన్ (ఎస్‌ఐఆర్) పేరిట భారీగా ఓట్లను తొలగిస్తున్నారంటూ దాఖలైన కేసుల విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది. అదే సందర్భంలో బిహార్‌లో ఎన్నికల జాబితా ధ్రువీకరణకు ఈసీకి ఉన్న అధికారాలపై కీలక ప్రశ్నలు కూడా లేవనెత్తింది. దీన్ని ముందుగా తేల్చాల్సి ఉంటుందని జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు. ‘‘ఈసీకి ఓటర్ల జాబితా ధ్రువీకరణ అధికారమే గనక లేనిపక్షంలో ఈ వ్యవహారం ఇక్కడితో ముగిసిపోయినట్టే అన్నారు.
ఎస్‌ఐఆర్ ముసుగులో బిహార్‌లో ఈసీ తలపెట్టిన కసరత్తు కారణంగా భారీ సంఖ్యలో ఓటర్లు జాబితా నుంచి గల్లంతవుతున్నారని పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదించారు. ముఖ్యంగా ఈసీ తాజాగా కోరుతున్న డాక్యుమెంట్లు సమర్పించని వారంతా ఓటు హక్కు కోల్పోయే ప్రమాదముందని ఆందోళన వెలిబుచ్చారు. ‘‘అప్పుడెప్పుడో 2003 నాటి ఓటర్ల జాబితాలో ఉన్నవారు కూడా తాజాగా ఈసీ కోరిన అన్ని పత్రాలూ సమర్పించడాన్ని తప్ప నిసరి చేశారు.
అలా చేయ ని వాళ్ల పేర్లను నాటికీ, నేటికీ వారి చిరునామాలతో సహా ఎలాంటి మార్పు లూ లేకపోయినా సరే ఓటర్ల జాబితా నుంచి తీసేస్తున్నారు. బిహార్‌లో 7.24 కోట్ల మంది తాజాగా కోరిన పత్రాలు సమర్పించినట్టు ఈసీ జాబితా వెల్లడిస్తోంది. అయినా సరే, ఏకంగా 65 లక్షల మందిని సరైన విచారణ కూడా లేకుండానే మృతులు, వలసదారులుగా ముద్ర వేసి జాబితా నుంచి తొలగించేశారు!’’ అంటూ సిబల్ వాదించారు. పైగా ఈ విషయంలో శాస్త్రీయమైన సర్వే ఏదీ చేపట్టలేదని అఫిడవిట్ సాక్షిగా ఈసీయే అంగీకరించిందని ధర్మాసనానికి విన్నవించారు.
వాస్తవాలా, ఊహలా: ధర్మాసనం
బిహార్‌లో తాజాగా 65 లక్షల ఓట్లు తొలగించారనేందుకు ప్రాతిపదిక ఏమిటని ధర్మాసనం ప్రశ్నించింది. పిటిషనర్ల సందేహాలు, ఆందోళనలు వాస్తవికమా, లేక కేవలం ఊహాజనితాలా అని తెలుసుకోగోరింది. బిహార్లో 2025 జాబితాలో 7.9 కోట్ల ఓటర్లున్నట్టు సిబల్ ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ‘‘వారిలో 4,9 కోట్ల మంది 2003 నాటి ఓటరు జాబితాలోనూ ఉన్నారు. అందులో 22 లక్షల మందిని మృతులుగా నమోదు చేశారు’’ అన్నారు. మృతి, చిరునామా మార్పు కారణంగా ఓటర్ల జాబితా నుంచి మినహాయించిన వారి పేర్లను కోర్టుకు గానీ, వెబ్‌సైట్‌లో గానీ ఈసీ అందుబాటులో ఉంచలేదని మరో సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వాదించారు.
‘‘అడిగితే, దీనికి సంబంధించి బూత్ స్థాయి ఏజెంట్లకు ఏదో సమాచారం ఇచ్చామంటూ ఈసీ పొంతన లేని సమాధానం చెబుతోంది. అసలు ఇలాంటి సమాచారాన్ని ఎవరికైనా ఇవ్వాల్సిన అవసరమే తమకు లేదని బుకాయిస్తోంది’’ అంటూ ఆక్షేపించారు. ఆధార్, రేషన్ కార్డులను గుర్తింపు కార్డుగా జోడిస్తూ సమర్పించే పత్రాలను ఇతరత్రా మార్గాల ద్వారా ధ్రువీకరించుకోవడం ఈసీ బాధ్యత అని ధర్మాసనం పేర్కొంది. ఓటర్ల జాబితా నుంచి తొలగించడం వంటి కీలక నిర్ణయానికి వచ్చేముందు మిస్సింగ్ డాక్యుమెంట్లకు సంబంధించి బాధ్యులకు ముందుగా సమాచారమిచ్చారా లేదా అని ఈసీని ప్రశ్నించింది.