
ఎన్నికల సంఘానికి సుప్రీం ఆదేశం
న్యూఢిల్లీ: బిహార్‌లో ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ(ఎస్‌ఐఆర్) ప్రక్రియ వ్యవహారం సుప్రీంకోర్టుకెక్కింది. ఈ ప్రక్రియలో భాగంగా తొలగించిన 65 లక్షల మంది ఓటర్ల వివరాలు ఈ నెల 9వ తేదీలోగా సమర్పించాలని ఎన్నికల సంఘాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. బిహార్‌లో ఎస్‌ఐఆర్ చేపట్టాలని జూన్ 24న ఎన్నికల సంఘం జారీ చేసిన ఉత్తర్వును సవాలు చేస్తూ ప్రజాస్వామ్య సంస్కరణల సంస్థ(ఏడీఆర్) అనే ఎన్జీఓ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
పిటిషన్ దాఖలు చేసింది. తొలగింపునకు గురైన 65 లక్షల ఓటర్ల వివరాలు ప్రచురించేలా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని విజ్ఞప్తి చేసింది. వారు మరణించారా? లేక వలస వెళ్లారా? లేక మరేదైనా కారణం ఉందా? అనేది తెలియజేయాలని కోరింది. ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ ఎన్.కోటీశ్వర్ సింగ్‌తో కూడిన ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. తొలగించిన 65 లక్షల మంది ఓటర్ల సమాచారం అందజేయాలని, ఒక కాపీని ఏడీఆర్‌కు ఇవ్వాలని ఎన్నికల సంఘం తరఫు న్యాయవాదికి సూచించింది.