లేకుంటే ఎన్నికలను నిలిపివేస్తాం
మహారాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు స్పష్టీకరణ
న్యూఢిల్లీ: స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల అంశంపై అత్యున్నత న్యాయస్థానం కీలక ఆదేశాలను జారీ చేసింది. రిజర్వేషన్ల మొత్తం 50 శాతానికి మించి ఉండరాదని తేల్చి చెప్పింది. ఒకవేళ ఉల్లంఘన జరిగిందని తేలితే, ఎన్నికలను నిలిపివేయాలని ఆదేశిస్తామని ప్రకటించింది. ఇతర వెనుకబడిన తరగతుల(ఓబీసీ)కు రిజర్వేషన్లు 27 శాతం మేర రిజర్వేషన్లు కల్పించాలంటూ 2022లో జేకే బంథియా కమిషన్ సిఫారసు చేసినప్పటి పరిస్థితులకు అనుగుణంగానే మహారాష్ట్రలో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరపాలని సోమవారం జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చిల ధర్మాసనం ఆదేశించింది. ఈ విషయమై తదుపరి విచారణను ఈ నెల 19వ తేదీన చేపడతామంది.
రాష్ట్ర ప్రభుత్వం 50 శాతం రిజర్వేషన్ సీలింగ్‌కు కట్టుబడి ఉండాల్సిందేనని పేర్కొంది. అంతకుమించితే మాత్రం ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ మొదలైందంటూ సాకులు చెప్పినా వినిపించుకోమని, తమ అధికారాలను పరీక్షించవద్దని హెచ్చరించింది. కొన్ని చోట్ల రిజర్వేషన్లు 70 శాతం వరకు ఉన్నాయంటూ సీనియర్ న్యాయవాదులు వికాస్ సింగ్, నరేంద్ర హూడా తెలపడంతో స్పందించిన ధర్మాసనం.. దీనిపై ఆ రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. గతంలో రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పునకు కట్టుబడి ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. డిసెంబర్ 2వ తేదీన మున్సిపల్ కౌన్సిళ్లు, నగర పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. నామినేషన్ల దాఖలుకు ఈ నెల 17 ఆఖరి తేదీ.


