
పట్టుదల ఉంటే సాధించలేదని ఏదీ లేదని అంటారు. దీనిని కొందరు నిజమని నిరూపించారు. ఈ కోవలోకే వస్తారు శ్వేతా భారతి. ఒకవైపు ఉద్యోగం చేస్తూనే, మరోవైపు పోటీ పరీక్షలకు సిద్ధమైన శ్వేత తాను అనుకున్నది సాధించి, ఇతరులకు స్ఫూర్తిదాయకంగా నిలిచారు.
యూపీఎస్సీ సివిల్ సర్వీస్ పరీక్ష(UPSC Civil Service Exam) ప్రపంచంలోనే అత్యంత క్లిష్టమైన పరీక్షలలో ఒకటని చెబుతుంటారు. పలువురు అభ్యర్థులు యూపీఎస్సీ పరీక్షకు సిద్ధమయ్యేందుకు కోచింగ్ తీసుకుంటారు. అయితే ఏమాత్రం కోచింగ్ అవసరం లేకుండానే యూపీఎస్సీ పరీక్షలో ఉత్తీర్ణులైనవారు కూడా ఉన్నారు. ఇటీవలే బీహార్ కేడర్‌లో పోస్టింగ్ అందుకున్న ఐఏఎస్ శ్వేతా భారతి దీనికి ఉదాహరణగా నిలిచారు.
బీహార్ యువతి శ్వేతా భారతి(Shweta Bharti) యూపీఎస్సీ పరీక్షకు ముందు బీపీఎస్‌సీ పరీక్షలో ఉత్తీర్ణురాలయ్యారు. అయితే ఐఏఎస్ అధికారి కావడమే ఆమె కల. అందుకే ఆమె ప్రభుత్వ ఉద్యోగం దక్కించుకున్నప్పటికీ, యూపీఎస్సీకి ప్రపరేషన్ కొనసాగించారు. శ్వేతా భారతి ఉదయం పూట 9 గంటల పాటు పనిచేస్తూనే, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యారు.
శ్వేతా భారతి బీహార్‌లోని నలంద జిల్లాలో జన్మించారు. ఆమెది సాధారణ కుటుంబ నేపధ్యం. శ్వేతా భారతి చిన్నప్పటి నుంచి చదువులో చాలా చురుకుగా ఉండేవారు. పట్నాలోని ఇషాన్ ఇంటర్నేషనల్ పబ్లిక్ స్కూల్‌లో 12వ తరగతి వరకు చదువుకున్నారు. అనంతరం ఆమె భాగల్పూర్ ఇంజనీరింగ్ కళాశాల నుండి ఎలక్ట్రికల్,టెలికమ్యూనికేషన్‌లో బీటెక్ డిగ్రీని అందుకున్నారు. తరువాత ఆమె విప్రోలో ఉద్యోగం సంపాదించారు.
లక్షల్లో జీతం అందుకుంటున్నప్పటికీ ఆమె ఐఏఎస్ అధికారి(IAS officer) కావాలని నిశ్చయించుకున్నారు. అందుకే ఒకవైపు ఉద్యోగం చేస్తూనే, మరోవైపు యూపీఎస్సీ పరీక్షకు సిద్ధమవుతూ వచ్చారు. పగటిపూట ఉద్యోగం చేస్తూనే, రాత్రపూట చదువుకోసాగారు. 2020లో జరిగిన బీపీఎస్‌సీ పరీక్షలో శ్వేతా భారతి 65 వ ర్యాంకు సాధించారు. దీంతో ఆమెకు ప్రోగ్రామ్ ఆఫీసర్ (డీపీఓ)గా ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. అయినప్పటికీ ఆమె తన లక్ష్యం నెరవేర్చుకునే దిశగానే ముందుకు సాగారు. ఎట్టకేలకు ఆమె కృషి ఫలించింది. 2021లో యూపీఎస్సీ పరీక్షలో 356వ ర్యాంక్ సాధించారు. శ్వేతా భారతి యూపీఎస్సీ2021 బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ మహిళా అధికారి. ప్రస్తుతం బీహార్‌లోని భాగల్పూర్‌లో అసిస్టెంట్ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు.
ఇది కూడా చదవండి: ISRO SpaDeX Mission: స్పేడెక్స్ ఉపగ్రహాల ప్రయోగం విజయవంతం: ఇస్రో