న్యూఢిల్లీ: బీజేపీ దిగ్గజ నేత ఎల్‌కే అద్వానీకి శనివారం 98వ జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ నేత శశి థరూర్.. సంచలన వ్యాఖ్యలు చేశారు. సుదీర్ఘకాలం దేశానికి సేవలందించిన అద్వానీ వంటి నేత గుణగణాలను కేవలం ఒకే ఒక్క ఘటనతో నిర్థారించడం సరికాదంటూ అభిప్రాయపడ్డారు.
అదేవిధంగా, చైనాతో జరిగిన యుద్ధంలో ఓటమి కారణంగా అప్పటి ప్రధాని నెహ్రూను, దేశంలో అత్యవసర పరిస్థితి విధించినందుకు ఇందిరాగాంధీ వ్యక్తిత్వాన్ని లెక్కగట్టలేమని ఆయన పేర్కొన్నారు. ఇదే విషయం, లాల్ కృష్ణ అద్వానీకి వర్తిస్తుందని తెలిపారు. అదెంత ప్రాముఖ్యం కలిగినదై నప్పటికీ కేవలం ఒకే ఒక్క పరిణామాన్ని ప్రాతిపదికగా తీసుకుని, వారి సుదీర్ఘ సేవలను బేరీజు వేయడం అన్యాయమన్నారు. అద్వానీ నిరాడంబరత, యోగ్యత, ఆధునిక భారత దేశ పథాన్ని నిర్ణయించడంలో ఆయన పాత్ర ఎవరూ కాదన లేనిదన్నారు. ఇక, 1990లో రామ జన్మభూమి ఉద్యమాన్ని దేశ వ్యాప్త రథయాత్రతో ముందుండి నడిపిన అద్వానీ, బీజేపీని జాతీయ రాజకీయాల్లో ప్రబల శక్తిగా తీర్చిదిద్దిన నేతగా ఖ్యాతి గడించారు.
మరోవైపు.. థరూర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ స్పందించింది. ఈ క్రమంలో.. అద్వానీని ప్రశంసిస్తూ శశిథరూర్ చేసిన వ్యాఖ్యలతో పార్టీకి సంబంధం లేదని కాంగ్రెస్ పేర్కొంది. అవి ఆయన వ్యక్తిగతంగా చేసిన వ్యాఖ్యలే అని వివరణ ఇచ్చింది. ఇక, అద్వానీపై శశిథరూర్ చేసిన వ్యాఖ్యలపై పలు కాంగ్రెస్ నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. శశిథరూర్ వ్యాఖ్యలను ‘ఎక్స్’లోనే ఓ న్యాయవాది విమర్శించారు. రామజన్మభూమి ఉద్యమం సందర్భంగా రథయాత్రతో దేశంలో అద్వానీ విద్వేష బీజాలు నాటారని, ఆయన చేసింది ప్రజాసేవ కాదని పోస్టు చేశారు. దీనికి థరూర్ సమాధానమిస్తూ, ఒక్క ఘటనతో సుదీర్ఘకాలం పాటు ఆయన చేసిన సేవలను తక్కువ చేయడం సమంజసం కాదన్నారు.
Wishing the venerable Shri L.K. Advani a very happy 98th birthday! His unwavering commitment to public service, his modesty & decency, and his role in shaping the trajectory of modern India are indelible. A true statesman whose life of service has been exemplary. 🙏 pic.twitter.com/5EJh4zvmVC
— Shashi Tharoor (@ShashiTharoor) November 8, 2025


