మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ హఠాన్మరణంపై రాజకీయ రగడ కొనసాగుతోంది. విమాన ప్రమాదంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సహా విపక్ష నేతలు కొందరు అనుమానాలు వ్యక్తం చేసింది తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన బాబాయ్ శరద్ పవార్ స్పందించారు. ఈ ఘటనను రాజకీయం చేయొద్దంటూ రాజకీయ శ్రేణులను కోరారాయన.
అజిత్ మరణం తీవ్ర దుఃఖాన్ని మిగిల్చిందన్న శరద్ పవార్.. ఓ సమర్థుడైన నాయకుడిని మహారాష్ట్ర కోల్పోయిందన్నారు. జరిగిన నష్టాన్ని పూడ్చలేం.. కానీ, ప్రతిదీ మన చేతుల్లో లేదు. ఈ ఘటనను రాజకీయం చేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారు. ఇందులోకి రాజకీయాలు తీసుకురావద్దు. ఇది పూర్తిగా ప్రమాదమే. ఈ ఘటన నాతోపాటు రాష్ట్రం మొత్తానికి తీవ్ర దుఃఖాన్ని మిగిల్చింది. దయచేసి ఈ విషాదాన్ని రాజకీయం చేయొద్దు అని మీడియా ద్వారా విజ్ఞప్తి చేశారు. మరోవైపు..
తన సోదరుడి అకాల మరణంతో తీవ్ర షాక్‌కు గురయ్యానని ఎన్సీపీ (శరద్ పవార్ వర్గం) ఎంపీ సుప్రియా సూలే భావోద్వేగానికి గురయ్యారు. ప్రమాదం వార్త తెలిసిన వెంటనే అజిత్ సతీమణి సునేత్ర, కుమారుడు పార్థ్‌తో కలిసి మృతదేహాన్ని తరలించిన బారామతి ఆసుపత్రికి సుప్రియ కూడా వెళ్లారు.
చివరి ట్వీట్ చెబుతోందిగా..
అధికార మహాయుతి కూటమిలో తన ఎన్సీపీ వర్గంలో భాగమైన అజిత్ పవార్.. డిప్యూటీ సీఎం హోదాలో పలు మంత్రిత్వ శాఖలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే మారుతున్న రాజకీయ పరిణామాలతో తిరిగి చిన్నాన్న శరద్ పవార్ సారథ్యంలోని ఎన్సీపీలోకి వెళ్లే యోచనలో ఆయన ఉన్నాడని.. ఈ క్రమంలోనే విమాన ప్రమాదం పలు అనుమానాలు రేకెత్తిస్తోందని, ఘటనపై సమగ్ర దర్యాప్తు జరగాల్సిందేనని మమతా బెనర్జీ సహా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సమాజ్‌వాదీ పార్టీ సారథి అఖిలేశ్ యాదవ్ తదితరులు ప్రకటనలు చేశారు. అయితే..
అజిత్ పవార్ ప్రాణాలు కోల్పోయిన వేళ చివరిసారిగా ఆయన చేసిన సోషల్ మీడియా పోస్టు వైరల్‌గా మారింది. మంత్రివర్గ సమావేశంలో భాగంగా ‘మీ విశ్వసనీయ ప్రభుత్వం’ తీసుకున్న పలు ముఖ్యమైన నిర్ణయాలు అని పేర్కొంటూ.. రాష్ట్రంలో వృత్తి శిక్షణా సంస్థలను ఏర్పాటుచేయడం, కాంట్రాక్టర్ల చెల్లింపు వ్యవస్థల్లో మార్పులు చేయడం, ప్రైవేటు కంపెనీలకు కేటాయించిన ప్రభుత్వ భూమి లీజు కాలాల పొడిగింపు వంటి విషయాలను వెల్లడించారు. దీంతో.. ఆ అనుమానాలకు చెక్ పడినట్లైంది.
आपल्या विश्वासू राज्य सरकारनं आजच्या मंत्रिमंडळाच्या बैठकीत घेतलेले काही महत्त्वपूर्ण निर्णय :
✅ औद्योगिक प्रशिक्षण संस्थामध्ये 'पीएम सेतू' योजना राबविण्यात येणार. होतकरू युवकांना दिलासा. पहिल्या टप्प्यात नागपूर, छत्रपती संभाजीनगर आणि पुणे जिल्ह्यातील औद्योगिक प्रशिक्षण…— Ajit Pawar (@AjitPawarSpeaks) January 27, 2026


