ఈ వేడి ఇంతింతై! | Severe heatwaves disproportionately affect women | Sakshi
Sakshi News home page

ఈ వేడి ఇంతింతై!

Oct 8 2026 5:59 AM | Updated on Oct 8 2026 5:59 AM

Severe heatwaves disproportionately affect women

మహిళలపై ఎక్కువగా తీవ్రమైన ఎండల ప్రభావం

అధిక ఉష్ణోగ్రత ఉన్న ప్రాంతాల్లో 70% మందికి అలసట, డీహైడ్రేషన్, జీర్ణకోశ సమస్యలు

దేశంలో 250కి పైగా ’వేడి సంబంధిత ప్రణాళికలు’ అమల్లో ఉన్నా లింగ స్పృహ మృగ్యం

7 రాష్ట్రాల్లో 3,300 మంది మహిళలపై ఎంఎస్‌ఎస్‌ఆర్‌ఎఫ్‌ అధ్యయనం

(సాక్షి, స్పెషల్‌ డెస్క్‌)
భూతాపోన్నతి కారణంగా తీవ్రమవుతున్న ఎండలు స్త్రీపురుషులందరినీ ఒకేలా ప్రభావితం చేయటం లేదు. ముఖ్యంగా పేదరికం, అసంఘటిత రంగంలోని మహిళలపై దీని ప్రభావం శారీరకంగా, ఆర్థికంగా, మానసికంగా తీవ్రంగా పడుతోందని ఎంఎస్‌ స్వామినాథన్‌ రీసెర్చ్‌ ఫౌండేషన్‌ (ఎంఎస్‌ఎస్‌ఆర్‌ఎఫ్‌) నివేదిక వెల్లడించింది. డాక్టర్‌ సౌమ్య స్వామినాథన్‌ బృందం తెలంగాణ సహా 7 రాష్ట్రాల్లో 3,300 మందికి పైగా మహిళలపై నిర్వహించిన అధ్యయనంలో కీలక అంశాలు వెలుగుచూశాయి.

శరీర నిర్మాణం, ఇంటా బయట పనుల వల్లే..
మహిళల శారీరక నిర్మాణం, వారు నిర్వర్తించే ఇంటి, బయటి పనులు వారిని ఎండ వేడికి మరింత సులభంగా గురయ్యేలా చేస్తున్నాయి. తీవ్ర వేడి ఉన్న ప్రాంతాల్లో 70% మంది మహిళలు అలసట, డీహైడ్రేషన్, జీర్ణకోశ సమస్యలతో బాధపడుతున్నారు. నీటి కొరత, మరుగుదొడ్ల లేమితో మూత్రకోశ ఇన్ఫెక్షన్లు, రుతుక్రమ సమస్యలు పెరిగాయి. ముందస్తు ప్రసవాలు, గర్భస్రావాల ముప్పు అధికమవుతోంది. బయట కూలి పనులు ముగించుకొని ఇంటికి వచ్చాక కూడా వేడెక్కిన రేకుల షెడ్లలో వంట చేయటం, దూర ప్రాంతాల నుంచి నీరు మోసుకురావటం మహిళలకు తప్పటం లేదు. వేసవిలో పనులకు వెళ్లలేక 97% మంది నిరుపేద మహిళలు నెలకు రూ.1,500కి పైగా వేతనం నష్టపోతున్నారు. అధిక ఉష్ణోగ్రతల వల్ల నిద్రలేమి, తీవ్ర కోపం పెచ్చరిల్లే సందర్భాలు పెరుగుతూ కుటుంబంలో అశాంతి రేపుతున్నాయి. దీనికి ఆర్థిక లేమి తోడై గృహహింస తీవ్రమవుతోందని అధ్యయనంలో పాల్గొన్న 72% బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.

లింగ స్పృహ లేని విధానాలు
దేశవ్యాప్తంగా 250కి పైగా హీట్‌ యాక్షన్‌ ప్లాన్లు అమల్లో ఉన్నప్పటికీ, అవి ‘జెండర్‌–బ్లైండ్‌’ (లింగ స్పృహ లేనివిగా)గా మారాయి. స్త్రీ, పురుషులను ఒకే దృష్టితో చూడటం వల్ల గర్భవతులు, మహిళా శ్రామికుల ప్రత్యేక అవసరాలు విస్మరణకు గురవుతున్నాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సరైన మందులు, కూలింగ్‌ సౌకర్యాలు లేవు. ఉపాధి హామీ, వ్యవసాయ కూలీల పనివేళల సడలింపు, రక్షణగా నీడ కల్పించటం, పుష్కలంగా ఓఆర్‌ఎస్‌ సరఫరా కేవలం కాగితాలకే పరిమితమవుతున్నాయి.

ఇలా చేయాలి..
⇒ ఈ సమస్యల పరిష్కారానికి ఎంఎస్‌ఎస్‌ఆర్‌ఎఫ్‌ అధ్యయన నివేదిక అనేక సూచనలు చేసింది. వేడి ఒత్తిడిని ఎదుర్కొనేందుకు అమలు చేసే హీట్‌ యాక్షన్‌ ప్లాన్ల (వేడిమికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళిక)లో మహిళల ఆరోగ్యం, పునరుత్పత్తి సమస్యలను చేర్చాలి. ఈ ప్లాన్ల అమలులో స్వయం సహాయక బృందాలు, ఆశా వర్కర్లను భాగస్వాముల్ని చేయాలి. 
⇒ ఎండ ప్రచండంగా ఉండే రోజుల్లో మధ్యాహ్నం 11:30–3:30 వరకు పనులను నిషేధించి.. ఉదయం, సాయంత్రం వేళల్లో పనులు చేయించాలి. అధిక వేడి ఒత్తిడి ఉండే రోజుల్లో పనులు కోల్పోయిన పనివారికి ‘వాతావరణ సంబంధిత నష్టపరిహారం’ నగదు రూపంలో అందించాలి. 
⇒ పొలాలు, మార్కెట్లలో తాగునీరు, తాత్కాలిక నీడ కల్పించటం, మొబైల్‌ టాయిలెట్లు ఏర్పాటు చెయ్యటం వంటి చర్యలు చేపట్టాలి. 
⇒ పేదల రేకులు/డాబా ఇళ్లలో ఉష్ణోగ్రతను తగ్గించేందుకు పైకప్పుపైన తెల్లని పూతలు పూయాలి. గడ్డి/వెదురు పైకప్పులతో కూడిన గృహ­­నిర్మాణ ప్రాజెక్టులకు ప్రభుత్వ రాయితీలు ఇవ్వాలి. 
⇒ వాతావరణ మార్పులను కేవలం పర్యావరణ అంశంగానే కాక.. ప్రజారోగ్య, లింగ వివక్ష సమస్యగా గుర్తించినప్పుడే మహిళలకు వేడి ఒత్తిడి నుంచి సమగ్ర రక్షణ సాధ్యమవుతుందని ఎంఎస్‌ఎస్‌ఆర్‌ఎఫ్‌ సూచించింది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement