ఒక చిన్న పట్టణానికి చెందిన సాధారణ వ్యక్తి తన అసాధారణ తెలివి తేటలతో అంతర్జాతీయంగా ఖ్యాతి సాధించి, వేలకోట్ల సామ్రాజ్యాన్ని సృష్టించ గలడని ఎవరైన ఊహించగలరా? సాంప్రదాయ బంగాళాదుంపల వ్యాపారాన్ని ఆధునిక ఫ్రోజెన్ ఫుడ్ సామ్రాజ్యంగా మార్చిన ఒక పారిశ్రామికవేత్త నేటి స్ఫూర్తిదాయక మైన కథ గురించి తెలుసుకుందాం. రూ. 1500 కోట్ల టర్నోవర్‌తో సాగుతున్న అహ్మదాబాద్‌కు చెందిన హాయ్‌ఫన్ ఫుడ్స్ (HyFun Foods) హరేష్ కరంచందానీ కథ ఇది.
హరేష్ కరంచందానీ గుజరాత్‌లోని మెహసానాలో ఒక సాధారణ వ్యాపార కుటుంబంలో జన్మించారు. బాల్యం చాలా సాధారణంగా గడిచినా, అతని ఆలోచనా విధానం ఎప్పుడూ ప్రత్యేకంగా ఉండేది. చిన్న వయసులోనే, కుటుంబ వ్యాపారానికి దూరంగా చదువుపై దృష్టి పెట్టేందుకు అతన్ని హాస్టల్‌కు పంపించారు. అలా హాస్టల్‌లో నివసిస్తున్నప్పుడు, హరేష్ ప్రతీ విషయాన్ని జాగ్రత్తగా గమనించే అలవాటును పెంచుకున్నారు. అంతేకాదు ఆ హాస్టల్ జీవితం ఎన్నో పాఠాలు నేర్పింది. భవిష్యత్తుకు బంగారు బాటలు వేసింది.
హాయ్‌ఫన్ ఫుడ్స్ మూలాలు 1962 నాటివని చెప్పొచ్చు. హరేష్ కుటుంబం చాలా ఏళ్లు బంగాళాదుంపల వ్యాపారంలో ఉంది. ఆసాందాస్ కంచందాని 'ఆసాందాస్ అండ్ సన్స్' అనే కుటుంబ వ్యాపారం ద్వారా బంగాళాదుంపలు , ఉల్లిపాయల వ్యాపారాన్ని చేశారు. ఆసాందాస్ పెద్ద కుమారుడు జైరాజ్ ఆసాందాస్ కంచందాని 1976లో ఈ వ్యాపారంలో చేరగా, ఆ తర్వాత చిన్న కుమారుడు కిషన్‌చంద్ ఆసాందాస్ కంచందాని 1985లో చేరారు.
మూడవ తరానికి ప్రతినిధి హరేష్ కంచందాని 1999లో కుటుంబ వ్యాపారంలో చేరారు. తమ్ముడు ధీరజ్ 2002లో, బంధువు కమలేష్ 2008లో చేరారు. ఈ వ్యాపారం స్థిరంగా ఉన్నప్పటికీ, దాని గుర్తింపుకు కొన్ని పరిమితులుండేవి. కొంతకాలం తర్వాత, కేవలం వ్యాపారం ద్వారా మాత్రమే వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లడం అంత సులభం కాదని హరేష్ అర్థం చేసుకోవడం ప్రారంభించారు. అందుకు కొత్త మార్గాన్ని అన్వేషించారు.
క్రమంగా, అతని ఆలోచన ఫ్రోజెన్ ఫుడ్ వ్యాపారం వైపు మళ్లింది. ఆ సమయంలో, భారతదేశంలో ఫ్రోజెన్ ఫుడ్‌ను ఒక గంభీరమైన పరిశ్రమగా పరిగణించలేదు. ప్రజలు దానిని అనారోగ్యకరమైన లేదా తక్కువ-నాణ్యత గల ఆహారంగా భావించేవారు. ప్రజలు ఈ రంగాన్ని ప్రమాదకరమైనదిగా భావించినప్పటికీ, హరేష్ దానిలో భవిష్యత్తును చూశాడు. ఈ క్రమంలో ప్రతిరోజూ ఒక్క పక్క తీవ్రమైన పోటీ, మరోపక్క మార్కెట్ హెచ్చు తగ్గులు, పరిమిత లాభాలు ఇలాంటి సవాళ్లు తప్పలేదు. తయారీ రంగంలో అనుభవం లేకపోవడం అతిపెద్ద సమస్య. పైగా అతని ట్రేడింగ్ వ్యాపారం అప్పటికే స్థిరంగా నడుస్తుండటంతో, మొదట్లో అతని కుటుంబం ఈ నిర్ణయం పట్ల సంకోచించింది.
2010లో ఒక బహుళజాతి కంపెనీని సందర్శించినప్పుడు, విదేశాలలో హరేష్ ఫ్రోజెన్ ఫుడ్ పరిశ్రమను నిశితంగా పరిశీలించారు. అది లాభవంతమైన సౌకర్యవంతమైందే, కానీ ఇండియా పరిస్థితి భిన్నం అయినా హరేష్ రిస్క్ తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. దానికనుగుణంగా తన వ్యాపారాన్ని మలుచుకున్నారు.
మొదట్లోనే ఊహించని దెబ్బ
బంగాళాదుంపలను ప్రాసెస్ చేసి ఫ్రోజెన్ ఫ్రెంచ్ ఫ్రైస్, బర్గర్ ప్యాటీలు, పొటాటో వెడ్జెస్ , రెస్టారెంట్లు, ఫుడ్‌సర్వీస్ కంపెనీలు ఉపయోగించే ఇతర ఉత్పత్తులుగా తయారు చేయాలనేది ఈ ఆలోచన. ప్రాసెసింగ్‌కు తగిన బంగాళాదుంపల సాగుకు ఉత్తర గుజరాత్‌లో ఉన్న అవకాశాలు ఈ ప్రణాళికకు గట్టి పునాదిగా మారాయి. ఇందుకోసం నెదర్లాండ్స్ నుండి యంత్రాలను దిగుమతి చేసుకున్నారు. కానీ ఇక్కడే అనూహ్యంగా పెద్ద పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. సరఫరా కంపెనీ అకస్మాత్తుగా దివాళా తీయడంతో, సుమారు రూ.3 కోట్ల ష్టం వాటిల్లింది. ఆ రోజుల్లో మూడుకోట్ల రూపాయల నష్టం ఎవరికైనా పెద్ద దెబ్బే. కానీ హరేష్ నిరాశ చెందకుండా, కొత్తగా ప్రారంభించాలని నిర్ణయించుకున్నాడు. ఎంతో కృషి తరువాత 2015లో హైఫన్ ఫుడ్స్ లాంచ్ అయింది. ఎన్నో సవాళ్ళొచ్చినా నాణ్యత విషయంలో రాజీ పడలేదు. తన ఉత్పత్తుల నాణ్యతను మెరుగుపరచడానికి రేయింబవళ్లు అవిశ్రాంతంగా పనిచేశారు. ఫలితంగా ప్రజల్లో బ్రాండ్‌పై నమ్మకం పెరిగింది.
తొలి విజయం
తొలి ఏడాదిలోనే 2016లో, హై ఫన్ ఫుడ్స్ బర్గర్ కింగ్ నుండి సరఫరా కాంట్రాక్టు లభించింది. అది కంపెనీ దిశను పూర్తి మార్చివేసింది. బ్రాండ్ నాణ్యత గ్లోబల్ స్థాయికి చేరింది. అంతర్జాతీయ మార్కెట్‌లో గుర్తింపు లభించింది. హైఫన్ ఫుడ్స్ ప్రపంచ మార్కెట్‌లో తనకంటూ ఒక గుర్తింపును ఏర్పరచుకొని అంతర్జాతీయ ఫుడ్ బ్రాండ్‌గా ఎదిగింది. నేడు 40కి పైగా దేశాలకు ఉత్పత్తులను అందిస్తోంది. రూ. 150 కోట్లకు పైగా టర్నోవర్ సాధిస్తోంది. 7500కి పైగా రైతుతో బలమైన నెటవరర్క్‌తో1000కి పైగా ఉద్యోగులతో తన ప్రత్యేకతను చాటుకుంటోంది.


