పాత వాహనం ఇచ్చేశాక..  ఆర్సీ రద్దు తప్పనిసరి! | Scrapping of 15 Years Old Vehicles, says ministry of transport | Sakshi
Sakshi News home page

పాత వాహనం ఇచ్చేశాక..  ఆర్సీ రద్దు తప్పనిసరి!

Jun 20 2026 4:07 AM | Updated on Jun 20 2026 4:07 AM

Scrapping of 15 Years Old Vehicles, says ministry of transport

పాత వాహనాలను తుక్కురి, జిస్ట్రేషన్‌ సర్టిఫికెట్‌,  రద్దు,

స్క్రాపింగ్‌ విధానంపై కేంద్ర తాజా మార్గదర్శకాలు 

అధీకృత కేంద్రాల్లోనే తుక్కుగా మార్చాలి 

నిర్లక్ష్యం చేస్తే యజమానులదే చట్టపరమైన బాధ్యత 

సరైన విధానం పాటిస్తేనే రాయితీలని స్పష్టీకరణ

సాక్షి, న్యూఢిల్లీ: పాత వాహనాలను తుక్కుగా (స్క్రాప్‌) మార్చిన తర్వాత రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్‌ (ఆర్సీ) రద్దు చేయించడం తప్పనిసరి అని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ స్పష్టం చేసింది. వాహనాన్ని ఏదో ఒక గ్యారేజీలో స్క్రాప్‌ కింద వేసి వదిలేస్తే భవిష్యత్తులో న్యాయపరమైన, ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది.

 మోటారు వాహనాల చట్టం–1988 నిబంధనల ప్రకారం అ«దీకృత ‘రిజిస్టర్డ్‌ వెహికల్‌ స్క్రాపింగ్‌ ఫెసిలిటీ’(ఆర్‌వీఎస్‌ఎఫ్‌) కేంద్రాల్లోనే పాత వాహనాలను తుక్కుగా మార్చాలని, అనంతరం ఆర్టీఓ కార్యాలయంలో విధిగా ఆర్సీని రద్దు చేసుకోవాలని తాజా మార్గదర్శకాల్లో పేర్కొంది. కాగా ఈ నోటిఫికేషన్‌ వచ్చిన 30 రోజుల్లోగా అభ్యంతరాలు, సలహాలు ఇచ్చేందుకు కేంద్రం అవకాశం కల్పించింది. 

నిబంధన ఎవరికి వర్తిస్తుందంటే.. 
వాయు కాలుష్య నియంత్రణ, రహదారి భద్రత లక్ష్యంగా కేంద్రం వాహన స్క్రాపేజ్‌ విధానాన్ని అమలు చేస్తోంది. దీని ప్రకారం 20 ఏళ్లు దాటిన వ్యక్తిగత (ప్రైవేటు) వాహనాలకు, 15 ఏళ్లు నిండిన వాణిజ్య (కమర్షియల్‌) వాహనాలకు ఆటోమేటెడ్‌ టెస్టింగ్‌ స్టేషన్లలో (ఏటీఎస్‌) ఫిట్‌నెస్‌ పరీక్ష తప్పనిసరి. ఈ పరీక్షలో విఫలమైన వాహనాలను రోడ్లపై నడపడానికి వీల్లేదు. వీటిని ఎండ్‌–ఆఫ్‌–లైఫ్‌ (ఈఎల్‌వీ) వాహనాలుగా పరిగణించి అధికారిక కేంద్రాల్లో తుక్కుగా మార్చాల్సిందే. 15 ఏళ్లు నిండిన ప్రభుత్వ వాహనాలను నేరుగా స్క్రాప్‌ చేయాలి. 

నిర్లక్ష్యం చేస్తే ముప్పు 
పాత వాహనాన్ని అనధికారికంగా తుక్కుగా మార్చి ఆర్సీ రద్దు చేయించకపోతే, ఆ వాహనం చట్టపరంగా పాత యజమాని పేరుతోనే కొనసాగుతుంది. దీనివల్ల పలు ఇబ్బందులు ఎదురవుతాయి. చట్టపరమైన చిక్కులు: వాహనం ఇంజిన్, ఛాసిస్‌ నంబర్లను దురి్వనియోగం చేసి నేరస్థులు నకిలీ వాహనాలు సృష్టించినా, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడినా చట్టపరంగా యజమానే బాధ్యత వహించాల్సి ఉంటుంది. పోలీసు కేసులు నేరుగా యజమానిపైనే నమోదవుతాయి. అంతేకాదు, ఆ నకిలీ వాహనం పేరుతో నమోదయ్యే ట్రాఫిక్‌ చలాన్లు, పెండింగ్‌ పన్నుల నోటీసులు నేరుగా యజమాని ఇంటికే వస్తాయి. ఆర్సీ రద్దు చేయకుండా వదిలేస్తే.. ప్రభుత్వం, ఆటోమొబైల్‌ సంస్థలు అందించే రాయితీలను కోల్పోతారు. 

రద్దుతో ప్రయోజనాలు  
సరైన పద్ధతిలో స్క్రాప్‌ చేసి, ఆర్టీఓ వద్ద ఆర్సీని రద్దు చేసుకున్న వారికి కొత్త వాహనాల కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వం, ఆటోమొబైల్‌ సంస్థలు పలు ఆర్థిక ప్రోత్సాహకాలు అందిస్తున్నాయి. తుక్కు విలువ (స్క్రాప్‌ వాల్యూ) నేరుగా యజమాని బ్యాంకు ఖాతాలో జమవుతుంది. కొత్త వాహనం కొనుగోలు సమయంలో రిజి్రస్టేషన్‌ ఫీజును పూర్తిగా మాఫీ చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వాల నిబంధనల మేరకు కొత్తవాహనం రోడ్డు పన్నులో 25 శాతం వరకు రాయితీ లభిస్తుంది. కార్ల తయారీ సంస్థలు (మారుతీ సుజుకీ, టాటా, మహీంద్రా తదితర సంస్థలు) కొత్త కారు ఎక్స్‌–షోరూమ్‌ ధరపై 1.5 శాతం లేదా రూ.20 వేల వరకు తగ్గింపు ఇస్తున్నాయి. వాణిజ్య వాహనాలకు ఎక్స్‌–షోరూమ్‌ ధరపై 2.75 శాతం నుంచి 3 శాతం వరకు ప్రత్యేక రాయితీ వర్తిస్తుంది.

ఆర్సీ రద్దు ప్రక్రియ ఇలా..  
వాహనాన్ని ముందుగా ప్రభుత్వ గుర్తింపు పొందిన ఆర్‌వీఎస్‌ఎఫ్‌ కేంద్రానికి అప్పగించాలి. వారు వాహనం స్వీకరించినట్లు ‘సర్టిఫికెట్‌ ఆఫ్‌ డిపాజిట్‌’, తుక్కుగా మార్చాక ‘సర్టీఫికెట్‌ ఆఫ్‌ వెహికల్‌ స్క్రాపింగ్‌’జారీ చేస్తారు. ఈ ధ్రువపత్రాలతో పాటు ఒరిజినల్‌ ఆర్సీని తీసుకుని ఆర్టీఓ కార్యాలయంలో ఫారం–26 నింపి దరఖాస్తు చేయాలి. పత్రాల పరిశీలన అనంతరం ఆర్టీఓ అధికారులు ఆర్సీని అధికారికంగా రద్దు చేస్తారు. కొన్ని రాష్ట్రాల్లో పరివాహన్‌ పోర్టల్‌ ద్వారా ఆన్‌లైన్‌లోనూ దరఖాస్తు చేసుకునే సదుపాయం కల్పించారు. 
దరఖాస్తుకు అవసరమైన పత్రాలు  
→ ఒరిజినల్‌ రిజి్రస్టేషన్‌ సర్టీఫికెట్‌ (ఆర్సీ) 
→ స్క్రాపింగ్‌ కేంద్రం జారీ చేసిన ధ్రువపత్రాలు (సీవోడీ, సీవీఎస్‌) 
→ యజమాని ఆధార్, పాన్‌ కార్డు కాపీలు 
→ వాహనాన్ని స్వచ్ఛందంగా తుక్కుగా మారుస్తున్నట్లు తెలిపే అఫిడవిట్‌ 
→ వాహనంపై రుణం ఉంటే.. సంబంధిత బ్యాంకు జారీ చేసిన నో అబ్జెక్షన్‌ సర్టీఫికెట్‌ (ఎన్‌ఓసీ) తప్పనిసరి.   

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement