రాపిడోతో కేంద్రం జట్టు | Rapido Partners With Government To Promote RahaVeer Road Safety Initiative, Sets Guinness Record | Sakshi
Sakshi News home page

రాపిడోతో కేంద్రం జట్టు

Jun 9 2026 11:25 AM | Updated on Jun 9 2026 11:52 AM

Rapido Ministry Road Transport Join Forces for Rahaveer Initiative

రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఒప్పందం

‘రహావీర్‌’ పథకంపై విస్తృత ప్రచారం

‘గోల్డెన్‌ అవర్‌’ ప్రాణరక్షణే లక్ష్యం  

ప్రజల భాగస్వామ్యానికి ప్రాధాన్యం

నాలుగు లక్షలకుపైగా రాపిడో కెప్టెన్లతో ప్రతిజ్ఞ

గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు నమోదు 

దేశవ్యాప్తంగా రోడ్డు భద్రతపై అవగాహన పెంచేందుకు, కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక ‘రహావీర్‌’ పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రముఖ మొబిలిటీ ప్లాట్‌ఫారమ్‌ రాపిడో, కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ చేతులు కలిపాయి. రోడ్డు ప్రమాదాలు జరిగిన తొలి గంటలో (గోల్డెన్‌ అవర్‌) బాధితులకు సకాలంలో ప్రాణరక్షణ సహాయం అందించడాన్ని ప్రోత్సహించడమే ఈ పథకం ముఖ్య లక్ష్యం. కేంద్ర రోడ్ల, రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ, రాపిడో కో–ఫౌండర్‌ అరవింద్‌ సంక సమక్షంలో ఈ భాగస్వామ్యాన్ని అధికారికంగా ప్రకటించారు.

‘‘రోడ్డు భద్రత అందరి ఉమ్మడి బాధ్యత. ప్రమాదాల వల్ల జరిగే మరణాలను తగ్గించడంలో ప్రజల భాగస్వామ్యం కీలకం. రహావీర్‌ పథకం ద్వారా ప్రమాద బాధితులకు తొలి గంటలో సహాయం చేయడానికి ప్రజలను ప్రోత్సహిస్తున్నాము’’ అని నితిన్‌ గడ్కరీ తెలిపారు. రాపిడో కో–ఫౌండర్‌ అరవింద్‌ సంక మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా 400కుపైగా నగరాల్లో ఉన్న తమ నెట్‌వర్క్, లక్షలాది కెప్టెన్ల ద్వారా రహావీర్‌ పథకంపై విస్తృత అవగాహన కల్పించనున్నట్లు చెప్పారు. డిజిటల్‌ ప్రచారాలు, ఇన్‌–యాప్‌ ఎడ్యుకేషన్, సోషల్‌ మీడియా కార్యక్రమాలు, గ్రౌండ్‌ స్థాయి అవుట్‌రీచ్‌ ద్వారా ప్రజల్లో చైతన్యం పెంచనున్నట్లు వెల్లడించారు.

గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్‌

ఈ భాగస్వామ్య ప్రారంభోత్సవంలో భాగంగా దేశవ్యాప్తంగా నాలుగు లక్షల మందికి పైగా రాపిడో కెప్టెన్లు యాప్‌ ద్వారా ఏకకాలంలో ‘రహావీర్‌’ ప్రతిజ్ఞను స్వీకరించారు. ప్రమాద బాధితులకు సకాలంలో సహాయం అందిస్తామని చాటుతూ వీరంతా ఉమ్మడిగా గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డును నెలకొల్పడం విశేషం. పౌరులు ఎలాంటి సంకోచం లేకుండా బాధితులను ఆదుకునేలా చేయడమే దీని ఉద్దేశమని అరవింద్‌ సంక తెలిపారు.

ఇదీ చదవండి: ఒక్కసారిగా తిరగబడిన బంగారం ధరలు

Advertisement
 
Advertisement
Advertisement