ఆరంకెల జీతమున్నా బైక్‌ రైడర్‌గా.. | Bengaluru engineer earning six figures at MNC drives Rapido on weekends | Sakshi
Sakshi News home page

ఆరంకెల జీతమున్నా బైక్‌ రైడర్‌గా..

Jun 8 2026 4:05 AM | Updated on Jun 8 2026 4:05 AM

Bengaluru engineer earning six figures at MNC drives Rapido on weekends

బెంగళూరు మహానగరంలో ఖర్చుల్ని ఎదుర్కొనేందుకు ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి మరో మార్గం

బెంగళూరు: గ్రామాల్లో వేలల్లో జీతాలొస్తే చాలు ఎంతో హాయిగా అన్ని సౌకర్యాలతో జీవిస్తారు. మరి బెంగళూరు వంటి మహానగరంలో ఆరంకెల జీతమొచ్చినా కొందరు కుటుంబ ఆర్థిక భద్రతపై బాగా ఆలోచిస్తారని ఒకతను నిరూపించారు. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తూ ఆరంకెల జీతమొస్తున్నాసరే వారాంతాల్లో ర్యాపిడో బైక్‌ ట్యాక్సీ రైడర్‌గా పనులు చేస్తుంటానని ఒకతను చెప్పిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. 

ఇటీవల బెంగళూరులోని బన్నేరఘట్ట అనే ప్రాంతంలో షాబాజ్‌ అనే వ్యక్తి మరో చోటుకు వెళ్లేందుకు ర్యాపిడో బైక్‌ బుక్‌చేశాడు. వెళ్తూ మార్గమధ్యంలో రైడర్‌తో మాట్లాడాడు. ఆ సంభాషణ తాలూకు వివరాలను షాబాజ్‌ తన ‘ఎక్స్‌’ ఖాతాలో పంచుకున్నాడు. ‘‘ రైడర్‌ నన్ను మీరేం చేస్తారు అని అడిగాడు. సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ అని గొప్పగా చెప్పా. నువ్వేం చేస్తావని 35 ఏళ్ల ఆ రైడర్‌ను అడిగా. అతను చెప్పిన సమాధానం విని ఆలోచనలో పడ్డా. 

తను కూడా సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌గా ఒక పెద్ద బహుళజాతి సంస్థలో పనిచేస్తున్నాడు. ఆరంకెల జీతం వస్తోంది అతనికి. మరి రైడర్‌గా ఎందుకు చేస్తున్నావని అడిగా. వారాంతాల్లో మాత్రమే ఈ పని చేస్తాడట’’ అని చెప్పుకొచ్చాడు. ‘‘నాకు పెళ్లయింది. మాకొక చిన్నారి. ముగ్గురం ఈ మహానగరంలో వాళ్లను ఎలాంటి ఆర్థిక ఇబ్బందుల్లేకుండా చూసుకోవాలని ఉద్దేశంతోనే అదనపు ఆదాయం కోసం ఈ పార్ట్‌టైం జాబ్‌ చేస్తున్నా’’ అని చెప్పడంతో ఆలోచనలో పడ్డానని షాబాజ్‌ చెప్పాడు.

 ఈ పోస్ట్‌లు స్పందనలు వెల్లువెత్తాయి. భారత్‌లోని బెంగళూరు వంటి నగరాల్లో ఇంటి అద్దెలు, ద్రవ్యోల్బణం, పిల్లల ఫీజులతో వేతనజీవుల వెతలు ఏ స్థాయిలో ఉంటాయో ఈ ఉదంతం తేటతెల్లంచేస్తోందని పలువురు నెటిజన్లు అభిప్రాయపడ్డారు. ఆరంకెల జీతమొచ్చే ఉద్యోగులు భిన్నమైన బైక్‌ రైడ్‌ వృత్తిని ఎంచుకోకుండా సాఫ్ట్‌వేర్‌ రంగంలోనే కొత్త కోర్సులు, మెళకువలు నేర్చుకుని ఆ రంగంలో మరింత పైకి ఎదిగి ఆదాయాన్ని రెట్టింపుచేసుకోవాలని పలువురు అభిప్రాయపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement