
సాక్షి, ఢిల్లీ: కరూర్ తొక్కిసలాట ఘటనపై సుప్రీం కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్‌కు(CBI) అప్పగిస్తూ సోమవారం ఆదేశాలు జారీ చేసింది(Karur Stampede CBI Investigation). నిస్సందేహంగా.. న్యాయసమ్మతమైన, పక్షపాతరహిత విచారణ అనేది పౌరుల హక్కు అని ఈ సందర్భంగా ద్విసభ్య ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ క్రమంలో గతంలో మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను దేశ సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది.
కరూర్ తొక్కిసలాట ఘటనపై స్వతంత్ర దర్యాప్తు కోరుతూ టీవీకే పార్టీ వేసిన పిటిషన్‌ను విచారించిన సుప్రీం కోర్టు.. సీబీఐ విచారణకు ఆదేశించింది. అయితే ఈ విచారణను పర్యవేక్షించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(SIT) ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. సుప్రీం కోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ అజయ్ రస్తోగి నేతృత్వంలో ఇద్దరు ఐపీఎస్‌ల ఈ కమిటీలో ఉంటారని పేర్కొంది. ఈ కమిటీకి సీబీఐ ఎప్పటికప్పుడు దర్యాప్తు నివేదికను అందించాల్సి ఉంటుంది.
సెప్టెంబర్ 27వ తేదీన కరూర్‌లో జరిగిన టీవీకే ర్యాలీలో తొక్కిసలాట జరిగి 41 మంది మృతి చెందారు. ఈ ఘటనపై తమిళనాడు ప్రభుత్వం తొలుత రిటైర్డ్ జడ్జి అరుణా జగదీశన్‌తో దర్యాప్తునకు ఆదేశించింది. ఈ కమిటీ మూడు నెలల్లో నివేదికను సమర్పించనుంది. అయితే ఈ కేసులో కుట్ర కోణం ఉందంటూ టీవీకే మొదటి నుంచి వాదిస్తోంది. ఈ క్రమంలో మద్రాస్ హైకోర్టును ఆశ్రయించగా ఊరట దక్కలేదు. దీంతో సుప్రీం కోర్టును ఆశ్రయించగా.. జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ ఎన్వీ అంజారియాలతో కూడిన ధర్మాసనం సీబీఐ విచారణకు లైన్ క్లియర్ చేసింది. అదే సమయంలో..
మద్రాస్ హైకోర్టును సుప్రీం కోర్టు మందలించింది. తమిళనాడులో రాజకీయ పార్టీల ర్యాలీలు, సభల కోసం ఒక ప్రామాణిక విధానాన్ని (SOP) రూపొందించాలనే అభ్యర్థనతో టీవీకే పిటిషన్ వేస్తే.. మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్(సింగిల్ బెంచ్) ఆ పార్టీ, ఆ పార్టీ అధినేత విజయ్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. దీనిని సుప్రీం కోర్టు ధర్మాసనం తీవ్రంగా తప్పుబట్టింది. అంతేకాదు.. విచారణ జరపకుండానే ఐపీఎస్ అధికారి అస్రా గార్గా నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(SIT) ఏర్పాటు చేయడం కూడా పిటిషన్ పరిధిని మించి వెళ్లడమేనని, పైగా డివిజనల్ బెంచ్‌లో ఉండగా సింగిల్ బెంచ్ అలాంటి ఆదేశాలు ఎలా ఇవ్వగలిగింది? అనే అభ్యంతరాలను సుప్రీం కోర్టు ద్విసభ్య ధర్మాసనం వ్యక్తం చేసింది.

ఇదీ చదవండి: 'మీరేం ఒంటరి కాదు..' విజయ్‌కు బీజేపీ సపోర్ట్!!