
పోలీసులు అతడిని బలిపశువును చేశారని వ్యాఖ్య
న్యూఢిల్లీ: 2017నాటి ఏడేళ్ల బాలికపై అత్యాచారం, హత్య కేసులో మరణశిక్ష ఎదుర్కొంటున్న వ్యక్తిని సుప్రీంకోర్టు విడిచిపెట్టింది. దిగువ కోర్టులో ఈ కేసు విచారణ ఏకపక్షంగా జరిగిందని, పోలీసులు అతడిని బలిపశువు ను చేశారని వ్యాఖ్యానించింది. నిందితుడికి తనను తాను రక్షించుకునే హక్కును రాజ్యాంగం కల్పించిందని, ఇదేమీ భ్రాంతి కాదని తెలిపింది. ఈ హక్కుకు భంగం కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత న్యాయస్థానంతోపాటు ప్ర భుత్వానికి ఉందని పేర్కొంది.
మరణ శిక్ష విధించాల్సిన కేసయినా నిందితుడికి తనను తాను కాపాడుకునే అవకాశం కల్పించాల్సిందేనని స్పష్టం చేసింది. దిగువ కోర్టు తనకు మరణ శిక్ష విధిస్తూ ఇచ్చిన తీర్పును 2018లో మద్రాస్ హైకోర్టు సమర్థించడాన్ని సవాల్ చేస్తూ నిందితుడు దశ్వంత్ వేసిన పిటిషన్‌పై జస్టిస్ విక్రమ్ సేథ్, జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ సందీప్ మెహతాల ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. ‘ఎఫ్‌ఎస్‌ఎల్ నివేదికలతో సహా ముఖ్యమైన పరిస్థితులను నిరూ పించడంలో ప్రాసిక్యూషన్ ఘోరంగా విఫలమైంది. పిటిషనర్‌ను కోర్టు దోషిగా నిర్ధారించింది.
ఆరోపణలకు సంబంధించిన పత్రాలను నిందితుడికి అందించలేదు. మరణ శిక్ష పడే కేసులో ఇటువంటి వాటిని రాజ్యాంగం తప్పనిసరిచేసింది’అని ధర్మాసనం తన 71 పేజీల తీర్పులో పేర్కొంది. 2018 ఫిబ్రవరి 19వ తేదీన పిటిషనర్‌కు దోషిగా నిర్థారించిన కోర్టు, అదే రోజు మరణ శిక్ష విధిస్తూ తీర్పునివ్వడాన్ని కూడా ధర్మాసనం ప్రస్తావించింది. ఈ తీర్పును వెలువరించేందుకు కోర్టు అనవసర ఉత్సాహం చూపినట్లుగా భావిస్తున్నామంది. ఈ కేసులో దిగువ కోర్టు, మద్రాస్ హైకోర్టు వెలువరించిన తీర్పులను పక్కనబెడుతున్నామని తెలిపింది. ఇతరత్రా కేసులు ఏవీ లేనట్లయితే నిందితుడిని కారాగారం నుంచి విడుదల చేయాలని అధికారు లను ఆదేశించింది.