
తేదీల ఖరారు తుదిదశలో ఉందని ధోవల్ వెల్లడి
న్యూఢిల్లీ: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ త్వరలో భారత్‌లో పర్యటించనున్నారు. పర్యటన తేదీలను ఖరారు చేసేందుకు జరుగుతున్న చర్చలు తుది దశలో ఉన్నాయని జాతీయ భద్రతా సలహాదారు(ఎన్‌ఎస్‌ఏ) అజిత్ ధోవల్ గురువారం తెలిపారు. పుతిన్ ఆగస్ట్ ఆఖర్లో పర్యటించే అవకాశముందంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని ఆయన వెల్లడించారు. పర్యటన తేదీలు, సమయంపై మరింత స్పష్టత రావాల్సి ఉందన్నారు.
పర్యటన ఈ ఏడాది చివర్లో ఉంటుందని స్పష్టం చేశారు. అమెరికాతో వాణిజ్య సంబంధాల్లో ఉద్రిక్తతలు నెలకొన్న వేళ పుతిన్ పర్యటన అంశం తెరపైకి రావడం గమనార్హం. పుతిన్ పర్యటన భారత్ ప్రపంచ దేశాలతో నెరుపుతున్న రాజకీయ వ్యూహంలో కీలక పరిణామం కానుంది. సరిగ్గా, ట్రంప్ బెదిరింపుల వేళ పుతిన్ పర్యటన వార్త భారత్–రష్యాల మైత్రీ బంధం ఎంత బలమైందో చెప్పకనే చెబుతోంది.
రష్యా నుంచి చమురును పెద్ద మొత్తంలో కొనుగోలు చేయడం ద్వారా ఉక్రెయిన్‌పై యుద్ధానికి భారత్ ఆజ్యం పోస్తోందంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్రంగా నిందించడం, టారిఫ్ పెంచుతూ బుధవారం హెచ్చరికలు చేయడం తెల్సిందే. ఈ నేపథ్యంలోనే ఎన్‌ఎస్‌ఏ ధోవల్ మాస్కో వెళ్లడం గమనార్హం. క్రెమ్లిన్‌లో గురువారం ఆయన అధ్యక్షుడు పుతిన్‌తో సమావేశమయ్యారు. అనంతరం మాస్కోలో ధోవల్ స్పుతి్నక్ న్యూస్‌తో మాట్లాడారు.
భారత్–రష్యా బంధం ఎంతో ప్రత్యేకమైందని పేర్కొన్నారు. ‘భారత్–రష్యాలది చాలా ప్రత్యేకమైన, సుదీర్ఘ సంబంధం. రెండు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మేం ఎంతో విలువైందిగా భావిస్తున్నాం. మా మధ్య కొనసాగుతున్న ఉన్నత స్థాయి సంబంధాలు, బంధాన్ని బలీయంగా మార్చడంలో ఎంతో సాయపడ్డాయి’అని ధోవల్ పేర్కొన్నారు. ‘రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్‌లో చేపట్టే పర్యటనపై మేం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం.
పర్యటన తేదీలు దాదాపుగా ఖరారయ్యాయి. ఇరు దేశాల నేతల మధ్య జరిగే శిఖరాగ్రం ఎంతో కీలకం కానుంది’ అని ధోవల్ వివరించారు. ‘ఈ శిఖరాగ్రం ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి కొత్త దిశానిర్దేశం చేయనుంది. వీరి మధ్య జరిగే చర్చలు స్పష్టమైన, గణనీయమైన ఫలితాలను అందివ్వనున్నాయి’ అని దోవల్ ఆశాభావం వ్యక్తం చేసినట్లు టాస్ వార్తా సంస్థ పేర్కొంది. ఇలా ఉండగా, ముడి చమురు దిగుమతులపై పశి్చమ దేశాలు విధించిన ఆంక్షల ప్రభావంపైనా ధోవల్ రష్యా ఉన్నతాధికారులతో చర్చించారు. ఒప్పందం ప్రకారం మిగతా రెండు ఎస్–400 క్షిపణి రక్షణ వ్యవస్థలను సాధ్యమైనంత త్వరగా అందజేయాలని కోరారు.