
నాగ్‌పూర్: పహల్గామ్‌లో ఉగ్రదాడికి పాల్పడ్డ ముష్కరులు భారతీయులను మతం(ధర్మం) ఏమిటని అడిగి కాల్చిచంపారని, ఈ దాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారని, అనంతరం దేశవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగాయని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన దరిమిలా ప్రభుత్వం, సైన్యం తీవ్రంగా ప్రతిస్పందించి ఉగ్రవాదులకు తగిన బుద్ధి చెప్పిందన్నారు.
ఆర్‌ఎస్‌ఎస్ శతాబ్ది విజయదశమి వేడుకల్లో ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ మాట్లాడుతూ నేడు, మన దేశంలో వైవిధ్యం విభజనలకు కారణమవుతోందని, అయినా మనమంతా ఒక్కటేనని, వైవిధ్యం అనేది ఆహారం, జీవన పరిస్థితులకే పరిమితమన్నారు. చట్టాన్ని మన చేతుల్లోకి తీసుకోవడం సరైనది కాదని, ఇలాంటి అరాచకత్వాన్ని ఆపాలన్నారు. విజయదశమి సందర్భంగా ఆయన హిందూ ఐక్యత గురించి మాట్లాడారు. వ్యవస్థీకృత హిందూ సమాజం భద్రతకు హామీనిస్తుందన్నారు. గత 100 ఏళ్లుగా హిందువులను ఏకం చేయడానికి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కృషి చేస్తోందని అన్నారు.
మహాకుంభ్‌తో ఐక్యతా తరంగాలు
మహారాష్ట్రలోని నాగపూర్‌లో జరిగిన ఆర్‌ఎస్‌ఎస్ శతాబ్ది విజయదశమి వేడుకలను ఉద్దేశించి మోహన్ భగవత్ ప్రసంగించారు. పహల్గామ్ దాడి, నక్సలైట్ల అంశాలను ఆయన ప్రస్తావించారు. పహల్గామ్ దాడి దరిమిలా సైన్యం పూర్తి సన్నద్ధతతో ప్రతిస్పందించిందని ఆయన అన్నారు. ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన భారీ మహాకుంభ్ గురించి ప్రస్తావిస్తూ.. ఇది భారతదేశం అంతటా ఐక్యతా తరంగాలను విడుదల చేసిందన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ శతాబ్ది ఉత్సవాలకు మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఆర్‌ఎస్‌ఎస్‌లో కుల వివక్ష లేదు: రామ్ నాథ్ కోవింద్
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘1991 సార్వత్రిక ఎన్నికల సమయంలో ఆర్ఎస్ఎస్, దాని స్వచ్ఛంద సేవకులను కలిసే అవకాశం లభించిందని, ఆర్ఎస్ఎస్ లో ఏ విధమైన కుల వివక్ష లేదన్నారు. 2001లో ఎర్రకోట సమీపంలో జరిగిన దళిత సంగం ర్యాలీలో కొంతమంది వాజపేయిని దళిత వ్యతిరేకిగా దుయ్యబట్టారని, అయితే అప్పుడు తాము అంబేద్కరిస్టులమని ఆయన సమాధానం చెప్పారన్నారు. తాను రాష్ట్రపతి పదవిని నిర్వర్తించేటప్పుడు, రాజ్యాంగ విలువలకు, బాబా సాహెబ్ ఆశయాలకు ప్రాధాన్యత ఇచ్చానన్నారు. ఈ ఏడాది ఆర్‌ఎస్‌ఎస్ తన 100వ వ్యవస్థాపక వార్షికోత్సవాన్ని జరుపుకుంటోంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలో ప్రత్యేక తపాలా బిళ్ల, స్మారక నాణేన్ని విడుదల చేశారు.
1925లో విజయదశమి వేళ..
నాగపూర్ చేరుకున్న మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ 1956లో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ బౌద్ధమతాన్ని స్వీకరించిన దీక్షా భూమిని సందర్శించారు. కేశవ్ బలిరామ్ హెడ్గేవార్ 1925లో విజయదశమి నాడు 17 మంది సమక్షంలో ఆర్‌ఎస్‌ఎస్‌ను స్థాపించారు. 1926, ఏప్రిల్ 17న జరిగిన సమావేశంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అనే పేరును నిర్ణయించారు. ప్రస్తుతం జరుగుతున్న ఆర్‌ఎస్‌ఎస్ శతాబ్ది ఉత్సవాల్లో 21 వేల స్వచ్ఛంద సేవకులు పాల్గొంటున్నారు.
విదేశీ అతిథులు హాజరు
విజయదశమి నాడు ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఆయుధ పూజ నిర్వహించారు. కాగా ఘనా, ఇండోనేషియాకు చెందిన అతిథులు కూడా ఆర్‌ఎస్‌ఎస్ విజయదశమి వేడుకలలో పాల్గొంటున్నారు. దక్షిణ భారత కంపెనీ డెక్కన్ గ్రూప్‌కు చెందిన లెఫ్టినెంట్ జనరల్ రాణా ప్రతాప్ కాలిత్, కేవీ కార్తీక్,బజాజ్ గ్రూప్‌కు చెందిన సంజీవ్ బజాజ్ హాజరయ్యారు. ఘనా, దక్షిణాఫ్రికా, ఇండోనేషియా, థాయిలాండ్,యూకే, యుఎస్ఎలకు చెందిన ప్రతినిధులను ఆర్ఎస్ఎస్ ఈ వేడుకలకు ఆహ్వానించింది.