
భారతదేశం జనవరి 26న (శుక్రవారం) 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకుంటోంది. ఈ నేపధ్యంలో గణతంత్ర దినోత్సవ చరిత్ర, పరేడ్, థీమ్ తదితర విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
భారత రాజ్యాంగ ప్రధాన రూపశిల్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇలా అన్నారు ‘రాజ్యాంగం కేవలం న్యాయవాదులు సమర్పించిన పత్రం కాదు. ఇది దేశ ప్రజల జీవితాలను నడిపే వాహనం. దీని స్ఫూర్తి ఎల్లప్పటికీ నిలచి ఉంటుంది’ అని అన్నారు. 1950లో భారత రాజ్యాంగానికి ఆమోదం లభించింది. నేడు మనం భారతదేశ 75వ గణతంత్ర దినోత్సవాన్ని చేసుకునేందుకు సిద్ధమవుతున్నాం.
గణతంత్ర దినోత్సవాలలో భారతదేశ గొప్పదనాన్ని, సాంస్కృతిక వారసత్వం, దేశ పురోగతి, విజయాలను గుర్తుచేసుకోనున్నాం. ఢిల్లీలో జరిగే పరేడ్‌లో భారత సైనిక, నౌకాదళ, వైమానిక దళాల సత్తాను చాటే ప్రదర్శనలను మనం చూడబోతున్నాం. రిపబ్లిక్ డే పరేడ్ రిహార్సల్స్, బీటింగ్ ది రిట్రీట్ వేడుకలు ఇప్పటికే అన్ని రాష్ట్రాల రాజధాని నగరాల్లో జరిగాయి.
భారతదేశ రాజ్యాంగానికి 1950, జనవరి 26న ఆమోదం లభించింది. దీనికి గుర్తుగా ప్రతియేటా జనవరి 26న గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటాం. భారతదేశానికి 1947లో బ్రిటిష్‌వారి నుండి స్వాతంత్ర్యం లభించినప్పటికీ, 1950 జనవరి 26 నుంచి భారత రాజ్యాంగం అమలులోకి వచ్చింది. దీంతో భారత్ ఒక సార్వభౌమ అధికారం కలిగిన గణతంత్ర దేశంగా గుర్తింపు పొందింది.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాజ్యాంగ ముసాయిదా కమిటీకి నాయకత్వం వహించారు. ప్రతీయేటా జరిగే గణతంత్ర దినోత్సవం.. ప్రజాస్వామ్యబద్ధంగా తమ ప్రభుత్వాన్ని ఎన్నుకునే భారతీయ పౌరుల శక్తిని గుర్తుచేస్తుంది. ప్రతీ సంవత్సరం దేశంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత ఉత్సాహంగా జరుగుతుంటాయి. ఆ రోజు రాష్ట్రపతి జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. అనంతరం సైనిక, సాంస్కృతిక ప్రదర్శనలు జరుగుతాయి.
గణతంత్ర దినోత్సవం నాడు భారత రాష్ట్రపతి దేశంలోని అర్హులైన పౌరులకు పద్మ అవార్డులను అందిస్తారు. వీర సైనికులకు పరమవీర చక్ర, అశోక్ చక్ర ప్రదానం చేస్తారు. రిపబ్లిక్ డే పరేడ్ ప్రత్యక్ష ప్రసారాలు దేశ ప్రజలకు అందుబాటులో ఉంటాయి.
ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ ధీమ్ ‘వీక్షిత్ భారత్’,‘భారత్ - లోక్‌తంత్ర కి మాతృక’. ఇది ప్రజాస్వామ్యాన్ని పెంపొందించే దేశంగా భారతదేశ పాత్రను నొక్కి చెబుతుంది. జనవరి 26.. శుక్రవారం ఉదయం 10:30 గంటలకు న్యూఢిల్లీలోని కర్తవ్య పథ్‌లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ప్రారంభంకానున్నాయి. ఇవి 90 నిమిషాల పాటు జరుగుతాయి. ఈ ఏడాది వేడుకలకు ముఖ్య అతిథిగా ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ హాజరుకానున్నారు.