ఏడాదిలోనే కంపెనీని వదిలేస్తున్నారు
వేతనమే జెన్ –జీ తరం తొలి ప్రాధాన్యత
తర్వాతే.. పని సౌలభ్యం, వర్క్–లైఫ్ బ్యాలెన్స్
అసలే కుర్రకారు. వారి ఆలోచనలూ ఉడుకు రక్తంలా పరుగెడుతుంటాయి. ఉద్యోగం విషయంలోనూ అంతే. ఏళ్లకేళ్లు ఒకే కంపెనీలో ఉద్యోగం చేస్తూ కూర్చోవడానికి తాము ఒకప్పటి తరం కాదని తేల్చిచెబుతోంది జనరేషన్ –జీ. మంచి వేతనం దొరికితే ఏడాదిలోపే జంప్ చేస్తామని నిర్మొహమాటంగా కుండబద్దలు కొడుతున్నారీ తరం. విశ్వసనీయత, ఉద్యోగ స్థిరత్వం, కెరీర్ వృద్ధి.. ఇదంతా గతం. జీతం, పని సౌలభ్యం, వర్క్–లైఫ్ బ్యాలెన్స్ఈ అంశాలే జెన్ –జీ తరానికి ఇప్పుడు కీలకంగా మారాయని రాండ్‌స్టాడ్ ఇండియా తాజా నివేదిక చెబుతోంది.
పనికి తగ్గ వేతనం జెన్ –జీ నిపుణులకు ఒక ప్రాథమిక డిమాండ్‌గా ఉన్నప్పటికీ.. ఎప్పుడు, ఎక్కడ, ఎలా పని చేయాలన్న అంశాలకూ విలువ ఇస్తున్నారని ‘ద జెన్ –జీ వర్క్‌ప్లేస్ బ్లూప్రింట్’ పేరుతో రూపొందిన ఈ నివేదిక తెలిపింది. 1997–2007 మధ్య జన్మించిన జెన్ –జీ బ్యాచ్‌లో 35 కోట్ల మందికిపైగా ఉన్నారు. భారత జనాభాలో వీరి వాటా దాదాపు 27%.
వృద్ధిని కోరుకుంటున్నారు
అదనపు సెలవు, పదవీ విరమణ ప్రయోజనాలు వంటి సంప్రదాయ ప్రోత్సాహకాలు జెన్ జీని పెద్దగా ఆకర్షించడం లేదు. వీటికి బదులుగా అర్థవంతమైన పని, అభ్యాస అవకాశాలను ఈ తరం కోరుకుంటోంది. చాలామంది ప్రయాణ అవకాశాలు, రిమోట్ గా పని చేసే సౌకర్యాలు ఉన్న కంపెనీల్లో కొనసాగేందుకు మొగ్గు చూపుతున్నారు.
తరచూ కంపెనీలు మారడం తప్పుకాదనీ, సుదీ ర్ఘ ప్రయాణంలో భాగంగా వారు వ్యక్తిగత, వృత్తిపరమైన వృద్ధిని మాత్రమే కోరుకుంటున్నారని నివేదిక స్పష్టం చేసింది. ఎదగడానికి అవకాశాల కోసం చూస్తున్నందున తరచూ ఉద్యోగం మారుతున్నారని తెలిపింది.
మారాల్సింది కంపెనీలే!
కంపెనీలు ఈ మార్పులకు అనుగుణంగా మారాలని నివేదిక సూచించింది. ఉద్యోగుల పనితీరు మెరుగుపరిచే అవకాశాలు కల్పించడం, మార్గదర్శకత్వం, వారితో మమేకం కావడం, సౌకర్యవంతమైన పని వాతావరణం వంటివి అమలు చేసే కంపెనీలు జెన్–జీ ప్రతిభను ఆకర్షించడమే కాకుండా.. దీర్ఘకాలం పాటు వీరిని తమ సంస్థల్లో ఉద్యోగులుగా నిలుపుకోగలుగుతాయని వివరించింది.
అవకాశాలు బోలెడున్నాయని వారు దృఢ నిశ్చయంతో ఉన్నారని నివేదిక తెలిపింది. ఈ తరుణంలో ఉద్యోగావకాశాలు, అభివృద్ధి మార్గాలను ఈ జనరేషన్ కోసం ఎలా రూపొందించాలో కంపెనీలు పునరాలోచించుకోవాలని సూచించింది.
బేరీజు వేసుకుని మరీ..
మెరుగైన అవకాశాలపై దృష్టి సారించినప్పటికీ తమ ఉద్యోగం / పాత్రలో తాము సమర్థులుగా భావిస్తున్నామని 81% మంది చెబుతున్నారు. 93% మిలీనియల్స్, 89% జెన్ –ఎక్స్‌తో పోలిస్తే 82% జెన్ –జీ తరం మాత్రమే తమ కంపెనీలో తమకు విలువ ఉందని భావిస్తున్నారు.
94% కంటే ఎక్కువ మంది కొత్త కంపెనీని ఎంచుకునే ముందు తమ దీర్ఘకాలిక ఆకాంక్షలకు తగ్గట్టుగా నూతన ఉద్యోగం ఉందా లేదా అని బేరీజు వేసుకుంటున్నారట. ప్రపంచవ్యాప్తంగా జెన్ –జీ తరంలో ఇలా ఆలోచించేవారి శాతం సగటు 79%.


