Rajnath Singh: త్రిముఖ వ్యూహం.. శత్రు దుర్భేద్యం

Rajnath SIngh Speech National Security DSSC in Wellington Tamil Nadu - Sakshi

ప్రత్యేక దళం ఏర్పాటు అవశ్యం 

రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ 

‘‘రోజురోజుకూ మారుతున్న అంతర్జాతీయ పరిమాణాల నేపథ్యంలో దేశ భద్రతకు మరిన్ని చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. ఇందులో భాగంగా ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌ విభాగాలను సమన్వయం చేస్తూ త్రివిధ దళాల్లోని నిష్ణాతులైన సిబ్బందితో ప్రత్యేక దళాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నాం. తద్వారా దేశ సరిహద్దులను మరింత శత్రుదుర్భేద్యంగా మార్చుతాం..’’ అని రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ స్పష్టం చేశారు. 

సాక్షి, చెన్నై: ఆర్మీలో యువతకు మరింతగా పెద్దపీట వేసే విధంగా చర్యలు చేపట్టామని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ తెలిపారు. ఇందుకోసం త్రివిధ దళాల్ని సమన్వయం చేస్తూ.. ప్రత్యేక దళాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం రాజ్‌నాథ్‌ శనివారం రాష్ట్రానికి వచ్చిన విషయం తెలిసిందే. తొలిరోజు చెన్నై హార్బర్‌లో జరిగిన కార్యక్రమంలో కోస్టుగార్డు నౌక ‘విగ్రహ’ను జాతికి అంకితం చేశారు. రెండోరోజు ఆదివారం నీలగిరి జిల్లా కున్నూరులోని వెల్లింగ్టన్‌ డిఫెన్స్‌ సర్వీసెస్‌ స్టాఫ్‌ కళాశాలలో రాజ్‌నాథ్‌ పర్యటన సాగింది.

అక్కడి ఆర్మీ శిక్షణ కళాశాలలో జరిగిన కార్యక్రమంలో రక్షణ మంత్రి ప్రసంగిస్తూ, దేశసేవలో యువతకు పెద్దపీట వేయడానికి చర్యలు చేపట్టామన్నారు. స్వల్ప కాల వ్యవధిలో ఆర్మీలో యువత పనిచేసే విధంగా నిబంధనల్లో మార్పుల దిశగా పరిశీలన సాగుతున్నట్లు వివరించారు. తద్వారా ఆర్మీ విధుల్లోని సైనికుల సరాసరి వయస్సు తగ్గుతుందన్నారు. త్రివర్ణ దళాల్ని సమన్వయం చేస్తూ, సమష్టిగా ఓ దళం ఏర్పాటు అవశ్యం అని పేర్కొన్నారు. యుద్ధ సమయాల్లో తక్షణం నిర్ణయాలు తీసుకునేందుకు, వ్యూహాలను రచించేందుకు, వాటిని అమలుకు ఈ దళం దోహదం చేస్తుందన్నారు.

అప్ఘనిస్తాన్‌లో అధికార మార్పు దృష్ట్యా కొత్త సవాళ్లను ఎదుర్కొనే పరిస్థితులు ఉంటాయని, అందువల్ల భారత వ్యూహాల్లో అవసరమైన మార్పులు చేయాల్సిన అవసరం ఉందన్నారు. భారత్‌లోకి చొరబడే తీవ్రవాదులను, చొరబడ్డ వారిని గుర్తించి అణచి వేయడానికి తగిన చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. అవసరం అయితే, వారి భూ భాగంలోకి వెళ్లి మరీ తీవ్రవాదుల్ని మట్టు బెట్టేందుకు భారత్‌ సిద్ధంగా ఉందని పరోక్షంగా పాకిస్తాన్‌కు హెచ్చరికలు చేశారు. 

శివగంగైకు మోదీ కితాబు 
ఆదివారం మన్‌ కీ బాత్‌ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ శివగంగై జిల్లా కాంజిరంగాల్‌ గ్రామ ప్రజల్ని ప్రశంసలతో ముంచెత్తారు. తమ అవసరాలను తామే పూర్తి చేసుకునే విధంగా ఇక్కడి ప్రజలు ఏకమై చెత్త నుంచి విద్యుత్‌ ఉత్పత్తిలో నిమగ్నం కావడం అభినందనీయమని కొనియాడారు. దేశానికే ఈ గ్రామ ప్రజలు ఆదర్శం అని కితాబు ఇచ్చారు.

చదవండి: ఎం.కే స్టాలిన్‌పై ఎమ్మెల్యే పొగడ్తల వర్షం... వార్నింగ్‌ ఇచ్చిన సీఎం  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top