
ముంబై: శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేను సోదరుడు, మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎమ్‌ఎన్‌ఎస్) చీఫ్ రాజ్ ఠాక్రే కలవడం మహారాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. పుట్టినరోజు సందర్భంగా ఉద్ధవ్ నివాసం మాతోశ్రీకి వచ్చిన రాజ్‌కు.. ఉద్ధవ్, సంజయ్ రౌత్ స్వాగతం పలికారు. ఉద్ధవ్‌కు భారీ పుష్పగుచ్ఛం అందించిన రాజ్ ఠాక్రే.. పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆ తరువాత.. పెదనాన్న బాల్ ఠాక్రే చిత్ర పటం ముందు ఉద్ధవ్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్న చిత్రాన్ని ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
‘మా అన్న శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే పుట్టిన రోజు సందర్భంగా తన నివాసం మాతోశ్రీకి వెళ్లాను. శుభాకాంక్షలు తెలిపాను’ అని సందేశాన్ని జోడించారు. అయితే.. చాలా సంవత్సరాల తరువాత రాజ్ మాతోశ్రీకి రావడం, శుభాకాంక్షలు తెలపడంతో తన ఆనందం రెట్టింపయ్యిందని ఉద్ధవ్ తెలిపారు. 2005లో శివసేనను విడిచిన రాజ్ ఠాక్రే.. ఆ తరువాత ఉద్ధవ్ నివాసం మాతోశ్రీకి అరుదుగా వెళ్లారు. 2012జూలైలో ఉద్ధవ్‌కు యాంజియోగ్రఫీ అనంతరం.. ముంబైలోని లీలావతి ఆసుపత్రి నుంచి ఇంటికి తీసుకెళ్లారు. ఆ తరువాత.. 2019 జనవరిలో తన కుమారుడు అమిత్ వివాహ ఆహ్వానాన్ని ఇవ్వడానికి మాత్రమే వెళ్లారు.
ఆ తరువాత బంధువుల వేడుకల్లో అప్పుడప్పుడూ కలిసినా.. త్వరలో ముంబై మున్సిపల్ ఎన్నికలుండటంతో ఆదివారం జరిగిన భేటీ రాజకీయ చర్చకు దారి తీసింది. అయితే.. వారిద్దరూ కలవడం సంతోషకరమైన విషయమని, పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలపడాన్ని రాజకీయ కోణం నుంచి ఎందుకు చూడాలని ముఖ్యమంత్రి ఫడ్నవీస్ అన్నారు. రాష్ట్రంలో భాషా వివాదం తరువాత సోదరులిద్దరూ రాజకీయంగా ఒక్కటవుతున్నారనే ప్రచారం జరుగుతోంది. దానికి ఊతమిస్తూ.. జూలై 5న ముంబైలో రాజ్‌తో కలిసి జరిగిన ర్యాలీలో ఉద్ధవ్ ఠాక్రే మాట్లాడుతూ.. ‘కలిసి ఉండటానికి కలిసి వచ్చాం’ అని ప్రకటించడం గమనార్హం.