breaking news
Shiv Sena chief Uddhav Thackeray
-
ఉద్ధవ్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపేందుకు మాతోశ్రీకి వెళ్లిన రాజ్‌ఠాక్రే
ముంబై: శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేను సోదరుడు, మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎమ్ఎన్ఎస్) చీఫ్ రాజ్ ఠాక్రే కలవడం మహారాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. పుట్టినరోజు సందర్భంగా ఉద్ధవ్ నివాసం మాతోశ్రీకి వచ్చిన రాజ్‌కు.. ఉద్ధవ్, సంజయ్ రౌత్ స్వాగతం పలికారు. ఉద్ధవ్‌కు భారీ పుష్పగుచ్ఛం అందించిన రాజ్ ఠాక్రే.. పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆ తరువాత.. పెదనాన్న బాల్ ఠాక్రే చిత్ర పటం ముందు ఉద్ధవ్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్న చిత్రాన్ని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ‘మా అన్న శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే పుట్టిన రోజు సందర్భంగా తన నివాసం మాతోశ్రీకి వెళ్లాను. శుభాకాంక్షలు తెలిపాను’ అని సందేశాన్ని జోడించారు. అయితే.. చాలా సంవత్సరాల తరువాత రాజ్ మాతోశ్రీకి రావడం, శుభాకాంక్షలు తెలపడంతో తన ఆనందం రెట్టింపయ్యిందని ఉద్ధవ్ తెలిపారు. 2005లో శివసేనను విడిచిన రాజ్ ఠాక్రే.. ఆ తరువాత ఉద్ధవ్ నివాసం మాతోశ్రీకి అరుదుగా వెళ్లారు. 2012జూలైలో ఉద్ధవ్‌కు యాంజియోగ్రఫీ అనంతరం.. ముంబైలోని లీలావతి ఆసుపత్రి నుంచి ఇంటికి తీసుకెళ్లారు. ఆ తరువాత.. 2019 జనవరిలో తన కుమారుడు అమిత్ వివాహ ఆహ్వానాన్ని ఇవ్వడానికి మాత్రమే వెళ్లారు. ఆ తరువాత బంధువుల వేడుకల్లో అప్పుడప్పుడూ కలిసినా.. త్వరలో ముంబై మున్సిపల్ ఎన్నికలుండటంతో ఆదివారం జరిగిన భేటీ రాజకీయ చర్చకు దారి తీసింది. అయితే.. వారిద్దరూ కలవడం సంతోషకరమైన విషయమని, పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలపడాన్ని రాజకీయ కోణం నుంచి ఎందుకు చూడాలని ముఖ్యమంత్రి ఫడ్నవీస్ అన్నారు. రాష్ట్రంలో భాషా వివాదం తరువాత సోదరులిద్దరూ రాజకీయంగా ఒక్కటవుతున్నారనే ప్రచారం జరుగుతోంది. దానికి ఊతమిస్తూ.. జూలై 5న ముంబైలో రాజ్‌తో కలిసి జరిగిన ర్యాలీలో ఉద్ధవ్ ఠాక్రే మాట్లాడుతూ.. ‘కలిసి ఉండటానికి కలిసి వచ్చాం’ అని ప్రకటించడం గమనార్హం. -
వ్యాధి కంటే వైద్యమే భయంకరం!
ముంబై: నల్లధనాన్ని వెలికి తీసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న పెద్దనోట్ల రద్దు నిర్ణయంపై శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే తనదైన శైలిలో స్పందించారు. వ్యాధి కంటే వైద్యమే భయంకరంగా ఉందంటూ ఉద్ధవ్ ఠాక్రే సామ్నా సంపాదకీయంలో వ్యాఖ్యానించారు. మోదీ తీసుకున్న నిర్ణయం యావత్ దేశ ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తంగా మార్చిందని దుయ్యబట్టారు. నల్ల ధనాన్ని అంతమొందించేందుకు మోదీ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం, కానీ ఆయన ఎంచుకున్న మార్గం చాలా భయానకంగా ఉందన్నారు. దేశంలో ఉన్న జనాభా అంతటిని అవినీతి పరులు, నల్లధనం గల వారని ప్రభుత్వ భావిస్తుందా? అని ప్రశ్నించారు. నల్ల ధనం అనేది కేవలం 125 వ్యాపార, రాజకీయ కుటుంబాల వద్దనే ఉందని ఆరోపించారు. కాగా మీరు తీసుకున్న నిర్ణయంతో ఎంతమంది రూ.500, 1000 నోట్ల బండళ్లు చేతపట్టుకుని క్యూలో నిలబడ్డారని ఉద్ధవ్ మోదీని ప్రశ్నించారు. కొద్ది మంది పారిశ్రామిక వేత్తల వద్ద ఉన్న నల్ల ధనాన్ని వెలికి తీసేందుకు యావత్ దేశ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ ఆరోపించారు. మోదీ తీసుకున్న కఠోర నిర్ణయం వల్ల కోట్లాది పేద ప్రజలు రోడ్డున పడ్డారని, భోజనం లేక బ్యాంకు క్యూలలో విలవిల కొట్టుకుంటూ ప్రాణాలు వదులుతున్నారన్నారు. నల్లధనం దేశానికి క్యాన్సర్ లాంటిదే, కాని దాన్ని వెలికి తీసే పద్ధతి మాత్రం ఇది కాదన్నారు. గతవారం రోజులుగా నరకం అనుభవిస్తున్న దేశ జనాభా మీ నిర్ణయాన్ని స్వాగతిస్తారా అంటూ ప్రశ్నలు సంధించారు.