
వందకుపైగా రైళ్ల రాకపోకలపై తీవ్ర ప్రభావం
రాంచీ: జార్ఖండ్‌లో శనివారం కుర్మీలు ఇచ్చిన రైల్ రోకో పిలుపు ప్రభావం 100కు పైగా రైళ్ల రాకపోకలపై పడింది. ఆగ్నేయ రైల్వే రాంచీ డివిజన్, తూర్పు సెంట్రల్ రైల్వే ధన్‌బాద్‌ల పరిధిలోని వేర్వేరు స్టేషన్ల పరిధిలో కుర్మీల ఆందోళన కొనసాగుతోంది. నిషేధం ఉత్తర్వులను సైతం ఉల్లంఘిస్తూ ఆందోళనకారులు పట్టాలపై బైటాయించారు. తమ కుర్మలీ భాషను రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్‌లో చేర్చాలని, కుర్మీలకు షెడ్యూల్ తెగల హోదా ఇవ్వాలని వీరు డిమాండ్ చేస్తున్నారు.
రాత్రి వేళ కూడా ఆందోళన కొనసాగుతుందని, డిమాండ్లు నెరవేర్చేదాకా విరమించేది లేదని ఆదివాసీ కుర్మీ సమాజ్ నేత ఓపీ మహతో స్పష్టం చేశారు. కు ర్మీలను 1931లో ఎస్టీల జాబితా నుంచి తొలగించారని, అప్పటి నుంచి పోరాడుతున్నా డిమాండ్ నెరవేరలేదని సంఘం మరో నేత షీతల్ ఓహదార్ చెప్పారు. తాము శాంతియుతంగా నిరసన తెలుపుతున్నామంటూ సమర్థించుకున్నారు. వీరికి పలు రాజకీయ పా ర్టీలు సైతం మద్దతు ప్రకటించాయి.
ఆందోళనల కారణంగా తూర్పు సెంట్రల్ రైల్వే ధన్‌బాద్ డివిజన్ పరిధిలో 25 ప్రయాణికుల రైళ్లను రద్దు చేశామని, మరో 24 రైళ్లను దారి మళ్లించామని అధికారులు తెలిపారు. ఆగ్నేయ రైల్వే రాంచీ డివిజన్ పరిధిలో వందేభారత్, రాజధాని ఎక్స్‌ప్రెస్ సహా 12 రైళ్లను రద్దు చేసి, 11 రైళ్లను దారి మళ్లించామన్నారు. మరికొన్ని రైళ్ల గమ్యస్థానాలను కుదించామన్నారు.
ఆందోళనల కారణంగా రైళ్లు నిలిచిపోవడంతో వేలాదిగా ప్రయాణికులు ఎక్కడివారక్కడే చిక్కుబడిపోయారు. టాటా–పట్నా వందేభారత్ రైలులోని వందలాది మంది ప్రయాణికులు రాంచీలోని మురి స్టేషన్‌లో ఉండిపోయారు. ఈ రైలును అధికారులు రద్దు చేసిన విషయం తెలిసి ప్రయాణికులు గగ్గోలు మొదలుపెట్టారు. కాగా, కుర్మీల నిరసన చట్ట విరుద్ధం, అప్రజాస్వామికమంటూ వివిధ గిరిజన సంఘాలు రాంచీలోని రాజ్‌భవన్ ఎదుట నిరసన తెలిపాయి. అసలైన గిరిజనుల హక్కులను లాక్కునేందుకు కుర్మీలు ప్రయతి్నస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశాయి.