
ముంబై: కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ న్యాయస్థానాన్ని ఉద్దేశపూర్వకంగా పక్కదారి పట్టించారని ఆరోపిస్తూ స్వాతంత్య్రయోధుడు వీర్ సావర్కర్ మునిమనవడు సాత్యకి సావర్కర్ కేసు వేశారు. వీర్ సావర్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లుగా ఉన్న వీడియో తనకు అందలేదంటూ జూలై 29వ తేదీన రాహుల్ గాంధీ సమర్పించిన అఫిడవిట్ అబద్ధమని సాత్యకి పేర్కొన్నారు.
రాహుల్ ప్రసంగం ఉన్న సీడీ సహా పిటిషనర్ అందజేసిన అన్ని పత్రాలు తమకు అందాయంటూ ఆయన లాయర్ కోర్టు ఎదుట అంగీకరించారని సావర్కర్ లాయర్ సంగ్రామ్ కొల్హాట్కర్ పేర్కొన్నారు. వీడియోతో కూడిన పెన్‌డ్రైవ్ తమకు అందిందని, అయితే అది పనిచేయడం లేదని అంతకుముందు మే 28న రాహుల్ తెలిపారన్నారు.
తాము అందజేసిన మరో పెన్‌డ్రైవ్ సరిగ్గానే పనిచేస్తోందని, కోర్టులో గాంధీ లాయర్ సమక్షంలో అందులోని వీడియోను ప్రదర్శించామని కొల్హాట్కర్ వివరించారు. ఆ వీడియో ఇప్పుడు కోర్టు కస్టడీలోనే ఉందన్నారు. ఇవన్నీ చూస్తుంటే రాహుల్ గాంధీ తప్పుడు పత్రాలు చూపుతూ వివాదాస్పద వ్యాఖ్యల వివాదం నుంచి తప్పించుకోజూస్తున్నట్లు కనిపిస్తోందని కొల్హాట్కర్ తెలిపారు.