
న్యూఢిల్లీ: ప్రతిపక్ష నాయకుడినైన తనను లోక్‌సభలో మాట్లాడనివ్వకుండా చేస్తూ బీజేపీ ప్రతిపక్షం గొంతును నొక్కేస్తోందని కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ ఆరోపించారు. ప్రతిపక్ష నేతగా తనకు ప్రశ్నలు అడిగే హక్కు ఉందని ఆయన ఉద్ఘాటించారు. ప్రతిపక్షాలను అడ్డుకుంటూ, రక్షణ మంత్రి, ఇతర ట్రెజరీ బెంచ్ సభ్యులను మాత్రమే మాట్లాడటానికి అనుమతిస్తూ బీజేపీ కొత్త విధానం అనుసరిస్తోందని గాంధీ ఆరోపించారు.
ప్రతిపక్షాలను కూడా అనుమతిస్తేనే అర్థమవంతమైన చర్చ జరుగుతుందని, మంత్రులు మాట్లాడినప్పుడు ప్రతిపక్షం వింటున్నప్పుడు, ప్రతిపక్షం మాట్లాడినప్పుడు ప్రభుత్వం వినాలని గుర్తు చేశారు. వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా సైతం ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. పార్లమెంటులో మాట్లాడేందుకు సభ్యులను అనుమతించాలన్నారు. ప్రభుత్వం నిజంగా చర్చ కోరుకుంటే.. ప్రతిపక్ష నాయకుడు మాట్లాడేందుకు ఒక్క నిమిషం కూడా ఎందుకు అనుమతించలేదని ప్రశ్నించారు.