మోదీ, అమిత్ షా, ఆర్‌ఎస్‌ఎస్ నేతల చుట్టూ ఉచ్చు బిగుస్తోంది
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ స్పష్టీకరణ
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్‌ఎస్‌ఎస్)లపై దశాబ్ద కాలంగా సాగిస్తున్న పోరాటం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగదని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ప్రభుత్వ పెద్దల వ్యూహాలు, ఎత్తుగడలు తనకు పూర్తిగా తెలుసని, పిరికితనమే వారి ప్రధాన లక్షణమని ఎద్దేవా చేశారు. ఈ మేరకు రాహుల్ శుక్రవారం ‘ఎక్స్’లో పోస్టుచేశారు. మోదీ ప్రభుత్వం, ఆర్‌ఎస్‌ఎస్ విధానాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఒక వీడియో సందేశం విడుదల చేశారు.
భారత రాజ్యాంగాన్ని కాపాడుకునేందుకు ఎంతటి పోరాటానికైనా సిద్ధమని పేర్కొన్నారు. ప్రభుత్వంపై పోరాడుతున్న యువతకు అండగా నిలుస్తామని ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భాగవత్, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌ను ఈ కథలో ప్రతినాయకులుగా(విలన్లు) రాహుల్ గాంధీ అభివరి్ణంచారు. వీరందరి చుట్టూ క్రమంగా ఉచ్చు బిగుస్తోందని, ఆ పని తామే చేస్తున్నామని ఉద్ఘాటించారు. ఒక ప్రత్యరి్థని అర్థం చేసుకున్నట్లుగానే వారి ప్రతి కదలికను తాను లోపలి నుంచి పూర్తిగా అర్థం చేసుకున్నానని తెలిపారు.
ఎంతమందిని అరెస్టు చేస్తారో చేసుకోండి
పోలీసు బలగాలను అడ్డం పెట్టుకుని భయపెట్టాలని చూస్తే వెనక్కి తగ్గేది లేదని రాహుల్ సవాల్ విసిరారు. ‘‘మోదీజీ.. మీకు ఇష్టం వచ్చింది చేసుకోండి. 10 వేలు, 20 వేలు, 50 వేలు.. మీకు ఎంతమంది కావాలంటే అంతమంది పోలీసులను రప్పించుకోండి. విపక్ష నాయకులందరినీ, యువతను, మమ్మల్ని అందరినీ అరెస్టు చేయండి. ఎంతమందిని అరెస్టు చేస్తారో చేసుకోండి. కానీ, మేము మిమ్మల్ని చుట్టుముడుతున్నాం. వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు’’అని తేల్చిచెప్పారు. మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడేందుకు అవసరమైన సమాచారం ఇప్పటికే తమ వద్ద ఉందని వెల్లడించారు.


