
న్యూఢిల్లీ: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ 2025, డిసెంబర్ ఐదారు తేదీలలో భారత్‌కు వచ్చి, ప్రధాని నరేంద్ర మోదీని కలుసుకునే అవకాశం ఉందని సమాచారం. రష్యా చమురు కొనుగోలుపై అమెరికా న్యూఢిల్లీపై శిక్షాత్మక సుంకాలను విధించిన దరిమిలా ఇరు దేశాల మధ్య సంబంధాలు బలపడుతున్న తరుణంలో పుతిన్, ప్రధాని మోదీల భేటీ కీలకంగా మారనుంది.
గత ఆగస్టులో జాతీయ భద్రతా సలహాదారు (ఎన్‌ఎస్‌ఏ)అజిత్ దోవల్ మాస్కో పర్యటన సందర్భంగా ఈ ఉన్నత స్థాయి పర్యటనను తొలుత ప్రకటించారు. అయితే ఆ సమయంలో తేదీలను ఖరారు చేయలేదు. రష్యా అధ్యక్షుడు ఇటీవల చైనాలో జరిగిన షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ) శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని మోదీని కలుసుకున్నారు.
సుంకాల విషయమై న్యూఢిల్లీ, వాషింగ్టన్ మధ్య ఉద్రిక్తతల మధ్య రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్ రానుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. భారత్- రష్యాలు ఎన్నో ఏళ్లుగా ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడి సంబంధాలు కలిగివున్నాయి. భారత్‌కు ఆయుధ సరఫరాదారులలో రష్యా ముందు వరుసలో ఉంటుంది. అలాగే రష్యన్ చమురును భారీగా దిగుమతి చేసుకుంటున్నదేశాలలో భారత్ ఒకటిగా నిలిచింది. కాగా అధ్యక్షుడు పుతిన్ పర్యటన భారత భౌగోళిక రాజకీయ వ్యూహాలలో కీలకంగా మారనుంది.