
పంజాబ్‌లో ఒక్కరోజే 12 ఎఫ్‌ఐఆర్‌లు
జైళ్లకు పంపిస్తామని హెచ్చరించినా ఆగని రైతులు
ఢిల్లీకి పొంచి ఉన్న వాయు కాలుష్యం
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీకి పొరుగునున్న పంజాబ్‌లో మళ్లీ పంట వ్యర్థాల దహనాలు మొదలయ్యాయి. ఇలా పంట వ్యర్థాలకు నిప్పు పెడితే ఉపేక్షించరాదని, అవసరమైతే కొందరు రైతులను జైలుకు పంపాలని ఇటీవల సుప్రీకోర్టు సైతం కన్నెర్ర చేసింది. రైతులు మాత్రం పట్టించుకోకుండా గడ్డి దుబ్బలను దహనం చేస్తున్నారు. పంట వ్యర్థాల దహనాలపై ఆదివారం ఒక్క రోజే పంజాబ్‌లో 12 ఎఫ్‌ఐఆర్‌లు నమోదైనట్లు అధికారులు చెబుతున్నారు. పంజాబ్‌లో ఇప్పుడిప్పుడే వరి కోతలు మొదలవుతున్నందున రానున్న రోజుల్లో వ్యర్ధాల దహనం తీవ్రంగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు.
వరి కోతల తర్వాత అక్టోబర్–నవంబర్ నెలల్లో ఢిల్లీలో వాయు కాలుష్యం పెరగడానికి పంజాబ్, హరియాణాల్లో పంట వ్యర్థాలను కాల్చడమే ప్రధాన కారణమని అధికారులు అంటున్నారు. వరి కోతకు, రబీలో గోధుమలను విత్తడానికి మధ్య సమయం తక్కువగా ఉండటంత్లో రైతులు తరచుగా వ్యర్థాలకు నిప్పు పెడుతున్నారు. ఇది ప్రత్యక్షంగా, పరోక్షంగా శీతాకాలంలో ఢిల్లీలో కాలుష్యం పెరిగేందుకు కారణమవుతోంది.
ఈ దృష్ట్యా పంట దహనాలను నివారించేందుకు కేంద్రం భూ విస్తీర్ణం ఆధారంగా రూ.5వేల నుంచి రూ.30వేల వరకు జరిమానాలు విధిస్తూ కేంద్రం గత ఏడాది ఉత్తర్వులిచి్చంది. ఢిల్లీలో గాలి నాణ్యత సూచీ 400 మార్కును దాటుతుండటం, ప్రజలకు తీవ్ర శ్వాసకోశ వ్యాధులతో పాటు ఇతర అనారోగ్యాలను ఎదుర్కొంటుండటంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. గత ఏడాది 1,500 మందికి పైగా రైతులకు జరిమానాలు సైతం విధించారు. దీంతో పాటే పంట వ్యర్థాలను కాల్చే సంఘటనలను నివారించేందుకు 8వేల మంది నోడల్ అధికారులతో ఓ ప్రత్యేక దళాన్ని సైతం ఏర్పాటు చేశారు. దీనికి తోడు సెక్షన్ 223 కింద గత ఏడాది 5,797 కేసులు సైతం నమోదయ్యాయి. ఇందులో ఒక్క సంగ్రూర్ జిల్లాలోనే 1,725 కేసులు నమోదయ్యాయి.